కొన్నాళ్ళ క్రితం ఓ బహిరంగ సభలో సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయం ప్రస్తావనకు వస్తే, ఆయనెవరో తనకు తెలియదన్నట్టుగా వ్యవహరించారు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. దాంతో, అదో పెద్ద రాజకీయ దుమారానికి కారణమైంది అప్పట్లో.
మళ్ళీ ఇప్పుడు, ఇన్నాళ్ళకు అలాంటి వ్యవహారమే ఇంకోటి తెరపైకొచ్చింది. ఈసారి తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీయార్ ఎవరో తనకు తెలియదన్నట్టు వ్యవహరించారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినాయకురాలు వైఎస్ షర్మిల (YS Sharmila Slams KTR With Satires).
కేటీయార్ అంటే ఎవరు.? కేసీయార్ కొడుకు కదా.? అంటూ వెటకారంతో కూడిన అమాయకత్వం ప్రదర్శించిన షర్మిల అందర్నీ ఆశ్చర్యపరిచారు. అంతేనా, నిరుద్యోగుల సమస్యలపై పెద్ద మగోడు ఏం చేశాడంటూ కేటీయార్ మీద విరుచుకుపడ్డారామె.
అన్నట్టు, కొన్నాళ్ళ క్రితం ఆంధ్రపదేశ్‌లో టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు కూడా తనకు పవన్ కళ్యాణ్ అంటే ఎవరో తెలియదని వ్యాఖ్యానించడం రాజకీయంగా చర్చనీయాంశమయిన విషయం విదితమే. నిజానికి, పవన్ కళ్యాణ్ ఎవరో కేసీయార్ అలాగే అశోక్ గజపతిరాజుకి తెలియదని కాదు. కేటీయార్ ఎవరో షర్మిలకి తెలియదని కాదు.
కాకపోతే, అపరిచితుల్లా పై ముగ్గురూ వ్యవహరించారంతే. సెటైరికల్ మోడ్‌లో రాజకీయ నాయకులు ఇలా వ్యాఖ్యానించడం ఇటీవలి కాలంలో ఓ పొలిటికల్ ట్రెండింగ్ వ్యవహారంగా మారింది. తద్వారా సోషల్ మీడియా వేదికగా విమర్శలొస్తే.. ప్రత్యర్థుల నుంచి ఎదురుదాడి వస్తే.. అది మరింత పొలిటికల్ మైలేజ్ ఇస్తుందని (YS Sharmila Slams KTR With Satires) ఆయా రాజకీయ నాయకులు ఇలా చేస్తుంటారంతే.