ఫుడ్ డెలివరీ చేసే వ్యక్తి అతను. తన రోజువారీ పనిలో భాగంగా, ఓ ఇంటికి ఫుడ్ పార్శల్ ఇచ్చేందుకు వెళ్ళాడు. అక్కడ ఏమయ్యిందో తెలియదుగానీ, అతని మీద కేసు నమోదయ్యింది (Zomato Nose Breaking Story). పోలీసులు అరెస్ట్ చేశారు. ‘ఫుడ్ డెలివరీ ఇవ్వాల్సిన వ్యక్తి నా మీద దాడి చేశాడు..’ అంటూ, ఫుడ్ ఆర్డర్ ఇచ్చిన మహిళ ఓ వీడియో రిలీజ్ చేయడం గమనార్హమిక్కడ.
కానీ, ఫుడ్ డెలివరీ చేసిన వ్యక్తి తాను దాడి చేయలేదంటున్నాడు. ఆమె తనను తిట్టిందన్నాడు. మరోపక్క, అతని ఉద్యోగం ఊడింది. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో చుట్టూ ఈ మొత్తం వివాదానికి కేంద్ర బిందువు.
ఆ జొమాటో సంస్థలోనే పనిచేస్తున్న వ్యక్తి బాధితుడా.? నేరస్తుడా.? అన్నది తేలాల్సి వుంది. ‘అతను చెప్పేది నిజమైతే, ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోండి..’ అంటూ బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా ఈ వివాదంపై స్పందించారు.
‘నేను నమ్ముతున్నాను, అతను ఏ తప్పూ చేయలేదు.. దయచేసి నిజాలు అందరికీ తెలియజేయండి..’ అంటూ సోషల్ మీడియాలో పరిణీతి చోప్రా (Parineeti Chopra) వేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.
సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో మహిళ వైపే అంతా నిలబడతారు. పైగా, ఈ ఘటనలో ఆమె బాధితురాలనడానికి, ఆమె ముక్కుపై గాయం కూడా వుంది. కానీ, ఆ గాయం తన వల్ల జరగలేదని ఫుడ్ డెలివరీ చేసిన వ్యక్తి అంటున్నాడు.
సదరు మహిళ చేతి వేలికి వున్న రింగ్ ఆమె ముక్కుకే తగులుకుని (Zomato Nose Breaking Story) గాయమయ్యిందన్నది ఆ వ్యక్తి వాదన. ఉద్యోగం పోయింది.. కేసు నమోదవడంతో 25 వేల రూపాయలు కేసు ఖర్చుల కోసం వెచ్చించాల్సిందట ఫుడ్ డెలివరీ చేసే వ్యక్తి కామరాజ్‌కి.
బెంగళూరులో జరిగిన ఈ ఘటనలో ఫుడ్ ఆర్డర్ చేసిన మహిళ పేరు హితేషి చంద్రాని. హితేష్ చంద్రాని వైద్య ఖర్చులతోపాటు కామరాజ్ కేసు ఖర్చుల్నీ ప్రస్తుతానికి తామే భరిస్తామని జొమాటో సంస్థ పేర్కొనడం మరో ఆసక్తికరమైన అంశం.
