VIP Devotees Media Overaction.. భక్తితో గుడికి వెళితే, అక్కడ బిచ్చగాళ్ళ కంటే హీనంగా మీడియా ప్రతినిథులు దర్శనమిస్తున్నారు.. సెలబ్రిటీల మీద ఎగబడటానికి.!
అసలు దేవాలయాల దగ్గర మీడియాకి ఏం పని.? చిన్నా చితకా దేవాలయాల దగ్గర అడుక్కున్నా ఫర్లేదు, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో, ఈ పాత్రికేయ భిక్షాటన క్షమార్హం కాదు.
నిత్యం, తిరుమలకు బోల్డంతమంది ప్రముఖులు వస్తుంటారు. నిజానికి, దేవుడి ముందర భక్తులందరూ సమానమే. కానీ, భక్తులందు వీఐపీ భక్తులు వేరయా.. అన్నట్లుంటుంది వ్యవహారం.
VIP Devotees Media Overaction.. పాత్రికేయ బిచ్చగాళ్ళ లొల్లి..
వైఐపీ దర్శనాల లొల్లి ఓ యెత్తు.. ఆ వీఐపీల చుట్టూ మూగే, పాత్రికేయ బిచ్చగాళ్ళు ఇంకో యెత్తు.! మీడియా మైకులు కనిపిస్తే, కొందరికి అస్సలు ఆగదు. నోటికొచ్చింది వాగేస్తుంటారు.
ఈ క్రమంలో రాజకీయ విమర్శలూ తిరుమల కొండపై సర్వసాధారణమైపోయాయి. వాటిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ చెప్పడం తప్ప, వీఐపీలకు బాధ్యత అనేదే వుండదు.
కొంతమంది ప్రముఖులు, మీడియా అతి పట్ల అప్రమత్తంగా వుంటారు. ‘నమో వెంకటేశ’ అంటూ వెళ్ళిపోతుంటారు.. పాత్రికేయ బిచ్చగాళ్ళ లొల్లిపై సమాధానం చెప్పకుండా.
Mudra369
భక్తీ లేదు, బాధ్యతా లేదు.! తిరుమలకి ప్రముఖులు వస్తున్నారంటే, అదో టైమ్ పాస్ వ్యవహారమే అయిపోయింది వాళ్ళకి.! అందుకే, పాత్రికేయ బిచ్చగాళ్ళూ పోటెత్తుతుంటారు చిల్లర కోసం.
ఔను, చిల్లర కోసమే.! ఎందుకంటే, వాళ్ళకి కవరేజ్ ఇస్తే, మీడియా ప్రతినిథులకీ, మీడియా సంస్థలకీ కాసులు వస్తాయ్ మరి.!
పబ్లిసిటీ పిచ్చోళ్ళు..
ఫలానా సినీ ప్రముఖులు తిరుమల వచ్చారు, ఫలానా రాజకీయ ప్రముఖులు తిరుమలని సందర్శించారంటూ.. మీడియాలో వచ్చే కథనాలు ఈ ‘పెయిడ్’ కోవలోనివే.
వీఐపీ భక్తుల్ని సామాన్య భక్తులు నానా బూతులూ తిట్టడం కొత్తేమీ కాదు. అయినా, వీఐపీ భక్తులకి సిగ్గూ ఎగ్గూ వుండదనుకోండి.. అది వేరే విషయం.
Also Read: కంపురాన్.! ప్రోపగాండాకి చెక్.! ఆ సన్నివేశాలపై కత్తెర.!
వీఐపీ భక్తులకే లేని సిగ్గు, తమకెందుకని పాత్రికే బిచ్చగాళ్ళూ సిగ్గొదిలేశారు. అదీ అసలు సంగతి.!
భక్తులెవరైనా, భక్తితో దేవాలయానికి వస్తే, అందులో తప్పు పట్టడానికేముంటుంది.? భక్తి ముసుగులో పబ్లిసిటీ స్టంట్లు చేయడమే మహాపాపం. అలాంటివారికి ‘కవరేజ్’ ఇవ్వాలనుకోవడం అంతకన్నా ఘోరం.!
తిరుమలకి వెళుతున్నామని మీడియాకి సమాచారమిచ్చి మరీ, పబ్లిసిటీ స్టంట్లు చేసే సినీ, రాజకీయ ప్రముఖులున్నారు. ‘బాగా కవరేజ్ ఇస్తున్నారా.? లేదా.?’ అని చెక్ చేసుకునే పబ్లిసిటీ పిచ్చోళ్ళు కూడా లేకపోలేదు. ఇలాంటివారి విషయంలో టీటీడీ అప్రమత్తంగా వుండాలి.
Mudra369
ప్రత్యేక సందర్భాల్లో.. అంటే, ఉత్సవాల సమయంలో మీడియా కవరేజ్ తప్పు కాదు.! విశిష్ట వ్యక్తుల పర్యటన నేపథ్యంలో మీడియా కవరేజ్‌ని కూడా తప్పు పట్టలేం.
కానీ, మొహాల మీద మైకులతో గుద్దేసే పైత్యాన్ని అస్సలేమాత్రం క్షమించలేం.