Table of Contents
ప్రముఖ దర్శకుడు, కొరియోగ్రాఫర్, నటుడు లారెన్స్ (Lawrence Raghava) ఓ సినిమా తెరకెక్కించబోతున్నాడట. అందులో ఓ ముఖ్యమైన పాత్ర శ్రీరెడ్డికి ఆఫర్ చేశాడట. ‘టాలెంట్ ప్రూవ్ చేసుకో’ అంటూ శ్రీరెడ్డికి ఇటీవల సోషల్ మీడియాలో లారెన్స్ సవాల్ విసిరిన సంగతి తెల్సిందే. దాంతో లారెన్స్ ఇంటికి వెళ్ళి మరీ ‘టాలెంట్’ నిరూపించుకుందట శ్రీరెడ్డి. ఇప్పుడు శ్రీరెడ్డికి లారెన్స్‌లో ‘గారు’ కన్పిస్తున్నారు. ఎందుకంటే, సినిమాలో ఆఫర్ ఇచ్చాడు, పైగా అడ్వాన్స్ కూడా చేతిలో పెట్టాడు. ఆ అడ్వాన్స్‌ని శ్రీరెడ్డి, ఆంధ్రప్రదేశ్‌లో తిత్లి తుపాను బీభత్సానికి నష్టపోయిన శ్రీకాకుళం జిల్లాకి అందజేయబోతోందట శ్రీరెడ్డి. ఇది మాత్రం చాలా చాలా మంచి విషయమే.
శ్రీరెడ్డికీ లారెన్స్‌కీ మధ్య గొడవేంటి?
కొన్నాళ్ళ క్రితం హైద్రాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో లారెన్స్, శ్రీరెడ్డితో (Sri Reddy) అసభ్యకరంగా ప్రవర్తించాడట. తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా లారెన్స్‌ని కలిశాననీ, తన రూమ్‌లోకి తీసుకెళ్ళిన లారెన్స్ అక్కడ వెకిలి చేష్టలు చేశాడనీ, ‘బెల్లీ’ (బొడ్డు) చూపించమన్నాడనీ, సెక్సీగా డాన్స్ చేయమన్నాడనీ, ఆ తర్వాత ‘రైడ్’ కూడా చేశాడని సోషల్ మీడియాలో సంచలన ఆరోపణలు చేసింది శ్రీరెడ్డి. తెలుగు సినీ పరిశ్రమలో (Telugu Film Industry) కాస్టింగ్ కౌచ్ జరుగుతోందంటూ ఆరోపణల పరంపర మొదలు పెట్టిన శ్రీరెడ్డి, ఈ క్రమంలో తమిళ సినీ పరిశ్రమని కూడా వివాదాల్లోకి లాగింది. ఆలా ఆమెకు అప్పట్లో లారెన్స్ కూడా సాఫ్ట్ కార్నర్ అయ్యాడు. శ్రీరెడ్డి ఆరోపణలు లారెన్స్‌ని చాలా బాధించాయి అప్పట్లో.
బంపర్ ఆఫర్ ప్రకటించిన లారెన్స్
అవకాశాల పేరుతో తాను ఎవర్నీ వాడుకోలేదనీ, టాలెంట్‌ని బట్టే అవకాశాలు ఇవ్వడం జరుగుతుందని లారెన్స్ (Lawrence Raghavendra), శ్రీరెడ్డి ఆరోపణలపై స్పందించాడు. శ్రీరెడ్డికి టాలెంట్ వుంటే, తన వద్దకు ఆడిషన్స్ కోసం రావొచ్చన్నాడు. ‘నా విషయంలో అనుమానాలుంటే, సన్నిహితులెవర్నైనా తెచ్చుకోవచ్చు. వారి సమక్షంలోనే ఆడిషన్స్ జరుగుతాయి. ఇక్కడ ఎలాంటి అక్రమాలు, అన్యాయాలూ జరగవు’ అని పేర్కొన్నాడు లారెన్స్. ‘అయితే, కాస్కో.. ఆడిషన్స్ కోసం వస్తున్నా..’ అంటూ శ్రీరెడ్డి అప్పట్లో ప్రకటించింది కూడా. కొంత టైమ్ తీసుకుని, తాజాగా లారెన్స్ దగ్గరకు శ్రీరెడ్డి వెళ్ళిందన్నమాట. అయితే, అప్పుడు చేసిన ఆరోపణలు ఇప్పుడు ఆమె మర్చిపోయినట్లుంది.
