బాలీవుడ్ కండల వీరుడు, సీనియర్ సిటిజన్ అయిపోతోన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.. సల్మాన్ ఖాన్ నుంచి సినిమా వస్తోందంటే, ఆ హైప్ మామూలుగా వుండదు. ప్రతి యేడాదీ ‘ఈద్’ స్పెషల్ రిలీజ్ కోసం ప్లాన్ చేసుకునే సల్మాన్ ఖాన్, ఈసారి కూడా ‘రాధే’ (Salman Khan Radhe Review Disha Patani) సినిమాతో ఈద్ సంబరాలు తీసుకొచ్చేశాడు.
ఇంతకీ, ‘రాధే’ సినిమా ఎలా వుంది.? కథ, కాకరాకాయ్.. ఇవేవీ సల్మాన్ ఖాన్ అభిమానులు ఆయన సినిమాల నుంచి ఆశించరు. అందుకే, సల్మాన్ ఖాన్ కూడా వాటి గురించి పట్టించుకోడు. ఏదో కథ, ఇంకేదో కథనం.. కానీ, అందులో తన అభిమానుల్ని మెప్పించే డైలాగులు, డాన్సుల్లాంటివి, కొన్ని ఫైట్స్, తన మార్కు కామెడీ వుండేలా చూసుకుంటాడు.
‘రాధే’ సినిమా నుంచి కూడా అంతకు మించి ఏదీ ఆశించకూడదు. సినిమాకి వెళ్ళేవాళ్ళు కూడా సల్మాన్ ఖాన్ అభిమానుల్లానే వెళ్ళాలేమో. లేదంటే, అటువైపు వెళ్ళడం కూడా మంచిది కాదు. ‘రాధే’ సినిమా చూశాక కూడా చాలామంది అదే అభిప్రాయానికి వస్తారు. కానీ, మళ్ళీ సల్మాన్ ఖాన్ నుంచి ఏదన్నా సినిమా వస్తే, అనుకోకుండా అటువైపు ఆకర్షితులైపోతారు.. అదే సల్మాన్ ఖాన్ మ్యాజిక్.
ఇంకో చిత్రమేంటంటే, చెత్త సినిమాలనదగ్గవి కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో వసూళ్ళు సాధించేస్తాయి.. దటీజ్ సల్మాన్ ఖాన్. ‘రాధే’ సినిమాలో దిశా పటానీ వుందిగానీ.. ఆమె పాత్ర జస్ట్ గ్లామర్ డాల్ అంతే. దర్శకత్వం, సంగీతం, సినిమాటోగ్రఫీ.. ఇలా దేని గురించీ ప్రత్యేకంగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. ఇతర నటీనటుల గురించి అసలే మాట్లాడుకోడానికి వీల్లేదు.
అసలు సల్మాన్ ఖాన్ సినిమాలకి రివ్యూలు రాయడమే దండగ.. అని కొందరు అనుకుంటుంటారు. చెత్త సినిమా.. అంటూ ఒకటి, ఒకటిన్నర రేటింగులు (5 పాయింట్లకి) ఇస్తుంటారు. ముందే చెప్పుకున్నాం కదా.. రేటింగులతో సంబంధం లేకుండా సల్మాన్ ఖాన్ సినిమాలు భారీ వసూళ్ళను సాధించిన సందర్భాలున్నాయి.
కానీ, కరోనా దెబ్బకి ‘రాధే’ థియేటర్లలో విడుదలయ్యే పరిస్థితి లేదు. ఓటీటీ, పే పర్ వ్యూ.. విధానంలో ఇంట్లోకే సినిమా వచ్చేసింది. ఖచ్చితంగా త్వరలో థియేటర్లలోకి కూడా వస్తుందట.. అదీ, కరోనా భయాలు తగ్గాక. ఇది సల్మాన్ ఖాన్ (Salman Khan Radhe Review Disha Patani) చెప్పిన విషయమే.
ఇంట్లో ఈ సినిమా చూసేశాక.. సినిమా థియేటర్లలో మళ్ళీ చూసేంత రిస్క్ ఎవరు తీసుకుంటారు.? దర్శకుడు ప్రభుదేవా ఏం ఉద్ధరించాడని.? సల్మాన్ ఖాన్ కొత్తగా ఏం చేశాడని.? ఈ సినిమాని ఇంకోసారి థియేటర్లలో చూడాలి.!