Table of Contents
Sita Ramam Bimbisara Result.. ‘ప్రేక్షక మహాశయులు.. ప్రేక్షక దేవుళ్ళు..’ అంటుంటారు సినీ జనాలు, సగటు సినీ ప్రేక్షకుడ్ని ఉద్దేశించి.
ఓ సైన్మా హీరో అయితే, తన అభిమానుల్ని ఉద్దేశించి, ‘మాకు మీ అభిమానం చాలు, ఆస్తిపాస్తులేవీ వద్దు..’ అని సెలవిచ్చాడు ఈ మధ్యనే.
ఏదో అలా అనేశాడుగానీ, నిజంగా ఆస్తిపాస్తులు వద్దనుకుంటాడా ఏ హీరో అయినా.? సంపాదించిన ఆస్తుల్ని అభిమానులకు రాసిచ్చేయగలడా.?
సగటు సినీ అభిమానిని దేవుడిలా చూడకపోయినా ఫర్వాలేదుగానీ, ‘వీడ్ని ఎలాగైనా దోచెయ్యొచ్చు..’ అన్న ఆలోచనతో ‘వెర్రి వెంగళప్ప’ని చెయ్యకూడదు.!
Bimbisara Sita Ramam Result.. సినీ దోపిడీకి.. ప్రేక్షకుడి దెబ్బ.!
సినిమా కొత్త పుంతలు తొక్కుతోంది. తెలుగు సినిమా ఖ్యాతి దేశం దాడి, ప్రపంచ వ్యాపితమవుతోంది. సో, సినిమాల బడ్జెట్ కూడా పెరుగుతోంది. సినిమా టిక్కెట్ల ధరలూ కొంత మేర పెరగడం తప్పు కాదు.!
కానీ, దోపిడీ.. సినిమా అంటేనే దోపిడీ.. అనే స్థాయికి, ప్రేక్షకుల్ని వంచించడం ఎప్పుడైతే సినీ జనాలు మొదలెట్టారో, ప్రేక్షక దేవుడు కన్నెర్రజేయడం మొదలు పెట్టాడు.
ఫలితం, తెలుగు సినీ పరిశ్రమలో షూటింగుల బంద్.! దోపిడీ ఆగకపోతే, మొత్తంగా తెలుగు సినిమా బంద్ అయిపోయే అవకాశాల్లేకపోలేదన్న చర్చ సర్వత్రా నడుస్తోంది.
మంచి సినిమాల్ని ఆశీర్వదిస్తారు కూడా.!
నందమూరి కళ్యాణ్ రామ్ నుంచి ‘బింబిసార’ సినిమా వచ్చింది. విజయాన్ని అందుకుంది. ఇంకో సినిమా ‘సీతారామం’ గురించి అయితే, సగటు సినీ అభిమాని చాలా చాలా ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నాడు.
‘సీతారామం’ సినిమా ఓ దృశ్య కావ్యం. నేల విడిచి సాము చేయలేదు అందులో. ఇది కదా సగటు సినీ ప్రేక్షకుడికి కావాల్సింది. అందమైన కథ, అంతకన్నా అందమైన ట్రీట్మెంట్.. ఇవి ఓ సినిమాకి కావాల్సింది.
స్టార్డమ్ కూడా వుండాలి.. ఎలివేషన్లు కూడా వుండాలి.. మాస్ మసాలా అంశాలు, కమర్షియల్ ఎలిమెంట్స్ వుంటే, అవి సినిమాకి అదనపు హంగులవుతాయి. కానీ, అసలు కథే లేకపోతే.?
ప్రేక్షక దేవుడు కన్నెర్రజేస్తాడు.. శపిస్తాడు.!
దేవుడి ముందు కుప్పి గంతులేమవుతుంది.? తోక కత్తిరింపుకు గురవుతుంది. తెలుగు సినీ పరిశ్రమ తెలుసుకోవాల్సిందిదే.
Also Read: ‘లిమిట్స్’ తెలుసు.! ఆ లెక్కలూ తెలుసు: రష్మిక.!
ప్రేక్షకుడ్ని అలరింపజేయండి.. కాసిని డబ్బులు సంపాదించుకోండి. అంతేగానీ, దోచస్తామేంటి ఎలా.? ఇప్పటికైనా తెలుగు సినీ పరిశ్రమ మారాలనీ, మారుతుందనీ ఆశిద్దాం.