Table of Contents
Kuberaa Telugu Review.. గత కొన్నాళ్లుగా వెండితెరపై సినిమా చూస్తున్నప్పుడు, అనుకోకుండా చేయి, పాకెట్‌లోకి జారిపోతోంది.. పాకెట్‌లోంచి మొబైల్ ఫోన్ బయటకు వస్తోంది.
సినిమా చూస్తేనే, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చెక్ చేసుకోవడం, ట్వీట్లు చూసుకోవడం, యూ ట్యూబ్ కంటెంట్‌ని స్వైప్ చేయడం.. ఇదీ జరుగుతున్న వ్యవహారం.
నా ఒక్కడికే కాదు, ఏ సినిమా థియేటర్లో చూసినా, ఆడియన్స్ దాదాపు ఇదే మూడ్‌లో వుంటున్నారు. సూపర్ హిట్ సినిమాలనదగ్గవాటికి కూడా ఇదే జరుగుతోంది.
Kuberaa Telugu Review.. మొబైల్ ఫోన్ వైపు దృష్టి మళ్ళకుండా..
తప్పెక్కడ జరుగుతున్నట్లు.? పసలేని సినిమాలు తీస్తుండడం వల్లా.? అరచేతిలోనే అంతకు మించిన ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులకు దొరుకుతుండడం వల్లా.?
ఇప్పుడిదంతా ఎందుకంటే, ‘కుబేర’ సినిమా చూస్తున్నప్పుడు ఓ నాలుగైదు సార్లు తప్ప, మొబైల్ ఫోన్ మీదకు దృష్టి మళ్ళలేదు.

మూడు గంటలకు పైగా నిడివి వున్న సినిమాకి సంబంధించి, కేవలం మూడు నాలుగు సార్లు మాత్రమే మంబైల్ ఫోన్ వైపు చూడాల్సి వచ్చిందంటే, తెరకి కళ్ళను అప్పగించేసినట్లే కదా.?
కుబేర కథా కమామిషు..
లక్షల కోట్లకు అధిపతి.. అయినా, డబ్బు మీద వ్యామోహం తగ్గని బిజినెస్ మేన్, పూట గడవని బిచ్చగాడు.. ఈ ఇద్దరి మధ్యలో, ఓ మాజీ సీబీఐ అధికారి.. ఈ మూడు పాత్రల చుట్టూ కథ.
దర్శకుడు శేఖర్ కమ్ముల అంటే, అతని సినిమాలెలా వుంటాయో.. అతని కథలెలా వుంటాయో.. అతని నేరేషన్ ఏంటో.. ఓ ఐడియా వుంటుంది.
‘కుబేర’ సినిమా ప్రోమోస్ చూసినప్పుడే, శేఖర్ కమ్ముల ఏదో కొత్తగా ట్రై చేస్తున్నాడనే భావన అందరిలో కలిగే వుంటుంది. సినిమా చూశాక, అది నిజమని అర్థమవుతుంది.
Kuberaa Telugu Review.. శేఖర్ కమ్ముల మార్క్..
ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు.. శేఖర్ కమ్ముల తన మార్క్ చూపించాడు. తన సినిమాల్లోని కొన్ని సన్నివేశాల్ని కూడా శేఖర్ కమ్ముల రిపీట్ చేసినట్లనిపిస్తుంది.
అయితే, సోషల్ మెసేజ్ ఇచ్చే క్రమంలో క్లాసులు పీకలేదు. బీభత్సమైన యాక్షన్ ఎపిసోడ్స్‌ని అనవసరంగా ఇరికించలేదు. హీరోయిజాన్ని ఎలివేట్ చేయాలనీ అనుకోలేదు.
తన కథకి తగ్గట్టుగా కొన్ని పాత్రల్ని రాసుకున్నాడు, ఆ పాత్రల్లోకి నటీనటులు పరకాయ ప్రవేశం చేశారంతే. తెరపై నాగార్జున కనిపించడు, ధనుష్ కూడా కనిపించడు.
పాత్రలే కనిపిస్తాయి.. నటులు కాదు..
దీపక్ పాత్రలో నాగ్, దేవా పాత్రలో ధనుష్ జీవించేశారని చెప్పొచ్చు. బిజినెస్ మేన్ నీరజ్ పాత్రలో జిమ్ ష్రబ్ అంతకు మించి జీవించేశాడు.
రష్మిక పాత్ర నిడివి తక్కువే, ఆమె కూడా ‘సమీరా’ పాత్రలో ఒదిగిపోయింది.
ఓ వైపు, లక్ష కోట్ల వ్యవహారం.. ఇంకో వైపు, చెత్త కుప్పల్లో హీరో, హీరోయిన్, విలన్.. కాస్సేపు మనల్ని మనమే నమ్మలేం. మనల్ని కూడా, ఆ చెత్త కుప్పల్లోకి తీసుకుపోతాడు దర్శకుడు.
