Table of Contents
ఇండియన్ క్రికెట్‌లో ‘విరాట’ పర్వం కొనసాగుతోంది. కాదు కాదు, అంతర్జాతీయ క్రికెట్‌లోనే విరాట్ కోహ్లీ తన ప్రస్థానాన్ని ఇంకెవరికీ సాధ్యం కాని రీతిలో కొనసాగిస్తున్నాడు. రికార్డులన్నీ విరాట్ కోహ్లీ (Virat Kohli) ముందర తల దించేసుకుంటున్నాయి. ‘ఈ రికార్డుల్ని చెరిపేయడం అసాధ్యం’ అని ఇప్పటిదాకా చాలామంది భావించిన రికార్డుల్ని, కోహ్లీ చాలా అవలీలగా దాటేస్తున్నాడు. సెంచరీల మోత మోగించేస్తున్నాడు. టెస్ట్ క్రికెట్, వన్డే క్రికెట్, టీ20 క్రికెట్.. ఫార్మాట్ ఏదైనాసరే, విరాట్ కోహ్లీనే ‘ది కింగ్’. అవును, విరాట్ కోహ్లీ ఇప్పుడు కింగ్ ఆఫ్ ది క్రికెట్‌గా అవతరించాడు.
పదివేల పరుగుల మొనగాడు..
క్రికెట్‌లో అతి కొద్ది మందికే సాధ్యమయ్యింది 10 వేల పరుగుల రికార్డ్. అంతటి ఘనమైన రికార్డ్‌ని, అతి తక్కువ మ్యాచ్‌లలో అధిగమించేసి దిగ్గజాలు అన్పించుకున్న క్రికెట్ లెజెండ్స్‌తోనే ‘ఔరా’ అన్పించేసుకున్నాడు విరాట్ కోహ్లీ. ఈ 10 వేల పరుగుల ఫీట్‌కి మన తెలుగు గడ్డ విశాఖపట్నం (Visakhapatnam) వేదిక కావడం మనందరికీ గర్వకారణం అంటే అది అతిశయోక్తి కాదేమో.
నిజానికి ఇలాంటి రికార్డులకు దగ్గరయ్యేటప్పుడు ఒకింత ఒత్తిడి వుంటుంది. అయితే, కోహ్లీ ఒత్తిడిని ఏమాత్రం ఒప్పుకోడు. ఒత్తిడిని చిత్తు చేయడం అతని నైజం. 10 వేల పరుగులు అవలీలగా దాటేశాడు. అర్థ సెంచరీ, సెంచరీ.. ఆపై 150 పరుగులు సాధించాడు ఈ మ్యాచ్‌లో.
కింగ్ ఆఫ్ క్రికెట్ అనేది అందుకే.. (King of Cricket)
మొదటి బ్యాటింగ్ చేసినప్పటి కంటే, సెకెండ్ బ్యాటింగ్‌లోనే విరాట్ కోహ్లీ (Virat Kohli) చురుకుదనం ఎక్కువగా కన్పిస్తుంటుంది. ప్రత్యర్థి నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కోహ్లీ ‘కసి’ చాలా ప్రత్యేకం. కోహ్లీ సాధించిన అత్యధిక పరుగులు కావొచ్చు, అత్యధిక సెంచరీలు కావొచ్చు.. చాలావరకు ఛేజింగ్‌లో చేసినవే. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ఆటగాళ్ళు ఒత్తిడికి లోనవుతారు. అసలు ఒత్తిడి అంటే ఏంటో తెలియదు కోహ్లీకి. అందుకే, ఛేజింగ్‌లో రెచ్చిపోతాడని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతుంటారు.
37 సెంచరీల మొనగాడు
ఒకటి కాదు రెండు కాదు.. పదీ కాదు, పాతికా కాదు.. 37 సెంచరీలు సాధించేశాడు కోహ్లీ. ఇదే జోరు కొనసాగిస్తే, ఇంకో 13 సెంచరీల్ని జస్ట్ ఏడాదిలో కోహ్లీ సాధించేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పటిదాకా క్రికెట్‌లో అత్యధిక సెంచరీల రికార్డ్ సచిన్ పేరు మీదనే వుంది. ఆ రికార్డ్ చెరిపేసి, కొత్త రికార్డ్ రాసేది మాత్రం ఖచ్చితంగా విరాట్ కోహ్లీనే. సచిన్ (Sachin Tendulkar) సైతం, ఈ విషయంలో కోహ్లీకే (King Kohli) మద్దతిస్తాడు. రికార్డులు సృష్టించేది, ఇంకొకరు చెరిపేసేందుకే.. అని సచిన్ చెబుతుంటాడనుకోండి. అది వేరే సంగతి.
యుద్ధ భూమి ఏదైనా, ప్రత్యర్థి ఎవరైనా..
స్వదేశంలో అయినా, విదేశాల్లో అయినా.. ప్రత్యర్థి ఎవరైనాసరే, విరాట్ కోహ్లీ పరుగుల దాహం మాత్రం తీరదు. ఓ మ్యాచ్‌లో సెంచరీ కొట్టేసి, ఆ తర్వాతి మ్యాచ్‌లో చేతులెత్తేయడం కాదు.. ప్రతి మ్యాచ్‌లోనూ సత్తా చాటాలని చూస్తాడు కోహ్లీ. అది అతని ప్రత్యేకతల్లో ఒకటి. కొట్టు, కొడుతూనే వుండు.. కొల్లగొడుతూనే వుండు.. అన్న సిద్ధాంతాన్ని బహుశా కోహ్లీ పాటిస్తాడేమో. ప్రత్యర్థి బౌలర్లను ‘ఊచకోత’ కోయడాన్ని బహుశా కోహ్లీ ఎంజాయ్ చేసినట్లుగా ఇంకెవరూ ఎంజాయ్ చేయరేమో. దటీజ్ కోహ్లీ.. కింగ్ కోహ్లీ (King Kohli).!
పదివేల పరుగుల్లో మనోళ్ళు..
పది వేల పరుగుల మైలురాయిని అందుకున్న వారిలో విరాట్ కోహ్లీతోపాటు, సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar), సౌరవ్ గంగూలీ (Saurav Ganguly), రికీ పాంటింగ్ Ricky Ponting (ఆస్ట్రేలియా), జాక్వెస్ కలిస్ Jacques Kalis (దక్షిణాఫ్రికా), ఎంఎస్ ధోనీ (Mahendra Singh Dhoni), బ్రియాన్ లారా (Brian Lara) (వెస్టిండీస్), రాహుల్ ద్రావిడ్ (Rahul Dravid) తదితరులున్నారు. ఈ లిస్ట్ చూస్తే భారత ఆటగాళ్ళ ఆధిపత్యం పరుగుల వేటలో ఏ స్థాయిలో వుందో అర్థమవుతుంది.