లారెన్స్ మల్టీ టాలెంటెడ్
డాన్సర్‌గా సినిమా కెరీర్ ప్రారంభించిన లారెన్స్ కొరియోగ్రాఫర్‌గా ఎదిగాడు. నటుడిగా రాణించాడు. దర్శకుడిగా సత్తా చాటాడు. సినిమా రంగంలో అంచలంచెలుగా కింది స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగిన అతి కొద్ది మందిలో లారెన్స్ కూడా ఒకడు. తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో ప్రభుదేవా తర్వాత అంతటి కొరియోగ్రాఫర్ ఇంకెవరన్నా వున్నారంటే అది లారెన్స్ (Lawrence) మాత్రమే. సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ లారెన్స్ ముందుంటాడు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వికలాంగుల పట్ల ఆయన ఎనలేని ప్రేమ చూపిస్తుంటాడు. ఒకప్పుడు తాను అనుభవించిన పేదరికం, ఇంకొకరిని బాధించకూడదన్న భావనతో వీలైనంతవరకు తన ఆదాయాన్ని వారికోసం ఖర్చు చేస్తుంటాడు లారెన్స్. మల్టీ టాలెంటెడ్ మాత్రమే కాదు, మంచి మనసున్నోడు కూడా.
టాలీవుడ్ వద్దనేస్తే, కోలీవుడ్ శ్రీరెడ్డిని అక్కున చేర్చుకుందా!
తమిళంలో (Tamil Cinema) ఇప్పటికే ఓ సినిమాకి కమిట్ అయ్యింది శ్రీరెడ్డి. ఇంతలోనే ఇంకో సినిమాలో ఆఫర్ దక్కించుకున్నట్లు ప్రకటించింది. నిజానికి ‘ఎన్‌టిఆర్ బయోపిక్’ (NTR Biopic) సినిమాలో శ్రీరెడ్డి నటించి వుండాల్సింది. ఆమెకు ఆ సినిమాలో ఆఫర్ ఇస్తున్నట్లు తేజ ప్రకటించాడు కూడా. ఇదంతా కాస్టింగ్ కౌచ్‌పై శ్రీరెడ్డి రచ్చ చేసిన తర్వాత జరిగిన విషయమే. కానీ, ‘ఎన్‌టిఆర్ బయోపిక్’ నుంచి దర్శకుడు తేజ (Director Teja) తప్పుకోవడంతో, శ్రీరెడ్డికీ ఛాన్స్ అటకెక్కేసింది. ఎలాగైతేనేం తెలుగు సినిమా (Telugu Cinema Tollywood) ఆమెను దూరం పెడితే, తమిళ సినిమా అక్కున చేర్చుకున్నట్లయ్యింది. తమిళ సినీ పరిశ్రమపై ఆరోపణల క్రమంలో ప్రముఖ నటుడు విశాల్ (Vishal) పైన కూడా శ్రీరెడ్డి దూకుడు ప్రదర్శించింది. కొందరు ఆమె ఆరోపణలకు ఘాటైన సమాధానమిచ్చారనుకోండి. అది వేరే సంగతి.
లారెన్స్‌పై గత ఆరోపణలకు క్షమాపణ చెప్పాలి మరి..
లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చినవారితో సినిమాలు చేసేందుకు బాలీవుడ్‌లో చాలామంది వెనుకాడుతున్నారిప్పుడు. అమీర్‌ఖాన్ (Aamir Khan), అక్షయ్‌కుమార్ (Akshay Kumar) కూడా కొన్ని సినిమాల్ని వదులుకున్నారు.. ఆయా వ్యక్తులపై ఆరోపణలు రావడంతో. అలాంటిది, లారెన్స్ మీద సంచలన ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి, మళ్ళీ అతని దర్శకత్వంలోనే సినిమా చేయనుండడం ఆశ్చర్యకరం. సోషల్ మీడియా ద్వారా శ్రీరెడ్డి పబ్లిసిటీ స్టంట్లు చేస్తోంది తప్ప, ఆమె మాట్లాడే మాటల్లో ఒక్కటీ వాస్తవం లేదని ఇప్పుడు అర్థం చేసుకోవాలా? ఎందుకంటే ‘లారెన్స్ రైడింగ్’ గురించి ప్రకటించి, పబ్లిసిటీ పొందింది ఆమే కాబట్టి. సినిమాల్లో ఇలాంటివన్నీ మామూలేనని శ్రీరెడ్డి లైట్ తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.