Table of Contents
Tuck Jagadish Review.. నేచురల్ స్టార్ నానిని సినిమా కష్టాలు వెంటాడుతున్నాయి. కరోనా పాండమిక్ కారణంగా అన్ని సినిమాలూ ఈ కష్టాన్ని ఎదుర్కోక తప్పడంలేదు. ‘వి’ సినిమా ఎలాగైతే ఓటీటీలోనే నేరుగా విడుదలయ్యిందో, ‘టక్ జగదీష్’ సినిమాదీ అదే పరిస్థితి. ‘వి’ సినిమాలా, ‘టక్ జగదీష్’ అవ్వదని ఖచ్చితంగా నాని చెప్పినా, ఓటీటీ ముందు తలొంచక తప్పలేదు.
ఈ క్రమంలో నాని ఎదుర్కొన్న విమర్శలు అన్నీ ఇన్నీ కావు. నాని మీద కొన్ని వ్యక్తిగత విమర్శలూ వచ్చాయి. ‘నేనూ పరిశ్రమలోనివాడినే.. నా కుటుంబ సభ్యులే (సినిమా పరిశ్రమకు చెందినవారు) నన్ను పరాయివాడిగా చూశారన్న బాధ నన్ను వెంటాడుతోంది..’ అని వాపోయాడు నాని. కరోనా తెచ్చిన కష్టమిది.
నానా రకాల ఇబ్బందుల్నీ ఎదుర్కొని, ఎట్టకేలకు ఓటీటీ తెరపై ‘టక్ జగదీష్’ విడుదలైంది. ఇంటిల్లపాదీ చూసే సినిమా.. అంటూ హీరో నాని సహా, దర్శకుడు, నిర్మాతలు.. ఈ సినిమా గురించి చెబుతూ వచ్చారు. ఇద్దరు అన్నదమ్ముల కథ.. కుటుంబమంతా కలిసి వుండాలనే మంచి సందేశాన్నిచ్చే కథ.. అంటూ ‘టక్ జగదీష్’ గురించి చేసిన పబ్లిసిటీ సంగతేంటి.? సినిమాలో విషయమేంటి.?
Tuck Jagadish Review.. కథేంటంటే..
కథలోకి వెళితే, ఓ ఊరికి పెద్దాయన (నాజర్) వుంటాడు. ఆయనకు బోసుబాబు, జగదీష్.. ఇద్దరు కొడుకులు. జగదీష్ అంటే బోసుబాబుకీ, ఇతర కుటుంబ సభ్యులకీ ఎంతో ఇష్టం. పెద్దాయనకు కుమార్తెలు కూడా వుంటారు. అందరూ కలిసే వుంటారు. కానీ, పెద్దాయన మరణం తర్వాత బోసుబాబు, మిగతా కుటుంబ సభ్యుల్ని మోసం చేస్తాడు, ఇంట్లోంచి గెంటేస్తాడు.
మరి, బోసుబాబు – జగదీష్ మధ్య అన్నదమ్ముల బంధం అలాగే వుందా.? కుటుంబాన్ని తిరిగి ఏకం చేసేందుకు జగదీష్ ఏం చేశాడు.? అసలు జగదీష్‌కి టక్ జగదీష్ అనే పేరు ఎలా వస్తుంది.? ఈ కథలో గుమ్మడి వరలక్ష్మి పాత్ర ఏంటి.? బోసుబాబు, జగదీష్‌ల మేనకోడలు చంద్రమ్మ సంగతేంటి.? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
హీరో టక్ చేసుకుని వుంటాడు కాబట్టి, హీరో పేరు జగదీష్ కాబట్టి, సినిమా టైటిల్ ‘టక్ జగదీష్’ అని పెట్టేశారంతే. దానికి సంబంధించి సరైన జస్టిఫికేషన్ అయితే లేదు. ఓ ఫైట్ సందర్భంగా, ‘టక్’ ప్రస్తావన వస్తుందంతే. దానికోసమే ‘టక్ జగదీష్’ అని టైటిల్ పెట్టేశారా.? ఏమో మరి.. దర్శకుడికే తెలియాలి.
టక్ జగదీష్.. పాత చింతకాయ పచ్చడి కానే కాదు..
