Sachin Tendulkar.. ఏమవుద్ది టీమిండియా ఓడిపోతే.? జస్ట్ అదొక మ్యాచ్ అంతే. అది వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కావొచ్చు.. దాయాది పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్ కావొచ్చు.! అంతిమంగా ఆట అన్నాక గెలుపోటములు సహజం.
సరే, ఓడిపోవాల్సి వచ్చినా అది గౌరవప్రదమైన ఓటమిలా వుండాలని అభిమానులు భావించడాన్నీ తప్పు పట్టలేం. కానీ, ఒక్కోసారి పరిస్థితులు బెడిసి కొడతాయ్ మరి.!
2022 టీ20 వరల్డ్ కప్ టైటిల్ ఫేవరెట్‌గా టీమిండియా బరిలోకి దిగింది. కానీ, సెమీస్‌లో బోల్తా కొట్టింది. ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయింది టీమిండియా.
గెలుపోటముల్ని సమానంగా స్వీకరించాలి..
ఒక్క వికెట్ కూడా టీమిండియా బౌలర్లు ఆ మ్యాచ్‌లో తీయలేకపోయారన్న ఆవేదన అభిమానుల్లో వుండడం తప్పు కాదు. కానీ, ఆ మాత్రందానికే టీమిండియా మీద విపరీతమైన ద్వేషాన్ని ప్రదర్శిస్తే ఎలా.?

టీమిండియా అద్భుత విజయాలు సాధించినప్పుడు ‘అహో.. ఒహో..’ అని కీర్తించేదీ మనమే.. ‘చెత్త నా డాష్‌లు’ అంటూ ఓడినప్పుడు దూషించేదీ మనమే.
130 కోట్ల మంది భారతీయుల ఆశల్ని కేవలం 11 మంది ఆటగాళ్ళు మైదానంలో మోయడమంటే చిన్న విషయం కాదు. ఆటగాళ్ళు తమ శక్తి మేర ఆటతీరుని ప్రదర్శించకపోవచ్చు. అది జస్ట్ టైమ్ బ్యాడ్ అంతే.
Sachin Tendulkar పెద్దన్న సచిన్ చెప్పిన మాట ఇదీ..
నాణానికి రెండు వైపులుంటాయ్.. అలాగే ఆటలో గెలుపోటములూ వుంటాయ్. జీవితం అంటేనే అంత.! గెలుపునీ, ఓటమినీ సమానంగా తీసుకోవాలి.. అని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ చెప్పుకొచ్చాడు.
ఇంగ్లాండ్ చేతిలో పరాజయం పాలై, 2022 టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్ నుంచి టీమిండియా నిష్క్రమించడంపై సచిన్ టెండూల్కర్ సోషల్ మీడియా వేదికగా పై విధంగా స్పందించాడు.
Also Read: అప్పుడే చచ్చిపోను: కంటతడి పెట్టిన సమంత.!
ఔను, మాస్టర్ బ్లాస్టర్ కంటే బాగా ఇలాంటి సందర్భాల గురించి ఇంకెవరు ప్రస్తావించగలరు.? సచిన్ కూడా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు.
జట్టుని గెలిపించి ప్రశంసలు అందుకున్న సచిన్, జట్టు ఓడిపోయినప్పుడు.. విమర్శల్నీ ఎదుర్కొన్నాడు. ఓటమి వల్ల వచ్చిన విమర్శలు తాత్కాలికం. ఆ సంగతి సచిన్‌కి కూడా బాగా తెలుసు.
అందుకే, బాధ్యతాయుతంగా స్పందించాడు. అది టీమిండియాకి బోల్డంత బలాన్ని ఇస్తుందనడం నిస్సందేహం.