Stray Dogs Delhi NCR.. దేశ వ్యాప్తంగా ‘వీధి కుక్కల’ విషయమై పెద్ద రచ్చే జరుగుతోంది.
ఢిల్లీ – ఎన్‌సీఆర్ ఏరియాలో వీధి కుక్కలకు ఆస్కారం లేకుండా చూడాలన్న సుప్రీంకోర్టు తీర్పుతో రచ్చ మొదలైంది.
ఔను, వీధి కుక్కలు మనుషుల ప్రాణాల్ని తీసేస్తాయ్. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. మరి, ఆ వీధి కుక్కల్ని నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకి వుందా.? లేదా.?
అలా ఎలా కుదురుతుంది.? ఈ భూమ్మీద మనిషితోపాటు, సకల జీవరాశులకీ హక్కులున్నాయన్నది ‘జంతు ప్రేమికుల’ వాదన.!
జంతు ప్రేమికుల్లో మళ్ళీ, పబ్లిసిటీ స్టంట్స్ చేసే వాళ్ళు వేరే వున్నారు. వాళ్ళతోనే అసలు సమస్య. కుక్కలు, పక్షులు.. ఇలా అన్ని రకాల జీవ రాశులకీ, మనుషులతో సమానంగా హక్కులున్నాయ్.
Stray Dogs Delhi NCR.. బొద్దింకలు.. దోమలు.. కుక్కలు..
అలాగని, ఇంట్లో బొద్దింకల్ని చంపకుండా వుంటామా.? దోమల్ని చంపకుండా వుంటామా.? అబ్బే, బొద్దింకలు వేరు.. వీధి కుక్కలు వేరు.. అనేవాళ్ళూ వున్నార్లెండి.
మీకెప్పుడైనా కుక్క కరిచిందా.? మీ ఇంట్లో ఎవరికైనా రేబిస్ సోకిందా.? ‘యెస్’ అయితే, ఇప్పుడు చెప్పండి.. వీధి కుక్కలు వుండాలా.? వుండకూడదా.? అన్న ప్రశ్న సహజంగానే తెరపైకొస్తుంది.
మనిషికి రేబిస్ సోకితే, మరణమే.! రేబిస్ సోకిన కుక్క, మనిషిని కరిస్తే.. మనిషికీ రేబిస్ సోకుతుంది. రేబిస్ వ్యాక్సిన్ మనుషులకు సకాలంలో అందితే సరే సరి. లేకపోతే, అంతే సంగతులు.

రేబిస్ సోకిన తర్వాత, మనిషి బతుకు అత్యంత దయనీయంగా మారిపోతుంది. ‘కుక్క చావు’ అని సరదాగా అనేస్తుంటాం.. అలాంటి మరణం సంభవిస్తుంటుంది. అది అత్యంత భయానకం.
కుక్కల్లో రేబిస్‌ని నియంత్రించడం సాధ్యం కాదు. కుక్కల నుంచి మనిషిని రక్షించుకోవడానికి అవకాశం వుంది. అదే, వీధి కుక్కలకు దూరంగా మనుషులు వుండటం.
మనుషుల్ని వీధి కుక్కలుండే నగరాల నుంచి ఖాళీ చేయించడమెలా కుదురుతుంది.? అందుకే, మనుషులున్న చోట నుంచి వీధి కుక్కల్ని దూరంగా తరలించాలి.
ఇందులో సోకాల్డ్ జంతు ప్రేమికులకు వచ్చే ఇబ్బంది ఏమిటి.? పోనీ, వాళ్ళంతా రేబిస్ సోకిన వీధి కుక్కల్ని వాళ్ళ వాళ్ళ ఇళ్ళల్లోని ‘యార్డుల్లో’ సంరక్షిస్తారా.? అంటే, అదీ లేదు.
మనుషుల్ని పులి చంపేస్తోంటే, దాన్ని మ్యాన్ ఈటర్.. అని భావించి, దాన్ని చంపడానికి చట్టాలు అనుమతిస్తాయి. రేబిస్ కుక్కల విషయంలోనూ అలానే వ్యవహరించాల్సిందే. వేరే దారి లేదు.
ఇళ్ళల్లో పెంచుకోవడానికేమో, విదేశీ కుక్కలు కావాలి.. వీధుల్లో సామాన్యుల్ని మాత్రం.. రేబిస్ కుక్కలు కరిచెయ్యాలి.. మనుషుల ప్రాణాలు పోయినా లెక్క లేదు.. సోకాల్డ్ మేథావులకి.
నగరీకరణ, పట్టణీకరణ పెరిగాయి.. ఈ క్రమంలో, మనుషులకి కుక్కల నుంచి బెడద కూడా ఎక్కువైపోయింది. వీధి కుక్కల సంతతిని నియంత్రించాలి. అలానే, వాటిని మనుషులకు దూరంగా పంపించక తప్పదు.
బర్డ్ ఫ్లూ సోకిన కోళ్ళని.. మూకుమ్మడిగా చంపేస్తుంటాం కదా.! చికెన్ వాడకాన్ని పూర్తిగా మానేస్తుంటాం కదా.. ఇదీ అంతే.! జంతు ప్రేమికులకు కోపం వచ్చినాసరే.. ఇదే వాస్తవం.
చివరగా.. రేబిస్ అత్యంత భయానకం.! రేబిస్ సోకి ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలతో మాట్లాడి, ఆ తర్వాత వీధి కుక్కల హక్కుల గురించి ఆ తర్వాత ఉద్యమించండి.!