ఉత్తరాఖండ్‌ని (Uttarakhand Disaster 2021 Chamoli) దేవభూమిగా అభివర్ణిస్తుంటారు. పవిత్ర పుణ్యక్షేత్రాలకు ఉత్తరాఖండ్ నెలవు కావడమే ఇందుకు కారణం. ప్రకృతి అందాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఉత్తరాఖండ్.. ఇటీవల వరుస దుర్ఘటనలకు కేరాఫ్ అడ్రస్ అవుతోంది.
ఎందుకిలా.? ఇంకెందుకు, మనిషి తన కక్కుర్తి కారణంగా ప్రకృతి అందాల్ని చెడగొడ్తుండడమే.. పర్యావరణం దెబ్బతింటే వినాశనమే కదా.! తెలిసీ, పర్యావరణాన్ని నాశనం చేస్తున్నామంటే.. మనం కూర్చున్న కొమ్మని మనం నరుక్కుంటున్నట్లే. తప్పదు, అనుభవించాల్సిందే.
అయితే, ఉత్తరాఖండ్‌లో ఇటీవల సంభవించిన ఘోరానికి అమెరికాతో ‘లింకు’ వున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఎప్పడో 1965లో అమర్చిన ఓ రేడియేషన్ పరికరం కారణంగానే తాజా పెను విపత్తు సంభవించిందట.
చైనా చేపడ్తోన్న అణు పరీక్షల గురించి తెలుసుకునేందుకోసం అమెరికా ఏర్పాటు చేసిన ఓ పరికం, అప్పట్లోనే గల్లంతయ్యిందనీ, అది మంచు దిబ్బల కింద కూరుకపోయిందనీ, అణు శక్తితో పనిచేసే ఆ పరికరానికి సంబంధించిన ‘శక్తిని అందించే క్యాప్సూల్స్’ ఇప్పుడు ఈ వైపరీత్యానికి కారణమని అంచనా వేస్తున్నారు. అయితే, ఈ విషయమై ఇప్పటిదాకా ఇటు ఉత్తరాఖండ్ ప్రభుత్వంగానీ, అటు కేంద్ర ప్రభుత్వం గానీ ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు.
‘25 వేల అడుగుల ఎత్తులో వున్న నందా దేవి శిఖరాగ్రానికి ఆ పరికరాన్ని తీసుకెళుతుండగా, వాతావరణం అకస్మాత్తుగా మారిపోయి, ప్రమాకరంగా తయారైంది. ఈ క్రమంలో పరికరాన్ని కిందికి తీసుకొచ్చేందుకు అవకాశం లేక, అక్కడే వదిలేశాం. మంచులో ఒక గుంత తవ్వి, అందులో ఆ పరికరాన్ని పెట్టాం. మళ్ళీ దాన్ని ఇంకోసారి మార్చాలనుకున్నాంగానీ, తర్వాత వెళ్ళి చూస్తే, అది అక్కడ కనిపించలేదు. మొత్తం ఆ జనరేటర్‌లో ఆరు క్యాప్సుల్స్ వున్నాయి..’ అని దిగ్గజ పర్వతారోహకుడు కెప్టెన్ ఎం.ఎస్. కోహ్లీ వెల్లడించారు.
అమెరికాకి చెందిన సీఐఏ, భారత ఇంటెలిజెన్స్ బ్యూరో, స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ అప్పట్లో చేపట్టాయని కోహ్లీ చెబుతున్నారు.
100 ఏళ్ళపాటు శక్తినందించే క్యాప్సూల్స్‌తో కూడిన జనరేటర్‌లో పేలుడు సంభవించడం (Uttarakhand Disaster 2021 Chamoli) వల్ల అకస్మాత్తుగా వరదలు ముంచెత్తి, ఓ జల విద్యుత్ కేంద్రాన్ని పూర్తిగా నాశనం చేయడం, మరో జల విద్యుత్ కేంద్రానికి పాక్షికంగా నష్ట కలిగించడం తెలిసిన విషయమే.
ఈ దుర్ఘటనలో దాదాపు 200 మంది గల్లంతయ్యారు. వారిలో ఎవరూ బతికి వుండే అవకాశమే లేదని భావిస్తున్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే, ప్రమాదానికి అమెరికా పరికరం ఒక్కటే కారణం కాకపోవచ్చనీ, అడ్డగోలుగా నిర్మిస్తోన్న జల విద్యుత్ ప్రాజెక్టులూ కారణమని పర్యావరణ వేత్తలు అభిప్రాయపడుతున్నారు.