Sarvam Maya Telugu Review.. దెయ్యం సినిమాలంటే, భయపెడతాయ్.! కానీ, ఇది మంచి దెయ్యం.! హీరోకి సాయం చేస్తుంది.. తన కోరికల్నీ తీర్చుకుంటుంది.! కోరికలంటే, బూతు కోరికలు కాదు సుమీ.!
సినిమా టైటిల్ ‘సర్వం మాయ’.! ఇదొక మలయాళ సినిమా. ఓటీటీ పుణ్యమా అని తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది.
నటీనటులేమో నివిన్ పాలీ, రియా సింబు, అజూ వర్గీస్, ప్రీతి ముకుందన్ తదితరులు. ప్రియా ప్రకాష్ వారియర్ ఓ గెస్ట్ రోల్‌లో కనిపిస్తుంది.
ఆ మాటకొస్తే, ప్రీతి ముకుందన్‌ది కూడా గెస్ట్ రోల్ లాంటిదే. కాకపోతే, కాస్త నిడివి ఎక్కువ వున్న పాత్ర దొరికింది ప్రీతి ముకుందన్‌కి. చాలా అందంగా చూపించాడు దర్శకుడు ఆమెని.
తెలుగులో ‘కన్నప్ప’ సినిమా చేసింది ప్రీతి ముకుందన్. ‘కన్నప్ప’లో అవసరం లేకపోయినా, అత్యంత వల్గర్‌గా ప్రీతి ముకుందన్‌ని చూపించిన సంగతి తెలిసిందే.
సరే, ‘కన్నప్ప’ ప్రస్తావన పక్కన పెట్టి, ‘సర్వం మాయ’ సినిమా కథా కమామిషు ఏంటో చూసేద్దాం.!
కథ ప్రారంభం నుంచి, ముగింపు వరకు.. సరదా సరదాగా సాగిపోతుందంతే. అక్కడక్కడా ఎమోషనల్ సీన్స్, మనసుల్ని బలంగా తాకుతాయ్.
Sarvam Maya Telugu Review.. ఇదీ ఆ దెయ్యం కథ..
సద్భ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ప్రబేందు, కుటుంబానికి దూరంగా వుంటాడు. సంగీతమంటే అతనికి ప్రాణం. చాలా ఏళ్ళ తర్వాత, తల్లిదండ్రుల దగ్గరకి వస్తాడు.
ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో, పౌరోహిత్యానికి సిద్ధమవుతాడు. కజిన్ రూపేష్‌తో కలిసి పౌరోహిత్యం చేస్తాడు. రూపేష్ ఓ సందర్భంలో గాయపడి, మంచానికి పరిమితమవుతాడు.
దాంతో, రూపేష్ ఒప్పుకున్న పౌరోహిత్యం పనులు ప్రభేందు ఒక్కడే చూసుకోవాల్సి వస్తుంది. ఓ కుర్రాడికి అనారోగ్య సమస్య తలెత్తితే, దెయ్యం పట్టిందన్న కోణంలో పూజలు చేయిస్తారు ప్రభేందుతో.
పూజ జరుగుతున్న సమయంలోనే, ఆ అబ్బాయి ఆరోగ్యం కుదుటపడుతుంది. కానీ, తిరిగి ఇంటికి వచ్చినప్పటినుంచి ప్రభేందుకి సంకటం ఏర్పడుతుంది.
ఓ దెయ్యం, ప్రభేందు వెంట పడుతుంది. ప్రభేందు ఇంట్లోనే వుంటుంది. కాకపోతే, అతని ఫోన్ మాత్రమే వాడుతుంటుంది. పోన్ సాయంతో, ఆన్‌లైన్‌లో దుస్తుల్ని కొంటుంది ఆ దెయ్యం.
అసలు ఆ దెయ్యం ఎవరు.? ఆ దెయ్యానికి వున్న కోరికలేంటి.? మ్యూజిక్ విషయంలో ప్రభేందుకు ఆ దెయ్యం ఎందుకు సాయ పడింది.?
ప్రభేందుతో ప్రేమలో పడిన ఆ దెయ్యం పరిస్థితేంటి.? దెయ్యం నుంచి ప్రభేందు తప్పించుకున్నాడా.? మ్యూజిక్ జర్నీలో పరిచయమైన సాద్య (ప్రీతి ముకుందన్)తో ప్రభేందు ప్రేమ ఏమయ్యింది.?
ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే, సినిమా చూడాల్సిందే.!
మలయాళ సినిమాల్లో పాత్రల్ని బలంగా రాసుకుంటుంటారు. అదే మలయాళ సినిమాలకు సంబంధించి ‘రచన’ తాలూకు బలం.!
ప్రభేందు పాత్రనీ, అలానే దెయ్యం (మాయ) పాత్రనీ భలే డిజైన్ చేసుకున్నారు. మాయకి ‘డెలులు’ అని పేరు పెడతాడు. ‘డెలులు’ అంటే, ‘మాయ’ అని అర్థమని చివర్లో తెలుస్తుంది.
సినిమాలో ఏ పాత్ర కూడా, పాత్ర పరిధిని దాటి ఓవరాక్షన్ చెయ్యలేదు. పాత్రకి ఎంత అవసరమో.. అంతే.. అన్నట్లుగా అన్ని పాత్రల్లోనూ ఆయా నటీనటులు తమ నటనా ప్రతిభను చాటుకున్నారు.
నేపథ్య సంగీతం సినిమాని ఆహ్లాదంగా మార్చేసింది. సినిమాటోగ్రఫీ, సినిమాలోని ప్రతి సన్నివేశాన్నీ అందంగా చూపించింది.
చూస్తున్నంతసేపూ, ఇదేదో మలయాళ సినిమా.. అన్న భావనే కలగదు. అంతలా కథతో కనెక్ట్ అయిపోతాం. పాత్రల్ని అర్థం చేసేసుకుంటాం.
తెలుగులో రామ్ – తమన్నా జంటగా ‘ఎందుకంటే ప్రేమంట’ పేరుతో ఓ సినిమా వచ్చింది. అక్కడక్కడా ఆ సినిమా మనకి గుర్తొస్తుంటుంది ఈ ‘సర్వం మాయ’ చూస్తున్నప్పుడు.
క్లయిమాక్స్ కూడా అలానే వుంటుందా.? అనిపిస్తుందిగానీ.. ఆ ఛాయల్లో వుండదు. ఓవరాల్‌గా ఇదొక ఫీల్ గుడ్ మూవీ.!
దెయ్యాన్ని ఇలాక్కూడా చూపించొచ్చు.. వల్గారిటీకి అస్సలేమాత్రం తావివ్వలేదు. కుటుంబ సమేతంగా సినిమాని చూసెయ్యొచ్చు.
అక్కడక్కా స్లో పేస్.. అనిపిస్తుందిగానీ, అది చాలా తక్కువ సందర్భాల్లోనే. వీలైతే, కాస్త తీరిక చూసుకుని, ఓటీటీలో ‘సర్వం మాయ’ మీద ఓ లుక్కేసెయ్యండి.
