Uagadi Subhakankshalu.. కొత్త సంవత్సరం అంటే చాలామందికి తెలిసింది.. పాత సంవత్సరానికి గుడ్ బై చెబుతూ, కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే డిసెంబర్ 31 అర్థరాత్రి.. జనవరి 1 తెల్లవారు ఝాము.!
తప్పతాగి చిందులేసే ఆ ‘మూమెంట్’కి వున్న క్రేజ్, షడ్రుచులను ఆస్వాదించే సంప్రదాయ పండుగ.. ఉగాదికి లేకపోవడం శోచనీయమే.!
ట్రెండ్ మారింది.! పండగలూ మారాయ్. పండగ అంటే కొత్త బట్టలు.. పండగ అంటే హంగామా.! సోషల్ మీడియాలో పోస్టింగ్స్.. వాట్సాప్ స్టేటస్.. ఇలా తయారయ్యింది.
ఉగాది అంటే ఏంటి.? దాని ప్రాముఖ్యత ఏంటి.? ప్రతిరోజూ లానే ఉగాది కూడా ఇంకో రోజుతో ప్రారంభమవుతుందంతేనా.?
Uagadi Subhakankshalu ఉగాది ప్రత్యేకతలివీ.!
ఉగాదికి చాలా చాలా ప్రత్యేకతలున్నాయి. ప్రతిరోజు లానే ఉగాది రోజు కూడా ప్రారంభమవుతుంది. ఆ ప్రారంభాన్ని ప్రత్యేకంగా మార్చుకుంటేనే అది పండగ.
యుగాది.. ఉగాది.. కొత్త సంవత్సరాది.. నేటితో కొత్త రోజుని, కొత్త సంవత్సరాన్ని, కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నట్లుగా భావించాలని పెద్దలు చెబుతుంటారు. నిన్నటి చేదు జ్ఞాపకాల్ని పక్కన పెట్టి, నేటి నుంచి మధురమైన జీవితాన్ని ఆస్వాదించాలన్నది పెద్దలు చెప్పేమాట.

షడ్రుచులు.. ఉప్పు, కారం, పులుపు, తీపి, చేదు, వగరు.. ఇవి నిత్య జీవితంలో మనకు ప్రతిరోజూ ఎదురయ్యేవే. కానీ, వాటిల్లో పరమార్ధాన్ని ఉగాది పచ్చడి ప్రత్యేకంగా వివరించి చెబుతుంటుంది.
షడ్రుచుల అర్థం.. పరమార్ధం.!
ఏ రుచి, ఏ అనుభవానికి సంబంధించినదో చెబుతూ, ఆయా అనుభూతుల నుంచి మనం ఏం నేర్చుకోవాలి.? ఎలా నడచుకోవాలన్నది ఉగాది పండుగ పరమార్థం తెలుసుకుంటే అర్థమవుతుంది.
ఇంటి గుమ్మానికి మావిడాకులు కట్టినా.. ఉగాది పచ్చడిలో మామిడికాయ, వేప పువ్వు, బెల్లం వంటివి వేసినా.. ఇవన్నీ పండగ పరమార్ధాన్ని వివరిస్తూనే, ప్రకృతిలో మమేకమవ్వడమెలాగో తెలియజేస్తాయి.
మన శరీరానికి ఏది ఎంత అవసరమో తెలుసుకోవడం.. మన జీవితంలో ఏది ఎంత వున్నా మనుషుల్లా మెలగడం, మానవత్వాన్ని మరవకుండా నడచుకోవడం.. ఇవీ పండగ ద్వారా మనల్ని మనం మార్చుకోవాల్సినవి.
Also Read: శ్రీకూర్మం.. కూర్మావతారంలో శ్రీ మహా విష్ణువు కొలువుదీరిందిక్కడే.!
జీవితంలో ఎదురయ్యే చేదు ఘటనల్ని ధైర్యంగా ఎదుర్కోవాలి.. మధుర జ్ఞాపకాల్ని మనతోపాటే ముందుకు తీసుకెళ్ళాలి.. సరైన లక్ష్యాల్ని నిర్దేశించుకుని, వాటిని సాధించేందుకు కష్టపడాలి.
పంచాంగ శ్రవణం ఉగాది మరో ప్రత్యేకత. అయితే, ఇప్పుడు నడుస్తున్న పంచాంగ శ్రవణాలు వేరు. రాజకీయ పంచాంగ శ్రవణాలు, వ్యాపార పంచాంగ శ్రవణాలు.. ఇలా తయారయ్యాయ్. ప్చ్.. అదో రుచి.. అదే చేదు రుచి అని సరిపెట్టుకుందామా.? సరే, ఆ సంగతి పక్కన పడేద్దాం.
కొత్త ఏడాది.. అదేనండీ, కొత్త సంవత్సరాది.. ఉగాది పర్వదినం నేపథ్యంలో అందరికీ ఉగాది శుభాకాంక్షలు.!