ఇదిప్పుడు అఫీషియల్. నేచురల్ స్టార్ నాని, విలక్షణ నటుడు సుధీర్‌బాబు కాంబినేషన్లో రూపొందిన ‘వి’ (V Movie To Release On OTT) సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చేస్తోంది. అయితే, ఈ సినిమా థియేటర్లలో విడుదల కావడంలేదు. అమెజాన్ ప్రైమ్ ద్వారా ఈ సినిమా విడుదల కాబోతోంది.
ఓటీటీ తప్ప వేరే దారి లేకుండా పోయిన ప్రస్తుత పరిస్థితుల్లో చాలా సినిమాలు ఇప్పటికే, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ మీద రిలీజయిన విషయం విదితమే. ఆ కోవలోకే ‘వి’ కూడా చేరిపోనుంది. ఈ విషయాన్ని హీరో నాని స్వయంగా ప్రకటించాడు. విలక్షణ చిత్రాల దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ ‘వి’ సినిమాలో అదితిరావు హైదరీ, నివేదా థామస్ హీరోయిన్లుగా నటించిన విషయం తెలిసిందే.
నిజానికి, మార్చి నెలలో ఈ సినిమా విడుదల కావాల్సి వుంది. సరిగ్గా, సినిమా విడుదలకు ముందు కరోనా వైరస్ నేపథ్యంలో లాక్డౌన్ ప్రకటించడంతో సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాని ది¸యేటర్లలోనే రిలీజ్ చేయాలనే పట్టుదలతో చిత్ర దర్శక నిర్మాతలు ఇన్నాళ్ళూ ఎదురుచూశారు.
కానీ, ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే పరిస్థితి లేకపోవడం, ఒకవేళ ది¸యేటర్లు త్వరలో తెరచుకున్నా.. ఇదివరకటిలా ప్రేక్షకులు ది¸యేటర్లకు పోటెత్తడం సాధ్యమయ్యే పరిస్థితులు లేని దృష్ట్యా ‘వి’ చిత్ర దర్శక నిర్మాతలు సినిమాని ఓటీటీ ద్వారా విడుదల చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
సెప్టెంబర్ 5న ‘వి’ అమెజాన్ ప్రైమ్ ద్వారా (V Movie To Release On OTT) విడుదల కాబోతోంది. ఈ సినిమాలో నాని నెగెటివ్ షేడ్స్ వున్న రోల్లో కన్పిస్తాడు. సినిమా ప్రోమోస్ ఇప్పటికే సినిమాపై హైప్‌ని బాగా పెంచేశాయి. మొత్తమ్మీద, ఓ మోస్తరు పెద్ద సినిమా ‘వి’ ఓటీటీలో రిలీజ్ కానుండడంతో, ఈ సినిమా రిలీజ్ తర్వాత.. ఇంకా పెద్ద సినిమాలు కూడా ఓటీటీ వైపు చూసే అవకాశం లేకపోలేదు.
ఇదిలా వుంటే, నాని తదుపరి సినిమా ‘టక్ జగదీష్’ మాత్రం సినిమా థియేటర్లలోనే విడుదలవుతుందట. ఈ విషయాన్ని నాని స్వయంగా వెల్లడించాడు.