Vijaya Sai Reddy Resigns.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు తాజాగా ప్రకటించారు విజయ సాయి రెడ్డి.
వైసీపీలో కీలక నేతగా ఓ వెలుగు వెలిగిన విజయ సాయి రెడ్డి, రాజ్య సభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు.. అదీ ‘ఎక్స్’ వేదికగా.!
విజయ సాయి రెడ్డి అంటే కేవలం వైసీపీ నేత మాత్రమే కాదు, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన అక్రమాస్తుల కేసులో ఎ2 నిందితుడు కూడా.
ఎ2 నిందితుడు విజయ సాయి రెడ్డి అప్రూవర్‌గా మారితే, ఎ1 నిందితుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి.? అన్న చర్చ సహజంగానే తెరపైకొస్తుంది కదా.?
Vijaya Sai Reddy Resigns.. ఎక్స్‌లో రాజీనామా..
‘‘రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను. రాజ్యసభ సభ్యత్వానికి రేపు 25వ తారీఖున రాజీనామా చేస్తున్నాను. ఏ రాజకీయపార్టీ లోను చేరడంలేదు.
వేరే పదవులో, ప్రయోజనాలో లేక డబ్బులో ఆశించి రాజీనామా చేరడంలేదు. ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తి గతం. ఎలాంటి ఒత్తిళ్లు లేవు. ఎవరూ ప్రభావితం చెయ్యలేదు.
నాలుగు దశాబ్దాలుగా, మూడు తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వై యస్ కుటుంబానికి రుణపడి ఉన్నాను.
రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ గారికి, నన్ను ఇంతటి ఉన్నతస్థాయికి తీసుకెళ్ళిన భారతమ్మ గారికి సదా కృతజ్ఞుడిని. జగన్ గారికి మంచి జరగాలని కోరుకుంటున్నా.
పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పార్టీ మరియు రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా కృషి చేశా.
కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశా. దాదాపు తొమ్మిది సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనోధైర్యాన్నిచ్చి తెలుగురాష్ట్రాల్లో నాకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోడీ గారికి, హోం మంత్రి అమిత్ షా గారికి ప్రత్యేక ధన్యవాదాలు.
టీడీపీతో రాజకీయంగా విభేదించా. చంద్రబాబు గారి కుటుంబంతో వ్యక్తి గతంగా విభేదాలు లేవు. పవన్ కళ్యాణ్ గారితో చిరకాల స్నేహం ఉంది. నా భవిష్యత్తు వ్యవసాయం.
సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన నా రాష్ట్ర ప్రజలకి, మిత్రులకి, సహచరులకి, పార్టీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికీ పేరు పేరునా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను.’’
ఇదీ విజయ సాయి రెడ్డి ‘ఎక్స్’ వేదికగా చేసిన పోస్ట్.!
ఇందులో, ‘పవన్ కళ్యాణ్‌తో చిరకాల స్నేహం’ అంటూ విజయ సాయి రెడ్డి పేర్కొనడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. పైగా, ‘నా భవిష్యత్తు వ్యవసాయం’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారాయన.
చిరకాల స్నేహం.. ముందు జాగ్రత్త.!
‘సీజ్ ది షిప్’ ఎపిసోడ్‌లో విజయ సాయి రెడ్డి మీద ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విజయ సాయి రెడ్డి వైసీపీకి, రాజ్యసభ పదవికి రాజీనామా ప్రకటించారని అనుకోవాలా.?
అంతా బాగానే వుందిగానీ, పవన్ కళ్యాణ్‌తో విజయ సాయి రెడ్డికి చిరకాల స్నేహం ఎలా సాధ్యమైంది.? ఆ స్నేహమే నిజంగా ఏడిస్తే, పవన్ కళ్యాణ్‌ని వైసీపీ నేతలు తూలనాడుతున్నప్పుడు, స్నేహితుడు విజయ సాయి రెడ్డి నోరు పెగల్లేదెందుకు.?
ఏది ఏమైనా, వైసీపీని అదఃపాతాళానికి తొక్కేస్తానని ప్రకటించిన పవన్ కళ్యాణ్, మాట నిలబెట్టుకుంటున్నారు. వైసీపీలో అత్యంత కీలక నేత విజయ సాయి రెడ్డి.
సోషల్ మీడియా దగ్గర్నుంచి, ఢిల్లీ రాజకీయాల వరకు.. వైసీపీకి అన్నీ తానే అయి వ్యవహరించిన విజయ సాయి రెడ్డి, వైసీపీకి గుడ్ బై చెప్పడమంటే, వైసీపీ అనే రాజకీయ పార్టీ కాల గర్భంలో కలిసిపోయినట్లే.!