Table of Contents
తెలుగు సినిమాకి ఇది పునర్జన్మ.. అని మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. మొత్తంగా సినిమా పరిశ్రమ అంతటిదీ ఇదే పరిస్థితి. తెలుగు సినీ పరిశ్రమ (Solo Brathuke So Better Movie Review) లేదు, హిందీ సినీ పరిశ్రమ లేదు.. హాలీవుడ్ లేదు.. ఇంకే సినీ పరిశ్రమా లేదు.. దాదాపు 9 నెలలపాటు అంతా అయోమయం. దీనంతటికీ కారణం కరోనా వైరస్.
అసలు సినిమా పరిశ్రమ మళ్ళీ తేరుకుంటుందా.? లేదా.? అన్న అనుమానాల నడుమ, ఎలాగైతేనేం సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ రిస్క్ చేశాడు. అలా ప్రేక్షకుల ముందుకొచ్చింది ‘సోలో బ్రతుకే సో బెటర్’. ఎన్నాళ్ళకెన్నాళ్ళకి.? అంటూ థియేటర్లకు పరుగులు తీశారు సినీ ప్రేక్షకులు.. అనేక భయాల నడుమ.
మాస్క్‌లు, సోషల్ డిస్టెన్సింగ్, హ్యాండ్ శానిటైజర్.. ఇలా న్యూ నార్మల్ పాటించక తప్పలేదు. థియేటర్లలో పక్క సీట్లో ఎవరూ కూర్చునే పరిస్థితి లేదు. మధ్యలో ఓ సీట్ వదిలెయ్యాల్సిందే. అయినాగానీ, ఏమీ లేకుండా వుండడం కంటే, ఇదైనా బెటరే కదా.. అనుకుంది సినీ పరిశ్రమ. ప్రేక్షకుడిదీ అదే భావన.
అయితే, సినిమా రిలీజయ్యాక.. నిర్మాత భయపడే పరిస్థితి రాలేదు. సినిమా కోసం ప్రేక్షకులు ఎదురు చూడటమే, సినిమా సగం సాధించేసిందనడానికి నిదర్శనం. సినిమా ఎలా వుంది.? బావుందా.? లేదా.? అన్న అంశాలు నిజానికి, ఈ పరిస్థితుల్లో ప్రస్తావించడమే సబబు కాదేమో. సరే, కథ, కమామిషు ఏంటో తెలుసుకుందాం.
సినిమా టైటిల్: సోలో బ్రతుకే సో బెటర్
నిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర
నటీనటులు: సాయి ధరమ్ తేజ్, నభా నటేష్, రావు రమేష&, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, నరేష్, సత్య, అజయ్ తదితరులు.
ఎడిటింగ్: నవీన్ నూలి
సంగీతం: తమన్
సినిమాటోగ్రఫీ: వెంకట్ సి దిలీప్
నిర్మాత: బివిఎస్‌ఎన్ ప్రసాద్
దర్శకత్వం: సుబ్బు
విడుదల తేదీ: 25 డిసెంబర్ 2020
అసలు కథ
ప్రేమ, పెళ్ళి అంటే అస్సలు గిట్టదు విరాట్ (సాయి దరమ్ తేజ్) అనే యువకుడికి. అమ్మాయిలంటే ఆమడ దూరం పారిపోతాడు. సోలో లైఫే సో బెటర్.. అంటూ కొన్ని కొటేషన్స్ ప్రిపేర్ చేసి, పుస్తకాన్ని అచ్చేయిస్తాడు.
అయితే, అతని జీవితంలో పెను మార్పు. వున్నపళంగా ఓ అమ్మాయి అమృతతో (నభా నటేష్) ప్రేమలో పడతాడు. ఇంతకీ, విరాట్ ప్రేమని అమృత అంగీకరించిందా.? అసలు పెళ్ళే వద్దని అప్పటిదాకా చెప్పిన హీరో, ఎలా ప్రేమలో పడ్డాడు.? ఇంతకీ విరాట్, అమృత పెళ్ళి పీటలెక్కారా లేదా.? ఇవన్నీ తెరపై చూడాల్సిందే.
