Table of Contents
Kala Bhairav Liquor Temple Ujjain.. భక్త కన్నప్ప, శివుడ్ని పూజించే క్రమంలో తన కన్నుని తీసి శివుడికి అర్పించాడట. అంతకన్నా ముందు తాను వేటాడిన జింక మాంసాన్ని ప్రసాదంగా పెట్టాడట. ఇదేం భక్తి మహాప్రభో.. అనుకుంటున్నారా.? చాలా వుంటాయ్ ఇలాంటివి. ఇక్కడ మనం చెప్పుకుంటున్న దేవాలయం ఇంకాస్త ప్రత్యేకం.
ఆ గుడి చుట్టూ లిక్కరు షాపులే. ఆ గుడిలోకి వెళ్లాలంటే చేతిలో లిక్కర్ బాటిల్ వుండాల్సిందే. అక్కడి దేవుడ్ని ప్రసన్నం చేసుకోవాలంటే, ఓ క్వార్టర్ వేయాల్సిందే.. భక్తులు కాదు, దేవుడికి (నైవేద్యం). ఏంటీ.? అపచారం.! మహా పాపం అంటారా.?
దైవానికి క్షీరాభిషేకాలు చేయడం వంటి వాటి గురించి కొత్తగా చెప్పేదేముంది.? కానీ, ఓ విచిత్రమైన దేవాలయం వుంది. అక్కడ దేవుడికి లిక్కర్ అంటే ఇష్టమట. ఇదేం చోద్యం అనుకుంటున్నారా.? నిజంగా నిజమండీ. స్వయంగా ఆ గుడి పూజారే అక్కడి దేవుడికి మద్యాన్ని నైవేద్యంగా అందిస్తాడు.
దేవతా మూర్తి నోటి భాగం దగ్గరకు మద్యాన్ని తీసుకెళితే, ఆ విగ్రహంలోకి ఆ లిక్కర్ వెళ్ళిపోతుంది. అందుకే ఆ గుడి ప్రాంగణంలో ఎక్కడ చూసినా పూలు, పళ్లు కొట్లు కన్నా ఎక్కువగా లిక్కర్ దుకాణాలే దర్శనమిస్తాయ్.
వినడానికి వింతగా వున్నా, ఇది ముమ్మాటికీ నిజం. కానీ, ఆ దుకాణాల్లో లభించే మద్యం కేవలం స్వామి నైవేధ్యం కోసమే. ఇంతకీ, ఆ చిత్రమైన దేవాలయం ఎక్కడుంది.? ఏమా కథ.?
కాల భైరవుడి ఆలయంలో ఈ వింత ఆచారం..
స్కంద పురాణంలో ఈ దేవాలయం గురించి ప్రస్తావించారు. అవంతి కాండలో దీని ప్రస్తావన వుంది. భద్రసేన్ అనే ఓ రాజు ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఈ దేవాలయం ప్రస్తుతం మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినిలోని భైరవగర్ ప్రాంతంలో వుంది.

కాల భైరవుడి దేవాలయమిది. అయితే, పురాతన దేవాలయం కాలగర్భంలో కలిసిపోగా, కొన్నేళ్ళ క్రితం ఆ దేవాలయాన్ని పునరుద్ధరించారు. పురాతన కాలానాకి చెందిన శివుడు, పార్వతి, విష్ణువు, గణపతి విగ్రహాలు ఈ ప్రాంతంలో బయటపడ్డాయి.
Kala Bhairav Liquor Temple Ujjain.. ఈ దేవాలయానికి చారిత్రక గాధ కూడా..
మూడవ పానిపట్టు యుద్ధం సమయంలో మరాఠా జనరల్ మహాదాజి షిండే, ఉత్తర భారతదేశంలో మరాఠా రాజ్య స్థాపన కోసం ఈ దేవాలయంలో పూజలు చేసినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే, ఆలయాన్ని ఆయన పునరుద్ధరించారట.
కుంకుమ, సింధూరం కలగలిసిన రూపంలో రాతిపై కాలభైరవుడి విగ్రహం చెక్కబడి తేజోమూర్తిలా కనిపిస్తుంది. అష్ట భైరవ పూజలు ఇక్కడ జరుగుతాయి. ప్రధానంగా తాంత్రిక శక్తుల దుష్ప్రభావాల్ని పోగొట్టేందుకోసం ఈ దేవాలయాన్ని ఎక్కువమంది సందర్శిస్తుంటారు.
అలాగే తాంత్రిక శక్తుల కోసం పరితపించేవారూ కాలభైరవుడ్ని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారని స్థానికులు చెబుతుంటారు. ఇక్కడి కాలభైరవుడ్ని ఉజ్జయిని రక్షకుడిగా భావిస్తారు.
విగ్రహానికి మద్యం సమర్పించడం..
ఆలయం బయట మద్యం షాపులు కనిపిస్తాయి. వీటిల్లో పూలు, పళ్ళు (కొబ్బరికాయ, అరటి పండ్లు సహా మిగతా పండ్లు ఇతర ప్రసాదాలు) కూడా లభిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ ప్రత్యేకంగా లిక్కర్ కౌంటర్లను ఏర్పాటు చేసింది భక్తుల కోసం.
ఓ దశలో మద్యనిషేధం జరుగుతున్న సమయంలో కూడా ఈ దేవాలయం కోసం ఆ నిబంధనల్ని సడలించారంటే ఇక్కడి స్వామిపై నమ్మకం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
Kala Bhairav Liquor Temple Ujjain.. చిదంబర రహస్యం: విగ్రహం మధ్యం సేవించడమేంటీ.?
పూజారి అందించే మద్యాన్ని మాత్రమే విగ్రహం సేవిస్తుందని చెబుతుంటారు. పూజారి మద్యాన్ని ఓ పాత్రలో తీసుకుని, విగ్రహం నోటి వద్దకు చేర్చగానే, ఆ పాత్రలోని మద్యం విగ్రహంలోకి వెళ్ళిపోయినట్లు కనిపిస్తుంది. అందులో మూడోవంతు భాగం తిరిగి ప్రసాదం రూపంలో బయటకు వస్తుందట.
Also Read: మనిషిలా మారుతున్న ‘వానరం’: ఇకనైనా సిగ్గుపడదాం.!
ఆల్కహాల్ విగ్రహంలోకి వెళ్ళినా, ఆ ప్రభావం విగ్రహానికి ఏమీ వుండదు.. అంటే, విగ్రహం పాడైపోవడమంటూ జరగదట. ఇతరులు.. అంటే, భక్తులెవరైనా విగ్రహానికి మద్యం తాగించే ప్రయత్నం చేసినా, మద్యం ఆ విగ్రహం నోట్లోకి వెళ్ళకపోవడాన్ని చాలామంది భక్తులు గమనించారు.
హిందూ దేవాలయాల్లో అద్భుతాలకు కొదవేం లేదు. మూఢ నమ్మకాలని కొందరు కొట్టేసి పారేయొచ్చుగాక.. కానీ, ఆయా దేవాలయాల ప్రత్యేకతలు చూస్తే ఎవరైనా నోరెళ్ళబెట్టాల్సిందే.