కాస్సేపు ఇద్దరూ ఎందుకు తిట్టుకున్నారో ఎవరికీ అర్థం కాలేదు. ఏదో సరదాగా వీకెండ్‌లో హోస్ట్ నాగార్జున యెదుట చిన్నపాటి సన్నివేశంలో కామెంట్స్ ఎక్స్‌ఛేంజ్ అయ్యాయి డేత్తడి హారిక, ఇస్మార్ట్ సోహెల్ మధ్య (Sohel Vs Harika BB4 Telugu). అది కాస్తా నామినేషన్స్ ఎపిసోడ్‌లో అత్యంత కీలకమైన అంశంగా మారిపోయింది. ఎవరూ తగ్గలేదు.
నీకంటే ఎక్కువ నేను.. అన్నట్టుగా ఒకర్ని మించిపోయి ఒకరు రెచ్చిపోయారు. ఈ తతంగాన్ని చూస్తోన్న ఆడియన్స్ ఏమనుకుంటారోనన్న ఇంగితం ఇద్దరిలోనూ కనిపించలేదు. అసలు అది నామినేషన్స్ కోసం ఉపయోగించడం సబబేనా.? అన్న ఆలోచన లేని సోహెల్‌ని ‘ఇస్మార్ట్’ అని ఎలా అనగలం.?
సోహెల్ రెచ్చిపోయాడు సరే, హారిక ఎందుకు హద్దులు దాటేసింది.? ఏం, కోపం సోహెల్‌కేనా.? నేను ఊర మాస్.. అనిపించుకోవడానికి హారిక కష్టపడింది. ఇద్దరూ స్క్రీన్ స్పేస్ దొరకబుచ్చుకోవడం కోసం ఒకర్నొకరు తిట్టుకున్నారు తప్ప, అంతకు మించి ఇద్దరికీ అస్సలు టాపిక్ లేదన్నట్టు తయారైంది పరిస్థితి.
సోహెల్ ఇంకోసారి హారికని బాడీ షేమింగ్ చేశాడు.. ‘పొట్టి’ అంటూ. ఇది చాలా తీవ్రంగా పరిగణించాల్సిన అంశమే. ఎలాగూ వీకెండ్‌లో నాగ్ ఈ అంశమ్మీద క్లాస్ తీసుకుంటాడేమో. అది కూడా షో రేంజ్ పెరగడానికే అవుతుంది తప్ప.. నిఖార్సయిన వార్నింగ్ అయితే హౌస్‌మేట్స్‌కి నాగార్జున నుంచి పడటంలేదు.
బిగ్‌బాస్ కూడా, ఈ తరహా ‘నోటి దూల’ వ్యవహారాలకు శిక్షలు వేయకపోవడం ఆశ్చర్యకరం. నామినేషన్ల పర్వం కాస్సేపు.. తారు రోడ్డు మీద రేకుల డబ్బాని ఈడ్చినట్లే తయారయ్యిందంటే అతిశయోక్తి కాదేమో.
నాలుగ్గోడల మధ్య కొన్ని రోజులపాటు, వేరే ప్రపంచంతో సంబంధం లేకుండా తామంతా కలసి వుండాలన్న ఇంగితం లేకుండా ఈ అరచుకోవడమేంటట.? (Sohel Vs Harika BB4 Telugu) ఆయా ప్రొఫెషన్స్‌లో తమకంటూ ఓ పేరు సంపాదించుకున్నవాళ్ళిలా తిట్టుకోవడం సిగ్గు చేటు.
పాపులారిటీ కోసమే అయితే మాత్రం.. మరీ ఇంతలా రచ్చకెక్కాలా.?