లక్షలాది మంది అభిమానులున్న సినీ నటుడాయన. అంతే కాదు, బాధ్యతగల ప్రజా ప్రతినిథి కూడా. అయినా, బాలయ్య తన నోటినీ, చేతినీ అదుపులో పెట్టుకోలేరు. అభిమానుల చెంప ఛెళ్ళుమనిపించడంలో బాలయ్యకు సాటి ఇంకెవరూ రారంతే. ఆ సంగతి పక్కన పెడితే, ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ ప్రస్తావన వస్తే, ఆయనెవరో తనకు తెలియదని బాలయ్య (Who Is AR Rahman Asks Nandamuri Balakrishna) చిలిపి వెటకారం చేసేశారు.
నిజానికి, బాలయ్య చేసింది చిలిపి వెటకారం కాదు.. ఘాటైన కామెంట్. నిర్లక్ష్యపూరితమైన సమాధానం.. అంతకు మించి అహంకారం ప్రదర్శించారు బాలయ్య, ఎ.ఆర్.రెహమాన్ ప్రస్తావన వచ్చినప్పుడు. ‘పదేళ్ళకోసారి సినిమా చేస్తాడాయన..’ అంటూ రెహమాన్‌పై తన స్థాయికి తగని వ్యాఖ్యలు చేశారు నందమూరి బాలకృష్ణ.
అభిమానులు సైతం మెచ్చరు బాలయ్యా..
అభిమానుల్ని ఈ మాటలు అలరిస్తాయా.? ఛాన్సే లేదు. ఎందుకంటే, ఎ.ఆర్. రెహమాన్ అంటే చిన్న పేరు కాదు. ఆయనకున్న పేరు ప్రఖ్యాతులు అన్నీ ఇన్నీ కావు. పైగా, వివాదాలకు దూరంగా వుంటాడాయె. యావత్ భారతదేశం ఆయన సంగీతానికి ఫిదా అంటోంది. ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న సంగీత దర్శకుడు, గాయకుడు ఎ.ఆర్.రెహమాన్.
అన్నట్టు, బాలయ్య.. అక్కడితో ఆగలేదు. తన తండ్రి విషయంలోనూ చిలిపి వ్యాఖ్యలు చేశారు. శ్రీదేవి పిర్ర మీద కొట్టి, వీపు మీద గుద్ది.. ఆమెకు నటన నేర్పించారట స్వర్గీయ నందమూరి తారకరామారావు. అలాగని సెలవిచ్చారు బాలయ్య.
ఎన్టీయార్, శ్రీదేవి ఆత్మలు ఘోషిస్తాయ్..
శ్రీదేవికి నటన నేర్పించినట్లు ఎన్టీయార్ స్వయంగా ఎక్కడా చెప్పింది లేదు. సరే, మహానటుడు ఎన్టీయార్ ఎంతోమందిలో స్ఫూర్తి నింపి వుండొచ్చు. కానీ, బాలయ్య.. అలా వ్యాఖ్యానించడం.. సరదా కాదు, తన తండ్రి స్థాయిని తగ్గించడమే. అభిమానులూ హర్షించని వ్యాఖ్యలివి.
ఇదిలా వుంటే, భారతరత్న పురస్కారం విషయంలోనూ బాలకృష్ణ అభ్యంతకర వ్యాఖ్యలే చేశారు. స్వర్గీయ ఎన్టీయార్ కాలి గోటికి సరిపోదు.. కాలి కింద చెప్పుతో సమానం.. అంటూ దేశ అత్యున్నత పౌర పురస్కారంపై అవాకులు చెవాకులు పేలారు బాలయ్య. నందమూరి బాలకృష్ణ అంటే కేవలం సినీ నటుడు కాదు, ఆయన బాధ్యతగల ప్రజా ప్రతినిథి కూడా. ఆ విషయాన్ని ఆయన మర్చిపోతే ఎలా.?
బాలయ్య స్థాయికి తగని వ్యాఖ్యలివి.. శ్రీదేవి – ఎన్టీయార్ విషయంలో అయినా, రెహమాన్ విషయంలో అయినా.. భారతరత్న విషయంలో అయినా.. ఎమ్మెల్యే బాలయ్య (Who Is AR Rahman Asks Nandamuri Balakrishna) తన స్థాయిని తగ్గించేసుకునే విధంగానే విమర్శలు చేశారు. ఇందులో ఇంకో మాటకు తావు లేదు.