Vinodhaya Sitham Telugu Review.. చాన్నాళ్ళ క్రితమే ఓటీటీలో చూసేసిన సినిమా ఇది. తీరిక దొరక్క రివ్యూ రాయడం కుదర్లేదు.! 100 నిమిషాల లోపే సినిమా.!
అంటే, రెండు గంటల నిడివి కూడా లేదు.! సముద్రఖని దర్శకుడు. ఈ సినిమాలో నటించాడు కూడా.
తంబిరామయ్య కీలక పాత్రధారి.! ఓ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతాడు. కానీ, ‘టైమ్’ దేవుడు అతన్ని బతికిస్తాడు.
అది కూడా, 90 రోజుల గడవుతోనే సుమీ.! ఈ తొంభై రోజుల్లో, పరశురామ్ (తంబి రామయ్య), తనను తాను ఎలా తెలుసుకున్నాడన్నదే అసలు కథ.!
ఇద్దరు కూతుళ్ళు.. ఓ కొడుకు.! ఆ ఇద్దరు కూతుళ్ళలో ఒకరేమో, తండ్రి వద్దనుకున్న కూతురు.!
అంటే, పెంచడం కష్టమవుతుందని, గర్భంలో వుండగానే.. ఆమెను చిదిమెయ్యాలనుకుంటాడు. ఆ చిన్న కూతురే, తండ్రి మీద అమితమైన ప్రేమ కలిగి వుంటుంది.
అలాగని, కొడుకు.. ఇంకో కూతురు చెడ్డవాళ్ళని కాదు.! పరశురామ్ ఆయా వ్యక్తుల్ని చూసే కోణంలోనే ‘తప్పు’ వుంటుంది.
బాస్ విషయంలో కూడా పరశురామ్ పొరపాటుగానే ఆలోచిస్తాడు. జీవితంలో చేసిన తప్పుల్ని కూడా తెలుసుకుంటాడు.. ఈ తొంభై రోజుల్లో పరశురామ్.!
Vinodhaya Sitham Telugu Review.. తొంభై రోజుల తర్వాత..
తొంభై రోజుల గడువు తీరాక, పరశురామ్‌ని టైమ్ దేవుడు తనతోపాటు తీసుకెళ్ళిపోతాడు. మామూలుగా అయితే, యముడు.. యమభటులు కదా ఇలాంటి పనులు చేసేది.!
కాస్త కొత్తగా ఆలోచించినట్టున్నాడు దర్శకుడు సముద్రఖని. ఆయనే ఈ సినిమాలో టైమ్ దేవుడి పాత్రలో కనిపించాడు.
సినిమాలో చక్కటి సందేశం వుంది. మామూలుగా అయితే, ఇలాంటి సినిమాలు కమర్షియల్ సినీ అభిమానులకు అంతగా ఎక్కవ్.!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమా తెలుగు వెర్షన్‌లో నటిస్తుండడం ఓ విశేషం.
తమిళంలో తంబిరామయ్య పోషించిన పాత్రని, సాయిధరమ్ తేజ్ చేస్తుండడం.. ఇంకా విశేషం. వెరసి, ‘వినోదయ సితం’ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లోనూ ఆసక్తి పెరిగింది.
బ్రో ఎఫెక్ట్.!
‘బ్రో’ వచ్చేస్తోంది కదా.! కానీ, ఈలోగా ‘వినోదయ సితం’ ఇంకోసారి చూసేద్దాం.. అనుకుంటున్నారంతా.. చూసేస్తున్నారు కూడా.
సినిమాలో తమిళ డైలాగులు.. తెలుగోళ్ళకీ తేలిగ్గానే అర్థమవుతున్నాయ్. సినిమాలోని ఎమోషన్స్ అలాంటివి. కంటెంట్ అలాంటిది.
సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.. అన్నీ చాలా బాగా కుదిరాయ్. నటీనటులెవరూ ‘అతి’ చేయలేదు. జస్ట్ ఆయా పాత్రల్లో జీవించారంతే.
చివర్లో.. భాష గురించి మాట్లాడే సందర్భం.. భూమ్మీదే తప్ప.. స్వర్గంలోగానీ.. నరకంలోగానీ.. భాషల ప్రస్తావన.. కులాలు, మతాల ప్రస్తావన రాదని చెప్పిన వైనం.. ప్రతి ఒక్కరినీ ఆత్మవిమర్శ చేసుకునేలా చేస్తుంది.
‘యముడికి మొగుడు’, ‘యమదొంగ’.. ఇలా చాలా సినిమాలు చూసేశాం. వాటితో పోల్చితే, ఇది కాస్త భిన్నం.! కమర్షియల్ లెక్కలకు దూరంగా తీసిన మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా.!
జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే, ఓసారి ‘వినోదయ సితం’ చూడాల్సిందే.!