Table of Contents
విజయదశమి సందర్భంగా రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్తున్నాయి. ఒకటి డైరెక్ట్ తెలుగు సినిమా ‘హలో గురూ ప్రేమకోసమే’ (Hello Guru Prema Kosame) కాగా, ఇంకోటి తమిళ సినిమాకి తెలుగు అనువాదం ‘పందెం కోడి-2’ (Pandem Kodi 2). పేరుకే తమిళ సినిమా అయినా ‘పందెం కోడి -2’ హీరో మన తెలుగోడే. విశాల్ (Vishal K Reddy) హీరోగా, కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్గా తెరకెక్కిన ఈ సినిమాపై తమిళనాట భారీ అంచనాలున్నాయి. స్ట్రెయిట్ తెలుగు సినిమా ‘హలో గురూ ప్రేమకోసమే’ విషయానికొస్తే, యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ (Ram Pothineni) నటించిన సినిమా ఇది. ఇందులో రామ్ సరసన ఇద్దరు ముద్దుగుమ్మలు సందడి చేస్తున్నారు. ఒకరేమో మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameshwaran) కాగా, ఇంకొకరు కన్నడ బ్యూటీ ప్రణీత సుభాష్ (Pranitha Subhash).
కూల్ అండ్ ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ గురూ!
యంగ్ హీరో రామ్ దసరా రేసులోకి ‘హలో గురూ ప్రేమ కోసమే’ అంటూ దూసుకొచ్చాడు. భారీ అంచనాలు కాకపోయినా, ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. దానికి కారణం సినిమా ప్రోమోస్ కూల్ ఎమోషనల్ అండ్ ఎంటర్టైనింగ్గా ఉండడం. అనుపమా పరమేశ్వరన్ రెండోసారి రామ్‌తో జత కట్టింది. కన్నడ భామ ప్రణీత కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ తెలుగు సినిమాలో కన్పించబోతోంది. ఈసారి ఖచ్చితంగా హిట్ కొడ్తాననే ధీమాతో వుంది ప్రణీత. ప్రకాష్ రాజ్, పోసాని కృష్ణ మురళి ఇలా ఈ సినిమాలో స్టార్ కాస్టింగ్ కూడా సినిమాపై పోజిటివ్ వైబ్స్‌కి కారణమైంది. టీజర్, ట్రైలర్ ఆల్రెడీ సినిమాపై అంచనాల్ని పెంచేశాయి.
రామ్ డాన్సులు.. అనుపమ, ఫ్రణీత అందాలు.!
‘హలో గురూ ప్రేమకోసమే’ సినిమాకి రామ్ ఎనర్జీనే మెయిన్ హైలైట్. ఈ సినిమాతో సరికొత్త డాన్సుల్ని తెలుగు తెరకు పరిచయం చేయబోతున్నానంటున్నాడు రామ్. అంత కాన్ఫిడెంట్‌గా ఈ డాన్సింగ్ సెన్సేషన్ చెప్పాడంటే.. ‘విషయం’ ఏ రేంజ్లో వుంటుందో అర్థం చేసుకోవచ్చు. అన్నట్టు, రామ్‌తో పోటీ పడి మరీ అనుపమ ఈ సినిమా కోసం డాన్సులేసిందట. ప్రోమోస్‌లో రామ్, అనుపమ డాన్సులు చూస్తే విజిల్స్ వేయకుండా వుండలేరెవరూ. రామ్, ప్రణీతల సంగతి పక్కన పెడితే ఈ సినిమాలో ఇంట్రెస్టింగ్ రోల్ చేస్తున్నాననీ, తన పాత్ర చాలా కొత్తగా వుంటుందని అంటోంది ప్రణీత.
బాక్సాఫీస్ వసూళ్ళ దుమ్ము రేపేయనున్న ‘కోడి’
విశాల్ సినిమాలకి తమిళనాడులో భారీ క్రేజ్ వుంటుంది. తెలుగులోనూ అదే స్థాయిలో ఈ సినిమాపై అంచనాలున్నాయనేది అందరికీ తెల్సిన సంగతే. విశాల్ ఈ ఏడాది ఇప్పటికే ‘డిటెక్టివ్’ సినిమాతో తమిళ,తెలుగు ప్రేక్షకుల్ని పలకరించాడు.. మంచి విజయాన్ని అందుకున్నాడు. ‘పందెం కోడి’ పేరుతో గతంలో విశాల్ చేసిన సినిమా సూపర్ హిట్. దానికి సీక్వెల్‌గా వస్తోంది ‘పందెం కోడి-2’. పక్కా మాస్ ఎంటర్టైనర్ కావడంతో ఈ దసరా సీజన్లో తెలుగు బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ పంట పండిస్తుందని ‘పందెం కోడి’ గురించి టాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లోనూ ఇంట్రెస్టింగ్ టాక్ నడుస్తోంది.
విశాల్ ఫైట్లు.. కీర్తి సురేష్ అల్లరి
కీర్తి సురేష్ అనగానే, కాస్తంత కామ్‌గా వుండే పక్కింటి అమ్మాయి గుర్తుకొస్తుంది. తెలుగులో ఆమె చేసిన తొలి సినిమా ‘నేను శైలజ’ పెద్ద హిట్. ఆ తర్వాత ఆమె చేసిన మరో ‘నేను లోకల్’ కూడా హిట్టే. ‘మహానటి’ సినిమా సంగతి సరే సరి. నటిగా కీర్తి సురేష్ రేంజ్‌ని పెంచేసింది ‘మహానటి’. అయితే, విక్రమ్‌తో చేసిన ‘సామి2’ కీర్తి సురేష్‌కి పెద్ద ఫ్లాప్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో కీర్తి సురేష్‌కి ‘పందెం కోడి’ వెరీ వెరీ స్పెషల్ అని చెప్పక తప్పదు. విశాల్ విషయానికి వస్తే, ప్రోమోస్‌లో పక్కా మాస్‌గా కన్పిస్తున్నా.. కొన్ని స్టిల్స్‌లో స్టైలిష్‌గా, క్లాస్‌గా కనిపిస్తున్నాడు. యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాకి హైలైట్ కానున్నాయి. తన సహజ ధోరణికి భిన్నంగా ఈ సినిమాలో కీర్తి సురేష్ ‘అల్లరి అమ్మాయి’లా కన్పించబోతోందట.
కోడి వర్సెస్ గురూ.. ఇంట్రెస్టింగ్ ఫైట్
పండగ సీజన్ కావడంతో.. ఎన్ని సినిమాలైనా సరిపోవు ఆడియన్స్‌కి. సో, ‘పందెం కోడి’ మాస్ ఆడియన్స్‌ని, ‘హలో గురూ ప్రేమకోసమే’ క్లాస్ ఆడియన్స్‌ని మెప్పించడానికి ఛాన్స్ వుంది. ఆల్రెడీ థియేటర్లలో ‘అరవింద సమేత’ హల్చల్ చేస్తోంది. ‘దేవదాస్’ కూడా సరికొత్తగా ప్రమోషన్స్ చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ విజయదశమికి తెలుగు సినిమా బాక్సాఫీస్ వద్ద ఇంట్రెస్టింగ్ ఫైట్ జరగబోతోంది. ఈ ఫైట్‌లో అన్ని సినిమాలకీ వసూళ్ళ పంట పండాలని ఆశిద్దాం.