అంతలా, సినిమాలో లీనమైపోతాం. అలాగని, సాగతీత సన్నివేశాల్లేవా.? అంటే, వున్నాయ్.. కానీ, తక్కువే. లాజిక్‌కి అందని సన్నివేశాలూ వున్నాయ్. సినిమాటిక్ లిబర్టీ అంతే.
టెక్నికల్ డిపార్ట్‌మెంట్స్ విషయానికొస్తే, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అలానే సినిమాటోగ్రఫీ.. ఈ రెండూ సినిమాకి ఆయువుపట్టులా మారాయి.
టెక్నికల్లీ సౌండ్..
కొంచెం సాగతీత.. అనిపించిన సమయంలో, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కవర్ చేసింది. సినిమాటోగ్రఫీ కూడా ఇంకాస్త బాగా పని చేసింది. వెరసి, స్క్రీన్ మీద నుంచి ప్రేక్షకుడి దృష్టి పక్కకు వెళ్ళకుండా చేయగలిగారు.
సినిమా చాలా అంటే, చాలా రిచ్‌గా తెరకెక్కింది. క్వాలిటీ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవలేదు. డైలాగ్స్ ఆకట్టుకున్నాయి, ఆలోచింపజేశాయి కూడా.
ఎడిటింగ్ క్రిస్పీగానే వుంది.. ఎక్కువ నిడివి కావడంతో, అక్కడక్కడా కత్తెర పదును చూపించి వుంటే బావుంటుందని అనిపించడం సహజమే.
అసలంటూ దనుష్‌కి ఏం చెప్పి, ఈ సినిమా కోసం శేఖర్ కమ్ముల ఒప్పించి వుంటాడు.? శేఖర్ కమ్ముల ఒప్పించాల్సిన పని లేదు,
‘దేవా’ పాత్ర గురించి శేఖర్ కమ్ముల చెప్పగానే, ధనుష్ స్పెల్ బౌండ్ అయిపోయాడు. మన తెలుగులో ఇలాంటి పాత్రని చేసే హీరో లేరని నిస్సందేహంగా చెప్పొచ్చు.
దీపక్ తేజ పాత్ర కూడా అంతే. మంచోడా.? చెడ్డోడా.? అంటే, జడ్జ్ చేసుకోవడం కష్టం. మంచోడే, తప్పనిసరై చెడ్డోడిగా మారతాడు.. మళ్ళీ అతనిలో మంచి మేల్కొంటుంది. ఇదీ దీపక్ తేజ పాత్ర.
ఆ మ్యాజిక్.. ప్చ్..
దీపక్ సర్.. అని దేవా పిలుస్తున్నప్పుడు.. ఓ కనెక్టివిటీ కనిపిస్తుంది. నాని – నాగార్జున, కార్తీ – నాగార్జున.. కాస్త ఇంట్రెస్టింగ్ కాంబినేషన్స్.
అలా చూస్తే, మూడిట్లోకీ కార్తీ – నాగార్జున కాంబినేషన్ వేరే లెవల్.! ఆ మ్యాజిక్, ‘కుబేర’ నుంచి ఆశించకూడదు. ఎందుకంటే, ఈ కథ వేరే.!
కానీ, ఖచ్చితంగా కార్తీ – నాగార్జున మ్యాజిక్‌ని ధనుష్ – నాగార్జున కాంబినేషన్ నుంచి ఆశించకుండా వుండలేం. ఆ కాంబినేషన్, ఆ ఇద్దరి మధ్యా ‘ఊపిరి’ సినిమాలో కెమిస్ట్రీ అలాంటిది.
Kuberaa Telugu Review.. అంత నిడివి.. లాక్కురావడం కష్టమే..
రాజకీయ వ్యవస్థ ఎలా తగలడింది.? సామాన్యులు కూడా బిచ్చగాళ్ళని ఎంత హేయంగా చూస్తున్నారు.? ఇవన్నీ సినిమాలో చక్కగా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు శేఖర్ కమ్ముల.
రాజకీయ అవినీతి.. లక్ష కోట్లు.. ఈ సినిమాలో మెయిన్ ఎలిమెంట్. సాధారణంగా ఈ కాన్సెప్ట్ అంటే, సినిమాని మంచి పేస్‌తో నడపడం కష్టం.
దానికి బిచ్చగాడ్ని లింక్ చేసి శేఖర్ కమ్ముల రాసుకున్న కథ, కథనం.. సూపర్బ్ అంతే.
చాన్నాళ్ళ తర్వాత ఓ మంచి సినిమా చూసి అనుభూతి కలిగింది. సినిమా ప్రమోషన్లలో భాగంగా శేఖర్ కమ్ముల చాలానే చెప్పాడు. ‘అతి’ చేయలేదు, అసలు విషయమే చెప్పాడు.
శేఖర్ కమ్ముల ఇంకాస్త ఎక్కువ చెప్పి వున్నా.. అది తప్పు కాదు.!