నటీనటులు ఎలా చేశారంటే..
సాయి ధరమ్ తేజ్ తెరపై చాలా కాన్ఫిడెంట్‌గా కనిపించాడు. ఎక్కడా నటిస్తున్నాడన్న భావనే కలగలేదు. విరాట్ పాత్రలో సహజమైన నటనతో ఒదిగిపోయాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఆ పాత్రలో జీవించేశాడనడం సబబేమో. డాన్సుల పరంగా మరింత బాగా ఆకట్టుకున్నాడు ఇదివరకటి సినిమాలతో పోల్చితే.
హీరోయిన్ నభా నటేష్ చాలా క్యూట్‌గా వుంది. ఈ తరహా పాత్రల్లో ఆమె ఇంకా ఎక్కువ అందంగా కనిపిస్తుంటుంది. నటన పరంగానూ చాలా బాగా ఆకట్టుకుంటుంది. రావు రమేష్, రాజేంద్రప్రసాద్.. తదితర ఇతర ప్రధాన తారాగణం తమ పాత్రల పరిధి మేర బాగా చేశారు.
సాంకేతిక వర్గం పనితీరు..
సినిమాటోగ్రఫీ చాలా బావుంది. పాటలు బావున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా బావుంది. చాలా సన్నివేశాల్ని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరింత ఎఫెక్టివ్‌గా మార్చేసింది. సినిమాటోగ్రఫీ కూడా అంతే. డైలాగ్స్ ట్రెండీగా వున్నాయి, ఆలోచింపజేశాయి, నవ్వించాయి కూడా. ఎడిటింగ్ పరంగా ఇంకాస్త జాగ్రత్తపడి వుంటే బావుండేదేమో. క్వాలిటీ ఔట్‌పుట్ రావడంలో నిర్మాత ఖర్చుకి వెరవని వైనం స్పష్టంగా కనిపిస్తుంది.
విశ్లేషణ
ముందే చెప్పుకున్నాం కదా.. ఈ సందర్భంలో తప్పులు వెతకాల్సిన పనే లేదు. ఎందుకంటే, తెలుగు సినిమా పరిశ్రమకు ఆక్సిజన్ లాంటి సినిమా ఇది. సినిమా యూనిట్ చాలా పెద్ద రిస్క్ చేసింది. ఈ సినిమా రిలీజ్, మొత్తంగా తెలుగు సినీ పరిశ్రమకు అత్యద్భుతమైన దారి చూపించిందనడం నిస్సందేహం.
అలాగని, సినిమాలో పెద్దగా లోటుపాట్లు వున్నాయనీ, అయినా వాటిని విస్మరించాలని కాదు. ఓ సినిమాకి ఏమేం వుండాలో అన్నీ వున్నాయి. ఫస్టాఫ్ సరదా సరదాగా సాగిపోతుంది. ఆ తర్వాత కొన్ని ఎమోషనల్ సీన్స్, సినిమాని భారంగా మార్చేస్తాయి. ఓవరాల్‌గా ఓ మంచి సినిమా చూశామన్న భావన అయితే కలుగుతుంది.
రిపీట్ వాల్యూ వున్న పాటలు, మంచి డాన్సులు, తగినంత హాస్యం.. ఇవన్నీ ఈ సినిమాని ‘బెటర్’ ఔట్‌పుట్‌గానే మార్చాయి. చాన్నాళ్ళ తర్వాత థియేటర్ ఎక్స్‌పీరియన్స్ గనుక, హ్యాపీగానే ప్రేక్షకుడు థియేటర్ నుంచి బయటకొస్తాడు.
ఫైనల్ టచ్: సోలో బ్రతుకే సో బెటర్.. థియేటర్లలో సినిమా చూస్తేనే బెటర్.!