సోనూ సూద్.. ఇప్పుడీ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. దేవుడు.. దైవ దూత.. ఇలా చాలా పదాలతో సోనూ సూద్ మీద ప్రశంసలు గుప్పించేస్తున్నారంతా. నిజమే, సోనూ సూద్ ఆ ప్రశంసలకు అర్హుడే. ఎందుకంటే, కష్ట కాలంలో ప్రజలకు అండగా నిలుస్తున్నాడు. తనకు చేతనైనంత సాయం చేస్తున్నాడు. నిజానికి, తన తాహతుకు మించిన సాయాన్ని చేయగలుగుతున్నాడు సోనూ సూద్ (Sonu Sood Foundation Fights Against Covid 19 Corona Virus).
కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న వేళ, చాలామందికి సోనూ సూద్ నుంచి సాయం అందుతోన్న విషయం విదితమే. అయితే, సోనూ సూద్ ఎంతలా సాయమందిస్తున్నా, ఆ సాయం సరిపోవడంలేదు. బాధితులు చాలా ఎక్కువమందే వున్నారు. ప్రభుత్వాలు సైతం చేతులెత్తేస్తున్న వేళ, సోనూ సూద్ మాత్రం ఏం చేయగలడు.?
ఇక, అసలు విషయానికొస్తే, కరోనా వైరస్ చికిత్సలో భాగంగా వినియోగిస్తోన్న కొన్ని ప్రత్యేక మెడిసిన్స్ దేశంలో సరిపడా అందుబాటులో వుండటంలేదు. మెడిసిన్స్ కొరత చాలా ప్రాణాల్ని తీసేస్తోంది. ఈ విషయమై సోనూ సూద్ కూడా చాలా కష్టపడుతున్నాడు.. వీలైనంత ఎక్కువమందికి తనవంతు సాయం చేసేందుకోసం. కానీ, చాలా ప్రాణాలు పోతున్నాయ్.. ఆ విషయం సోనూ సూద్ కూడా అర్థం చేసుకుంటున్నాడు.. ఆవేదన చెందుతున్నాడు.
అలా.. ఆ ఆవేదనలోంచే సోనూ సూద్ ఓ ప్రశ్న సంధించాడు సోషల్ మీడియా వేదికగా. ఓ ఇంజెక్షన్ దేశంలో సరిగ్గా అందుబాటులో లేనప్పుడు డాక్టర్లు అదే ఇంజెక్షన్ ఎందుకు కావాలంటున్నారు.? హాస్పిటల్స్ సైతం సేకరించలేకపోతున్న ఆ ఇంజెక్షన్, సామాన్యులకు ఎలా దొరుకుతుంది.? దానికి ప్రత్యామ్నాయంగా మరో మెడిసిన్ ఎందుకు మనం వినియోగించలేం.? ప్రాణాల్ని ఎందుకు కాపాడలేం.? అని ప్రశ్నంచాడు సోనూ సూద్.
ఈ ప్రశ్నలు చాలామంది డాక్టర్లకు ఆగ్రహం తెప్పించాయి. నిజానికి, అందరు డాక్టర్లూ ఒకలాగే వున్నారని అనుకోలేం. కొందరు డాక్టర్లు, కొన్ని ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రులు.. జనాన్ని పీల్చ పిప్పి చేస్తున్న మాట వాస్తవం. కరోనా సమయం అని కాదు.. సాధారణ రోజుల్లోనూ ఇదే పరిస్థితి. ప్రజల ప్రాణాల కంటే వాళ్ళకి డబ్బులే ముఖ్యం. అలాంటి వారినే సోనూ సూద్ (Sonu Sood Foundation Fights Against Covid 19 Corona Virus) ప్రశ్నించింది.
ప్రభుత్వాలు సైతం ఈ విషయంలో ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రజలకు సరైన వైద్యం అందించలేని స్థితి.. అవసరమైన మందులు అందించలేని స్థితి ఎందుకు వచ్చింది.? ఈ పరిస్థితిని ఎలా అధిగమించాలి.? అన్న దిశగా ఆత్మవిమర్శ.. వీలైనంత త్వరగా ప్రభుత్వాలు చేసుకుంటే మంచిదేమో.