పాత చింతకాయ పచ్చడి.. అని చులకనగా చూసేస్తాంగానీ, అది భలే రుచిగా వుంటుంది. కానీ, ఇక్కడ కనిపించేదంతా పాత కథే. కళ్ళు టీవీ స్క్రీన్ మీద నుంచి పదే పదే పక్కకి వెళ్ళిపోతుంటాయ్. కుటుంబ సభ్యుల మధ్య సరైన ఎమోషనల్ బాండింగ్ కనిపించనప్పుడు, హీరోయిజం ఎలివేట్ అయ్యేలా దర్శకుడు ఏం చేస్తే మాత్రం ఏం లాభం.?
సినిమాలో డ్యూయట్లు లేవు.. ఓ ఫైట్ జరుగుతుండగా బ్యాక్‌గ్రౌండ్‌లో పాట వస్తుంటుంది.. మిగతా పాటలూ సిట్యయేషనల్.. సినిమాలో అలా అలా కలిసిపోయాయ్. ఎక్కడో విన్నట్టుగానే అనిపిస్తుంటాయి. సినిమాటోగ్రఫీ మాత్రం బావుంది. ఎడిటింగ్ పరంగా చాలా కత్తెర్లు వేసేస్తే బావుండేదనిపిస్తుంది చూసే ప్రేక్షకులకి.
హీరో నాని మరీ బిగుసుకుపోయాడు. నాని జోవియల్‌గా కనిపిస్తే, ఆ కిక్కు వేరే లెవల్‌లో వుంటుంది. కానీ, ఆ అదృష్టం ‘టక్ జగదీష్’ కల్పించలేదు ప్రేక్షకులకి. జగపతిబాబు ఓకే. రీతూ వర్మ బాగానే చేసింది. కానీ, ఇంకా ఆమె పాత్రని బాగా తీర్చిదిద్ది వుంటే బావుండేదేమో. ఐశ్వర్యా రాజేష్ పాత్ర విషయంలోనూ పస లేకుండా పోయింది.
ఎమ్మార్వో జగదీష్.. అసలెందుకు.?
వున్నంతలో సినిమా మొత్తాన్నీ నాని తన భుజాల మీద మోసేందుకు ప్రయత్నించాడు. నాని తప్ప, సినిమాలో ఇంకేమీ లేదనిపిస్తుంది. ఎమ్మార్వో పాత్రలో నానిని చూపించడం ద్వారా కథకి జరిగిన ప్రయోజనమేంటో.? మేనకోడలి మెట్టినింటికి రెడ్ లైట్ పెట్టి.. కష్టమొస్తే ఆ లైటు వెలిగించమని మేనమామ చెప్పడమేంటో.? ప్రతిరోజూ సాయంత్రం ఆ ఇంటికి కాస్త దూరంలో మేనమామ ‘పరిశీలన’ కోసం వెళ్ళడమేంటో.!
మొత్తంగా చూస్తే, ఇదేదో పాత కాలం కథ (Tuck Jagadish Review) అనిపించడం సహజమే. కథ పాతదే అయినా, కథనం పరంగా కొత్తదనం చూపించి వుండాలి. ఇదిగో రెడ్ బల్బు కాన్సెప్టుని చూపించారంటే, అటువైపు చూడాలా.? వద్దా.? అన్న అనుమానం ప్రేక్షకులకు కలుగుతుందని హీరో సైతం ఆలోచించలేకపోవడమేంటి.?
నానిగారూ.. ఇలా ఎలా.?
‘శివ నిర్వాణ కథ వుందని చెప్పినప్పుడు, లవ్ స్టోరీ అయితే వద్దని చెప్పేద్దామనుకున్నాను.. కానీ, కనెక్ట్ అయిపోయాను..’ అని నాని చెప్పాడు. మొహమాటానికి పోయి, నాని ఈ సినిమా ఒప్పుకుని ఇప్పుడు విమర్శలు ఎదుర్కొనే పరిస్థితిని కొనితెచ్చుకున్నాడా.? అన్న సందేహమైతే చాలామందికి కలిగే అవకాశముంది.
చివరగా.. బోసుబాబు, జగదీష్, తులసమ్మ, అర్జునమ్మ.. ఇద్దరు తల్లులు, ఇద్దరు కొడుకులు.. ఈ గందరగోళానికి సమాధానం తెలియక సినిమా చూశాక కూడా జుట్టు పీక్కోవాల్సిందే. ఖచ్చితంగా ’బల్బు’ పగలిపోతుంది ఈ సినిమాలోని కుటుంబ సంబంధాల గురించి ఆలోచిస్తే.
చివరగా.. టక్ జగదీష్.. యాక్షన్ ఎపిసోడ్స్‌తో కూడిన టీవీ సీరియల్.. అనొచ్చేమో.!