Table of Contents
Srikurmam Temple.. హిందూ మతం అనేది మతం కాదు, ధర్మం.. అంటారు పెద్దలు. ప్రకృతితో మమేకమయ్యేదే హిందూ ధర్మం. పామును నాగ దేవత అంటాం. వరాహం, వానరం, శునకం.. ఇలా ప్రతీ జీవంలోనూ దైవాన్ని వెతికేదే హిందూ ధర్మం. అలా తాబేలును కూర్మం అంటాం. శ్రీ మహా విష్ణువు దశావతారాల్లో రెండో అవతారమే ఈ కూర్మావతారం.
కూర్మం అంటే నెమ్మది. కూర్మం అంటే, ఓపిక.. కూర్మం అంటే పట్టుదల. ఎంతటి పెద్ద కార్యమైనా, ఎంతటి కష్టతరమైనా ఓర్పుతో పూర్తి చేయగల సామర్ధ్యం కూర్మానికి ఉందని చెప్పడమే ఈ కూర్మావతార ఉద్దేశ్యం.
స్వయంగా శ్రీ మహా విష్ణువే తాబేలుగా మారి..
పూర్వం దేవతలు, రాక్షసులు అమృతం కోసం పాల సంద్రాన్ని చిలికగా అమృతం వెలువడింది. అది అందరికీ తెలిసిందే. అయితే, సాగర మధనం అనేది చిన్న విషయం కాదు, అందుకే సాగర మధనానికి ఏకంగా ఓ పర్వతాన్నే ఉపయోగించారు దేవతలు, రాక్షసులు. అలా సాగర మధనం చేసే క్రమంలో మంధర పర్వతాన్ని కవ్వంగా చేసుకుని, వాసుకి అను సర్పరాజాన్ని ఆ పర్వతానికి కట్టి, ఓ వైపు దేవతలు, మరోవైపు రాక్షసులు లాగబోయారు.

అయితే, కింద ఆధారం లేకపోవడంతో, ఆ పర్వతం నిలవలేకపోయింది. అనంతమైన సముద్రంలో అంత పెద్ద పర్వతాన్ని మోయగలిగే ఓపిక, ఓర్పు ఎవరికి ఉంటుంది.? దేవతలు కానీ, రాక్షసులు కానీ, ఎవ్వరూ ఆ సాహసానికి ఒడికట్టలేకపోయారు. అప్పుడు దేవతలు శ్రీ మహా విష్ణువును ప్రార్ధించారు.
అంతట శ్రీ మహా విష్ణువు ఓర్పుకు చిహ్నమైన తాబేలు అవతారమెత్తి, ఆ మంధర పర్వతానికి ఆధారమవుతాడు. పర్వతం కింద తానెంత బాధతో నలిగిపోయినా, కాగల కార్యం పూర్తయ్యేవరకూ ఓర్పుతో భరించింది కనుకే తాబేలును ఓర్పుకు చిహ్నంగా చెబుతారు.
బ్రహ్మ దేవుడు ప్రతిష్టించిన మూల విరాట్టు..
అలా సాగర మధనం కోసం శ్రీ మహా విష్ణువు ధరించిన ఆ రూపాన్నే బ్రహ్మదేవుడు స్వయంగా భూమిపై ప్రతిష్టించాడు. అదే శ్రీ కూర్మ దేవాలయం. ఈ దేవాలయం ఆంధ్ర ప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో ఉంది.
Also Read (ఇది కూడా చదవండి..): శ్రీశైలం చూసొద్దాం
శ్రీ మహా విష్ణువు తాబేలు రూపంలో ఉన్న ఇలాంటి దేవాలయం మన తెలుగు రాష్ర్టాల్లో మరెక్కడా కనిపించదు. తెలుగు రాష్ర్టల్లోనే కాదు, దేశంలోనే ఎక్కడా.. ఆ మాటకొస్తే, ప్రపంచంలోనే మరెక్కడా తాబేలు రూపంలో శ్రీ మహా విష్ణువు కనిపించే దేవాలయం లేదు. ఈ ఆలయాన్ని ఎవరు, ఎప్పుడు నిర్మించారన్న అంశంపై ఇంతవరకూ క్లారిటీ లేదంటేనే అర్ధం చేసుకోవాలి ఎంత పురాతనమైన దేవాలయమో ఇది.
అంతుపట్టని రహస్యాలెన్నో..
ఎన్నో అంతు పట్టని వింతలకూ, విచిత్రాలకూ ఆనవాలం ఈ దేవాలయం. ఇక్కడ స్వామి రూపం పడమటి అభిముఖంగా ఉంటుంది. గర్భాలయంలో మూల విరాట్టును తల, మధ్య భాగం, తోక.. మూడు భాగాలుగా కొలుస్తారు. ఆలయ ప్రాంగణంలో ఎక్కడా లేని విధంగా రెండు ధ్వజ స్థంభాలుంటాయి.
పితృ కార్యాలకు ప్రత్యేకం..
ప్రతీ మాఘ శుధ్ద చవితి నాడు గంగా మాత వారణాసి నుండి వచ్చి, ఇక్కడి శ్వేత పుష్కరణిలో కలుస్తుందట. అందుకే ఈ పుష్కరణిలో స్నానమాచరిస్తే, సకల పాపాలు నశిస్తాయనీ నమ్ముతారు. పితృ కార్యాలకు కాశీ తర్వాత ఈ క్షేత్రాన్నిఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఇక్కడి శ్వేత పుష్కరణిలో పిండ ప్రధానాలు చేయడం వల్ల, వారు ఇక్కడ సాల గ్రామ శిలలుగా మారతారని భక్తుల విశ్వాసం.
అబ్బురపరిచే శిల్ప కళా నైపుణ్యం..
ఇక్కడి శిల్ప సౌందర్యం మరో ప్రత్యేకత. సహజంగా ఆలయాల్లోని శిల్పాలు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అయితే, ఈ ఆలయంలోని శిల్పాలు మాత్రం మిక్కిలి ప్రత్యేకం. శిల్పాలే కాదు, ఇక్కడి రాతి స్థంభాలు కూడా విశిష్టమైనవే.
ఆలయంలో మొత్తం 108 రాతి స్థంభాలున్నాయి. అయితే, వీటిలో ఏ ఒక్క స్థంభం, మరో స్థంభంతో పోలి ఉండకపోవడం విశేషం. ఇంతటి విశిష్టతలున్న శ్రీ కూర్మ దేవాలయాన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శించి తరించాల్సిందే.

ఇదిలా వుంటే, దేశంలో మరో రెండు దేవాలయాల్లో శ్రీ మహా విష్ణువు కూర్మావతారంలో కొలువు దీరినప్పటికీ.. శ్రీకూర్మం ప్రత్యేకత వేరు. మిగతా రెండు దేవాలయాల్లో ఒకటి చిత్తూరు జిల్లాలోని శ్రీ కూర్మ వరదరాజస్వామి దేవాలయం కాగా, ఇంకొకటి కర్నాటక రాష్ట్రంలోని చిత్రదుర్గలోగల గవి రంగనాథ స్వామి దేవస్థానం.
శ్రీకాకుళం పట్టణం చేరుకుంటే, అక్కడి నుంచి కేవలం పది కిలోమీటర్ల దూరంలోనే శ్రీకూర్మం వుంటుంది గనుక.. అక్కడికి వెళ్ళడానికి స్థానికంగా రవాణా సౌకర్యం అందుబాటులోనే వుంటుంది.