Table of Contents
Telugu Students In America.. ఎయిర్ పోర్టు కాదిది బస్టాండు.! శంషాబాద్ విమానాశ్రయం గురించి మొన్నీమధ్య సోషల్ మీడియాలో హల్చల్ చేసిన ఫొటోలు, వాటి మీద కామెంట్లతో తేలింది ఇదే.!
తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు అమెరికా వెళ్ళారు. పదుల సంఖ్యలో కాదు.. వందల సంఖ్యలో, వేల సంఖ్యలో ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్ళారు తెలుగు విద్యార్థులు.
ప్చ్.! అక్కడి నుంచి కొందర్ని తిప్పి పంపేస్తున్నారుట అమెరికన్ ఇమ్మిగ్రేషన్ అధికారులు.! ఇంతకీ ఏం జరిగింది.? ఏం జరుగుతోంది.?
అమెరికా వెళ్ళడమంటే, విమానం టిక్కెట్టు తీసేసుకుంటే సరిపోదు.! చాలా వ్యవహారాలుంటాయి. ముందుగా ఇక్కడ వీసా క్లియర్ అవ్వాలి.!
అన్నీ పక్కాగా వుండాల్సిందే..
వీసా వచ్చేసిందహో.. అని, సంబరాల్లో మునిగి తేలితే కుదరదు. అమెరికన్ ఇమ్మిగ్రేషన్ అధికారులు, అక్కడికి వెళ్ళాక ఏమన్నా ప్రశ్నలు సంధిస్తే.. జాగ్రత్తగా సమాధానం చెప్పాలి.
ఏ యూనివర్సిటీలో చదివేందుకు వెళుతున్నారు.? ఆర్థిక స్థితిగతులేంటి.? ఇవన్నీ ఇంకోసారి చెకింగ్ వుంటుంది.! అవన్నీ జాగ్రత్తగా క్లియర్ చేసుకోవాలి.
సమాధానాలు చెప్పడంలో తడబాటుకి గురైతే అంతే సంగతులు.! విమానం దిగిన వెంటనే.. ఇమ్మిగ్రేషన్ అధికారులు.. తిరుగుటపాలో ఇంకో విమానమెక్కించి పంపేస్తారు.!
అసలంటూ ఎలాంటి అవగాహనా లేకుండా, విద్యార్థులు అమెరికా వెళ్ళిపోతున్నారని అనడమూ సబబు కాదు.
కానీ, కన్సల్టెన్సీ సంస్థలు, కమిషన్లకు కక్కుర్తిపడి.. విద్యార్థుల్ని తప్పుదోవపట్టిస్తుంటారు. అదే అసలు సమస్య. డబ్బులిచ్చేశాం, వాడే చూసుకుంటాడన్న భావనలో కొందరు విద్యార్థులు, వారి తల్లిదండ్రులూ వుంటారు.
కన్సల్టెన్సీ సంస్థలేమో, ఫేక్ సర్టిఫికెట్లతో ‘మమ’ అనిపించేస్తాయి. అమెరికా వెళ్ళాక, విద్యార్థులకి ఇమ్మిగ్రేషన్ సందర్భంగా చుక్కలు కనిపిస్తాయి. ఇదీ అసలు సమస్య.
Telugu Students In America.. తరిమేశారనడం సబబేనా.?
పెద్ద సంఖ్యలో విద్యార్థులు తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికా వెళుతున్నప్పుడు.. ఒకటీ అరా ‘తిప్పి పంపుతున్న’ ఘటనలు వుంటే వుండొచ్చుగాక. అదీ బాధాకరమే.!
కానీ, ‘తన్ని తరిమేశారు..’ అన్నట్లుగా ఈ వ్యవహారంపై వెటకారపు వ్యాఖ్యలు, మన తెలుగు మీడియాలో దర్శనమిస్తుండడం ఎంతవరకు సబబు.? అన్నది కొందరి వాదన.!
నిజానికి, కొన్ని విశ్లేషణలు కూడా అలాగే తగలడుతున్నాయి. లక్షలు ఖర్చు చేస్తున్నారు విదేశాలకు వెళ్ళడం కోసం. అలాంటప్పుడు, ఎంత ఒత్తిడి వుంటుంది.? ఆ ఒత్తిడిలోనూ కొన్ని తప్పులు జరిగేందుకు ఆస్కారం వుంటుంది.
రాజకీయ పరమైన వివాదాల జోలికి వెళ్ళకపోవడం, అమెరికా వెళ్ళాక పార్ట్ టైమ్ జాబ్ గురించి ముందే ఆలోచనలు చేయడం.. తమ స్నేహితులతో ఆ అంశాలపై సామాజిక మాధ్యమాల్లో చర్చించడం.. ఇవి కూడా ‘తిప్పి పంపడానికి’ కారణమవుతున్నాయట.
సరదా కోసం కాదు కదా.!
జర జాగ్రత్త.! అమెరికా వెళ్ళడమంటే.. సరదా కోసం కాదు కదా.! ఉన్నత విద్యనభ్యసించడం కోసం.! మెరుగైన భవిష్యత్తు కోసం. ఒకింత బాధ్యతగా వ్యవహరించండి.. అమెరికా వెళ్ళాలన్న ఆలోచన మొదలైనప్పటినుంచే.!
అమెరికా అంటే, చాలామందికి కలల ప్రపంచం.! అలాంటి కలల ప్రపంచంలోకి నిజంగానే అడుగు పెట్టాల్సి వస్తే.!
ఖచ్చితమైన ప్లానింగ్ వుండి తీరాలి. సర్టిఫికెట్ల దగ్గర్నుంచి.. బ్యాంక్ బ్యాలెన్స్ వరకు.. వీటితోపాటు, ‘క్యారెక్టర్’ కూడా జాగ్రత్తగా వుండేలా చూసుకోవడం మంచిది.
డిపోర్టెడ్ ముద్ర వేయించేసుకుంటే, అమెరికా వెళ్ళే అవకాశాన్ని ఐదేళ్ళపాటు కోల్పోవడమే కాదు, స్వదేశానికి తిరిగొచ్చాక.. ఇక్కడి కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగాలకీ ఇబ్బంది పడాల్సి రావొచ్చు.