Table of Contents
లక్ష్యం ఎంత పెద్దదైనా, విరాట్ కోహ్లీ క్రీజ్‌లో కుదురుకున్నాడంటే అంతే సంగతులు… ప్రత్యర్థికి చెమటలు పట్టాల్సిందే. ఆ విషయం ఇంకోసారి నిరూపితమయ్యింది. వెస్టిండీస్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమిండియా తొలి మ్యాచ్‌లోనే సూపర్ హిట్ కొట్టింది. అలా ఇలా కాదు, ఓ వైపు విరాట్ కోహ్లీ, ఇంకో వైపు రోహిత్ శర్మ.. సెంచరీలతో చెలరేగిపోతే, పాపం వెస్టిండీస్ బౌలర్లు మైదానంలో ‘దిక్కులు’ చూడటం మినహా, ఇంకేమీ చేయలేకపోయారు. 323 పరుగుల విజయలక్ష్యాన్ని, 47 బంతులు మిగిలి వుండగానే ఛేదించింది మెన్ ఇన్ బ్లూ. బౌలింగ్‌లో కాస్త తడబడినా, విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా, ఘనవిజయాన్ని తొలి వన్డేలో అందుకుంది.
టాస్ గెలిచిన టీమిండియా..
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, టాస్ గెలిచి బౌలింగ్‌ని ఎంచుకున్నాడు. 19 పరుగులకే వెస్టిండీస్ తొలి వికెట్‌ని కోల్పోయింది. షమీ బౌలింగ్‌లో చందర్‌పాల్ వికెట్ కోల్పోయాడు. ఆ తర్వాత, 84 పరుగుల వరకు మరో వికెట్ కోల్పోకుండా జాగ్రత్తపడింది వెస్టిండీస్. అయితే, జోరు మీదున్న పోవెల్ ఖలీల్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వెస్టిండీస్ ఓ వైపు ధాటిగా ఆడుతూనే, ఇంకో వైపు వికెట్లను కోల్పోతూ వచ్చింది.
ఎలాగైతేనేం 50 ఓవర్లు పూర్తయ్యేసరికి వెస్టిండీస్ 8 వికెట్లు కోల్పోయి 322 పరుగులు చేయగలిగింది. వెస్టిండీస్ జట్టులో షిమ్రోన్ 106 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పోవెల్ అర్థ సెంచరీ సాధించాడు. భారత బౌలర్లలో చాహల్ 3 వికెట్లు తీయగా, జడేజా రెండు, షమీ రెండు, ఖలీల్ ఓ వికెట్ తీశారు.
నిరాశపర్చిన ధావన్ – రెచ్చిపోయిన కోహ్లీ
భారీ లక్ష్యాన్ని ఛేదించాల్సిన క్రమంలో టీమిండియా 10 వికెట్లకే తొలి వికెట్‌ని కోల్పోయింది. టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ 6 బంతుల్లో ఓ ఫోర్ కొట్టి, నాలుగు పరుగులకే ఔట్ అయ్యాడు. దాంతో ఒక్కసారిగా భారత క్రికెట్ అభిమానులు షాక్‌కి గురయ్యారు. అయితే, మరో ఓపెనర్ రోహిత్ శర్మ మాత్రం, ఆచి తూచి ఆడాడు. మరో ఎండ్‌లో విరాట్ కోహ్లీ రెచ్చిపోయాడు.
ఛేదనలో తన ట్రాక్ రికార్డ్‌ని మరింత మెరుగుపర్చుకున్నాడు టీమిండియా కెప్టెన్. 107 బంతుల్లోనే 140 పరుగులు చేశాడు విరాట్ కోహ్లీ. మొత్తం 140 పరుగుల్లో 21 బౌండరీలు, 2 సిక్సర్లు బాదిన విరాట్ కోహ్లీ, భారత జట్టు విజయాన్ని దాదాపు ఖరారు చేశాడు. అయితే, 140 పరుగుల వద్ద విరాట్ కోహ్లీ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన మన తెలుగబ్బాయ్ అంబటి తిరుపతి రాయుడు, 26 బంతుల్లో 22 పరుగులు చేశాడు. ఓ భారీ సిక్సర్ కూడా ఇందులో వుంది.
రో’హిట్’ మ్యాన్ అయ్యింది అందుకే మరి.!
నెమ్మదిగా స్టార్ట్ చేస్తాడు.. ఆ తర్వాత ఉతికి ఆరేస్తాడు.. ఇదీ రోహిత్ శర్మ స్టయిల్. అందుకే రో’హిట్’ మ్యాన్ అంటుంటారు అంతా ఆయన్ని. 152 పరుగులు చేసిన రోహిత్ శర్మ, నాటౌట్‌గా నిలిచాడు. ఈ క్రమంలో రోహిత్ 15 బౌండరీలు, 8 భారీ సిక్సర్లు బాదేశాడు. రోహిత్ అలా సిక్సర్లు బాదుతోంటే, వెస్టిండీస్ బౌలర్లు బిత్తరపోవాల్సి వచ్చింది. నిర్దాక్షిణ్యంగా వెస్టిండీస్ బౌలర్లని రోహిత్ శర్మ ఊచకోత కోశాడంటే అతిశయోక్తి కాదేమో. లక్ష్యం 400 పరుగుల పైన వుండి వుంటే, వన్డేల్లో మరోమారు రోహిత్ శర్మ డబుల్ సెంచరీ చేసేసేవాడేమో.!
రోహిత్ శర్మ బ్యాటింగ్‌లో సొగసు వుంటుంది.. ప్రత్యర్థుల బౌలింగ్‌ని తుత్తునియలు చేసే క్రమంలో ‘అరాచకం’ కన్పిస్తుంది. ప్రత్యర్థి ఎవరైనాసరే, రోహిత్ శర్మ బ్యాటింగ్ తీరులో మాత్రం మార్పు వుండదు. మామూలుగా అయితే రోహిత్ తొలి బంతి నుంచే దూకుడుగా వ్యవహరిస్తుంటాడు. ఈ మధ్య కొంచెం ట్రెండ్ మార్చినట్లున్నాడు. మూడు వన్డే డబుల్ సెంచరీలు సాధించిన ఒకే ఒక్క ఆటగాడిగా ఇప్పటికే రికార్డులకెక్కిన రోహిత్, వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ కూడా కొట్టేస్తాడేమో.!