Tuk Tuk Telugu Review.. సినిమా అంటే ఏంటి.? కథ, కథనం.. ఇలా చాలా లెక్కలుంటాయ్. సంగీతం బావుండాలి, మాటలూ బావుండాలి. నటీనటుల నటనా ప్రతిభ, సినిమాటోగ్రఫీ.. చెప్పుకుంటూ పోతే పెద్ద కథే.!
హిట్టు సినిమాల్లో ఇవన్నీ వుంటాయా.? ఇవన్నీ వున్న సినిమాలు హిట్టవుతున్నాయా.? ఫార్ములా వెనక పరిగెట్టి బోల్తా కొట్టిన సినిమాలున్నాయ్, యధాలాపంగా తీస్తున్న సినిమాలు హిట్టు ఫార్ములాలుగా మారుతుంటాయ్.!
హర్రర్ కామెడీ.. పేరుతో బోల్డన్ని సినిమాలు వచ్చాయి, వస్తూనే వున్నాయ్. థ్రిల్లర్ సినిమాల సంగతి సరే సరి. ‘హర్రర్’ అంటూ ఓటీటీలో కనిపించిన సినిమా ‘టుక్ టుక్’ మీద అలా లుక్కేయడం జరిగింది.
శాన్వీ మేఘన అని.. మన తెలుగమ్మాయే.! ఇంతకు ముందూ కొన్ని సినిమాల్లో నటించింది. నటిగా మంచి మార్కులేయించుకుందిగానీ, స్టార్‌డమ్ అయితే రాలేదు.
మొన్నీమధ్యనే ఓ తమిళ సినిమాతో హిట్టు కొట్టిందీ బ్యూటీ.! శాన్వీ మేఘన ఫొటో పోస్టర్ల మీద కనిపించిందిగానీ, సినిమా ప్రారంభమైన చాలా సేపటి వరకూ ఆమె జాడ లేదు.
Tuk Tuk Telugu Review.. ఆటోలాంటి స్కూటరులో ఓ దెయ్యం..
ముగ్గురు కుర్రాళ్ళు.. అంటే, చిన్న కుర్రాళ్ళే.! వాళ్ళతోపాటు ఓ ఆటో లాంటి స్కూటరు.! ఆ స్కూటరు మనుషులతో మాట్లాడుతుంది. మాట్లాడటమంటే, ‘సంజ్ఞలు’ చేస్తుందన్నమాట.
ఆ ముగ్గురు కుర్రాళ్ళు.. ఆ ‘స్పందించే స్కూటర్’కి ‘టుక్ టుక్’ అనే పేరు పెట్టి, దాని ద్వారా డబ్బులు సంపాదిస్తుంటారు.

కట్ చేస్తే, కొన్ని రోజుల తర్వాత, అందులో దెయ్యం వుందనే అనుమానం కలుగుతుంది ఆ కుర్రాళ్ళకి. భయపడతారు. ఏం చేయాలో అర్థం కాక గింజుకుంటారు.
ఇంతకీ, అందులో నిజంగానే దెయ్యం వుందా.? వుంటే, మంచి దెయ్యమా.? చెడ్డ దెయ్యమా.? అన్నది మిగతా కథ.!
కారులో దెయ్యం.. అనగానే, మనకి చాలా సినిమాలు గుర్తుకొస్తాయ్. నయనతార నటించిన ఓ తమిళ సినిమా.. అప్పట్లో హాట్ టాపిక్. తెలుగులో విజయ్ దేవరకొండ చేసిన ‘ట్యాక్సీ వాలా’ సినిమా కూడా దాదాపు ఇంతే.
హర్రర్ ఏదీ ఎక్కడ.?
మరి, వాటన్నిటితో పోల్చితే, ‘టుక్ టుక్’ ఎలా భిన్నం.? ‘హర్రర్’ అన్నారుగానీ, ఇందులో హర్రర్ ఏమీ లేదు.! కుర్రాళ్ళ సరదా వేషాలు, ఓ మెసేజ్.. ఇంతే సినిమా కథ.
ముగ్గురు కురాళ్ళూ చాలా బాగా చేశారు. శాన్వీ మేఘన ఎనర్జీ, ఈ సినిమాకి ప్లస్ పాయింట్. స్క్రీన్ ప్లే విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే, బెటర్ రిజల్ట్ వచ్చి వుండేది.
చాలా సేపు, లీడ్ యాక్ట్రెస్ కనిపించకపోవడం, కొంత బోరింగ్‌గా అనిపిస్తుంది.
సినిమాలో విలన్లు ఎవరూ లేరు.! అదో మైనస్.! ఎందుకంటే, స్ట్రగుల్ అనేది వుండాలి.. అప్పుడే కదా, హర్రర్ సినిమాలు ఎట్రాక్టివ్‌గా వుంటాయ్.
Also Read: ఇవానా.!ఈ అమ్మాయ్ ఎవరో తెలుసునా.!
దెయ్యం మీద సినిమా పూర్తయ్యాక కూడా సింపతీ రాదు. సిల్లీగా వుంటుందది. దర్శకుడు ఏదో చెప్పాలనుకున్నాడుగానీ, ఎట్రాక్టివ్‌గా చెప్పలేకపోయాడు.
అలాగని, తీసి పారేసే సినిమా కూడా కాదు. కుటుంబమంతా కలిసి కూర్చుని చూసే సినిమానే.! పాత్రలకు అద్దిన యాస, కొంచెం గందరగోళానికి గురిచేస్తుంది.
చిన్న సినిమా గనుక, అందుబాటులో వున్న వనరులకు అనుగుణంగా సినిమాని బాగానే తెరకెక్కించారు. ఓటీటీలో ఉచితంగానే లభిస్తుంది గనుక, ఓ లుక్కేయొచ్చు ఖాళీగా వున్నప్పుడు.