Ys Jagan Ambati Vulgarity.. ‘నేను బూతులు మాట్లాడకుండా వుండి వుండాల్సింది..’ అని స్వయంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా ముందర చెప్పారు.!
సరే, రాజకీయాలన్నాక ఆవేశకావేశకాలు సహజమే. ఈ క్రమంలో నోరు జారితే, అది తప్పుని తెలుసుకోవడం.. మంచి విషయమే.!
తమ పార్టీకి చెందిన నాయకుడు, నోరు జారినప్పుడు.. అధినేత, ఆ నాయకుడ్ని మందలించాలి. అంతే తప్ప, బూతులు మాట్లాడిన నాయకుడ్ని సమర్థించకూడదు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అయినా, నారా చంద్రబాబునాయుడికి అయినా.. పవన్ కళ్యాణ్‌కి అయినా ఇదే వర్తిస్తుంది.
ఆ మధ్య జన సేన ఎమ్మెల్యే ఒకరు, విధి నిర్వహణలో వున్న ఓ డాక్టర్‌పై నోరు జారితే, ఎమ్మెల్యేని మందలించారు జనసేనాని పవన్ కళ్యాణ్.
రాజకీయాల్లో బాధ్యత అంటే ఇలా వుండాలి. ఇక్కడ, అంబటి రాంబాబు విషయంలో కావొచ్చు, మరో వైసీపీ నేత విషయంలో కావొచ్చు.. వైఎస్ జగన్ ఏనాడూ, మందలించిన దాఖలాల్లేవు.
ముఖ్యమంత్రిగా వున్న సమయంలో వైఎస్ జగన్, పలు బహిరంగ సభల్లో వైసీపీ నాయకులతో, రాజకీయ ప్రత్యర్థుల్ని తిట్టించేవారు.. వాళ్ళలా తిడుతోంటే, పైశాచికానందం పొందేవారు.
జోగి రమేష్ సహా పలువురు వైసీపీ నేతలు, వైఎస్ జగన్ సమక్షంలోనే రాజకీయ ప్రత్యర్థుల్ని బూతులు తిట్టారు. ఆ సమయంలో వైఎస్ జగన్ ముసిముసి నవ్వులు నవ్వడం చూశాం.
గతంలో టీడీపీ నాయకులూ, అప్పట్లో వైసీపీ అధినాయకుడు జగన్ మీద బూతులతో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే టీడీపీ కార్యాలయంపై వైసీపీ దాడులు చేసింది.
బూతులకు రియాక్షన్ ఎలా వుంటుందో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలియనిది ఏమీ కాదు. వైసీపీ నాయకులకీ తెలుసు ఆ రియాక్షన్లు. ఎందుకంటే, వాళ్ళు చేసిన దాడులే అవి.
ఒక్కటి మాత్రం నిజం.. ఈ దాడులు ఇకపై ఆగాలి. ఈ బూతులూ ఇకపై ఆగిపోవాలి. కానీ, పిల్లి మెడలో గంట కట్టేదెవరు.?
ఏ పార్టీకి ఆ పార్టీ.. ఈ బూతులు, దాడుల విషయంలో పార్టీ శ్రేణుల్ని హెచ్చరించడం ద్వారా మాత్రమే, రాజకీయాల్లో మార్పు సాధ్యమవుతుంది.
రాజకీయమంటే ప్రజా సేవ. అంతే తప్ప, రాజకీయమంటే బూతులు కాదు, భౌతిక దాడులు అసలే కాదు.!
