Shikhar Dhawan Divorce Ayesha Mukherjee ఈ రోజుల్లో భార్యాభర్తలు విడిపోవడం చాలా సింపుల్. ప్రేమ, సహజీవనం, పెళ్ళి విడాకులు.. ఇదో సరదా వ్యవహారమైపోయింది. ఇందులో కొన్ని ఫేజ్‌లు ఖచ్చితంగా వుండాలనే రూల్ ఏమీ లేదు. ప్రేమతోనే బ్రేకప్.. సహజీవనంలో మోజు తీరాక విడిపోవడం.. పెళ్ళయ్యాక విడాకులు.. ఇలా బోల్డన్ని వింతల్ని పరమ రొటీన్‌గా చూసేస్తున్నాం.
టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్, అయేషాని కొన్నాళ్ళ క్రితం పెళ్ళాడిన విషయం విదితమే. అయేషాతో శిఖర్ ధావన్ వైవాహిక జీవితం ఎనిమిదేళ్ళపాటు సజావుగానే సాగింది. ఈ ఇద్దరి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా ‘జోరావర్’ జన్మించాడు.
అన్నట్టు, అయేషాకి అంతకు ముందే పెళ్ళయిపోయింది.. ఇద్దరు పిల్లలున్నారు. మొదటి భర్తకు దూరమయ్యాక, శిఖర్ ధావన్‌తో ప్రేమలో పడింది. ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే, శిఖర్ ధావన్ కంటే అయేషా దాదాపు పన్నెండు సంవత్సరాలు పెద్దది కావడం. ప్రేమకు వయసు తేడాతో పనేంటి.? అంటారా.. అది వేరే సంగతి.
ఇంకా చిత్రమైన విషయమేంటంటే, శిఖర్ ధావన్‌తో తాను విడిపోయినట్లు తొలుత అధికారికంగా ప్రకటించేసింది అయేషా. అంతేనా, మొదటిసారి (మొదటి భర్తతో) విడాకులు తీసుకున్నప్పుడు కొంత భయం వుండేదనీ, రెండో సారి విడాకులు తీసుకునే విషయమై ఇంకాస్త ఎక్కువ భయపడ్డాననీ, అయితే.. రెండు సార్లు విడాకులు తీసుకోవడం తనలో ధైర్యాన్ని పెంచిందనీ అయేషా చెప్పడం.
ఆలుమగల మధ్య ‘టెర్మ్స్’ సెట్ అవకపోతే విడాకులు తీసుకోవడాన్ని తప్పు పట్టలేం. కానీ, అన్యోన్య దాంపత్యం.. అప్పడాల కర్ర.. అంటూ కహానీలు చెప్పి, విపరీతమైన పబ్లిసిటీ చేసేసుకుని, సింపుల్‌గా విడాకులిచ్చేయడాన్నే ఒకింత జీర్ణించుకోవడం కష్టం.
ఎవరి జీవితాలు వాళ్ళవి.. కానీ, సెలబ్రిటీలు కదా.. వాళ్ళకు సంబంధించి ఏదైనా చర్చనీయాంశమే అవుతుంది. ఇంతకీ, అయేషా – శిఖర్ ధావన్ (Shikhar Dhawan Divorce Ayesha Mukherjee) ఎందుకు విడిపోయినట్టు.?