Table of Contents
TANA Fight In USA మనోళ్ళే.. అమెరికా వెళ్ళి అక్కడ సెటిలయ్యారు.! ఉద్యోగాలు చేస్తున్నారు కొందరు.. వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు ఇంకొందరు.!
ఉన్నత విద్య కోసం వెళ్ళినవారూ వున్నారు.! ఏమయ్యిందోగానీ, తన్నుకు చచ్చారు.! చచ్చారంటే, చచ్చిపోయారని కాదు.. అలా తగలడడ్డారు.!
‘తానా’ పేరుతో నిర్వహించిన ఈవెంట్ రసాబాసగా మారింది. రాజకీయ నినాదాలతో తన్నుకున్నారన్నది ప్రాథమికంగా వెల్లడైన అంశం.
అమ్మోరికా.!
అమెరికా అంటే అమ్మోరికా.. అనేట్టు తయారైంది.. అందరి విషయంలోనూ కాదు, కొందరి విషయంలో మాత్రమే.!
నిజమే, అమెరికాలో మనోళ్ళ పరువు ప్రతిష్టల్ని దిగజార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టున్నారు కొందరు. లేకపోతే, తానా సభల సందర్భంగా ఈ గొడవలేంటి.?
ఎవరు గొడవ రాజేశారు.? అన్నదానిపై తర్వాత చర్చిద్దాం.! ముందైతే, తన్నుకోవడం వల్ల జరిగిన నష్టం గురించి మాట్లాడుకోవాలి.
చిన్నదో పెద్దదో.. అమెరికాలో తెలుగోళ్ళ గొడవ అంటే.. తెలుగునాట పొలిటికల్ మీడియాకి పండగ.! రాజకీయ పార్టీల సంగతి సరే సరి.!
అక్కడేం గొడవ జరిగిందన్నది ఇక్కడ అనవసరం. అత్యంత జుగుప్సాకరమైన యాగీ అయితే, రాజకీయ అలాగే మీడియా వర్గాల్లో చోటు చేసుకుంటోంది.
తెలుగు జాతికి వేరే శతృవులు అక్కర్లేదు. తెలుగు మీడియా, తెలుగు రాజకీయ పార్టీలు చాలు.! కుల సంఘాలు వాటికి అదనం.!
Mudra369
ఔను, ‘తెలుగులోళ్ళు.. అందునా, ఆంధ్రోళ్ళు ఎక్కడున్నా ఈ కులాల పంచాయితీ.. రాజకీయ పంచాయితీ తప్పదు..’ అన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
ఇంతకన్నా దారుణమైన విషయం ఇంకేముంటుంది.? అమెరికా వెళ్ళింది కొట్టుకు ఛావడానికా.? ఉద్యోగ, ఉపాధి రంగాల్లో ఎదగడానికా.?
జూనియర్ ఎన్టీయార్.. నారా లోకేష్.. వైఎస్ జగన్.!
గొడవ ఎలా జరిగిందన్నదానిపై భిన్న వాదనలున్నాయి. జూనియర్ ఎన్టీయార్ – నారా లోకేష్ వర్గాల మధ్య గొడవ మొదలైందన్నది ఓ వాదన.
సాధారణంగా ఇలాంటి ఈవెంట్లకీ.. అందులోని గొడవలకీ చాలామంది తెలుగు ఎన్నారైలు దూరంగా వుంటారు. హాజరైన వాళ్ళలోనూ చాలామంది హుందాగానే వ్యవహరిస్తారు.
కొందరు మాత్రం, కేవలం గొడవల కోసమే వస్తారు.! నానా యాగీ చేస్తారు. అంతిమంగా అక్కడి తెలుగు అసోసియేషన్ల పరువు ప్రతిష్టల్ని మంటగలిపేస్తారు.
గొడవలు చేయడానికి వస్తారని తెలిసీ, అలాంటోళ్ళను అక్కడకు రానీయకుండా చేయడంలో ఎందుకు నిర్వాహకులు విఫలమవుతున్నట్టు.?
అగ్ర రాజ్యం అమెరికా.. అంటే, అదో కలల ప్రపంచం నేటి యువతకి.! ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు, అమెరికా అంటేనే అసహ్యం పెరిగిపోతుంటుంది.!
Mudra369
కాదు కాదు, ఆ గొడవకు కారణం వైఎస్ జగన్ అభిమానులన్నది ఇంకో వాదన. ఏది నిజం.? అంటే, కొందరు వ్యక్తులు సృష్టించిన గొడవ.. కులాల మధ్య, రాజకీయ పార్టీల మధ్య రచ్చలా మారిందనేది మాత్రం నిర్వివాదాంశం.
ఈ మాత్రం దానికి అమెరికా వరకూ ఎందుకు వెళ్ళడం.? ఇక్కడే.. తెలుగు నేల మీదనే వుండి కొట్టుకు ఛావొచ్చు కదా.! ఈ ప్రశ్న సహజంగానే చాలామందిలో మెదులుతుంటుంది.

బాధ్యతారాహిత్యం.. అల్లరి వెధవల చిల్లరతనం.! అంతకు మించి ఏం చెప్పగలం ఇలాంటి సంఘటనల గురించి.! అని తాజా ఘటనలపై ఓ ఎన్నారై తన ఆవేదనను వెల్లగక్కారు.
TANA Fight In USA.. దేశం పరువు పోతోంది మహాప్రభో.!
విషయం ముదిరి పాకాన పడితే, అమెరికా చట్టాలు మామూలుగా వుండవ్. అందర్నీ అరెస్టు చేసి లోపలేస్తారు. అప్పుడు, అంతర్జాతీయ సమాజం ముందు మరింతగా మన పరువు బజార్న పడేదే.
ఆంధ్రా పరువు మాత్రమే కాదు, భారతదేశం పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లేది. చదువుకోవడానికి వెళితే.. చదువుకోండి. ఉద్యోగ ఉపాధి నిమిత్తం వెళితే, ఆ పనులు చక్కబెట్టుకోండి.
Also Read: నిహారిక విడాకులు.! అసలేం జరిగింది
రాజకీయ పార్టీలపై అభిమానం వుండడం తప్పు కాదు. సినిమా నటులపై అభిమానమూ తప్పు కాదు.! ఆ అభిమానం ముసుగులో ఇలా కొట్లాటలకు దిగడం ముమ్మాటికీ తప్పే.

పైగా, తిండి సరిగ్గా అందలేదనీ కొట్టుకున్నారట. ఇంతకన్నా దారుణమైన విషయం ఇంకేమైనా వుంటుందా.? ఇది పూర్తిగా నిర్వాహకుల చేతకానితనం.
‘తానా’ అంటే, కొట్లాటలేనా.? కుల జాడ్యమేనా.? అన్న స్థాయికి పరిస్థితి దిగజారిపోయింది.
– yeSBee