Table of Contents
‘జగన్నాటకం’ (Jagannatakam) హ్యాష్‌ట్యాగ్‌తో టీడీపీ నేత, మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) చేసిన ట్విట్టర్ పోస్టింగ్ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలకు కారణమయ్యింది. నిన్న, విశాఖపట్నం విమానాశ్రయంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ (YS Jaganmohan Reddy) మీద హత్యాయత్నం జరిగిన విషయం విదితమే. తృటిలో వైఎస్ జగన్ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.
కత్తితో నిందితుడు తన మెడ మీద దాడికి యత్నించాడనీ, తాను తప్పించుకోవడంతో ఆ కత్తి భుజమ్మీద గుచ్చుకుందనీ ఈ రోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన అనంతరం వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. జగన్ వద్ద స్టేట్‌మెంట్ తీసుకునేందుకు ఏపీ పోలీసులు, ఆసుపత్రికి వెళ్ళగా.. ఏపీ పోలీసుల మీద తనకు నమ్మకం లేదని వైఎస్ జగన్ చెప్పారట. మరోపక్క, నారా లోకేష్ – జగన్ మీద జరిగిన హత్యాయత్నాన్ని ‘జగన్నాటకం’ అంటూ సోషల్ మీడియాలో పేర్కొన్నానడం పట్ల అంతటి విస్మయం వ్యక్తమవుతోంది.
కలకలం రేపుతున్న లోకేష్ ట్వీట్
‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) కోడి కత్తి డ్రామా.. అధికారం కోసం అడ్డదారులు తొక్కడం జగన్ మోదీ రెడ్డికి కొత్త కాదు. మరోసారి ఓటమి తప్పదు అనే భయంతోనే కోడి కత్తి డ్రామాకి తెరలేపారు. దాడి వెనుక వున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కుట్ర ఏంటో అందరికీ తెలుసు. ప్రజల్ని మభ్యపెట్టడానికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మొసలి కన్నీరు కార్చుతున్నారు..’ అంటూ ట్విట్టర్‌లో లోకేష్ (Lokesh) పేర్కొన్నారు. సాధారణ టీడీపీ నేతల నుంచి ఇలాంటి ఆరోపణలు వస్తే, అది రాజకీయమేనని సరిపెట్టుకోవచ్చుగానీ, సాక్షాత్తూ మంత్రి అయి వుండీ లోకేష్ ఇంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడమేంటని పలువురు రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు.
జగన్‌ని విమర్శించే స్థాయి లోకేష్‌కి లేదా?
వైఎస్ జగన్‌ని (YS Jagan) విమర్శించే స్థాయి నారా లోకేష్‌కి లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ‘తండ్రి చితికి నిప్పు పెట్టకముందే ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసిన వ్యక్తి ఇలాంటి కత్తి నాటకాలు ఆడటంలో ఆశ్చర్యం లేదు..’ అని లోకేష్ ట్వీట్ చేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, జగన్ కోరుకుంటే ముఖ్యమంత్రి పదవి ఆయనకు ఎప్పుడో వచ్చి వుండేదని అంటున్నారు. వైఎస్ మరణానంతరం కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలంతా జగన్‌ని (Jagan) ముఖ్యమంత్రి అవ్వాలని కోరినా, జగన్ సున్నితంగా తిరస్కరించారని వారు గుర్తుచేస్తున్నారు.
అయినా, ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డదారిలో మంత్రి అయిన లోకేష్, భారీ మెజార్టీతో లోక్‌సభకు, అసెంబ్లీకి ఎన్నికై, ప్రతిపక్ష నేతగా పనిచేస్తున్న జగన్‌ని విమర్శించడమేంటన్నది వారి వాదన. జగన్‌పై హత్యాయత్నం కుట్ర వెనుక టీడీపీ (TDP) హస్తం వుందని వైఎస్సార్సీపీ ఆరోపిస్తోంది. ప్రజాస్వామ్యవాదులంతా జగన్‌పై దాడిని ఖండిస్తున్నారనీ, టీడీపీ మాత్రం రాజకీయాలు చేస్తోందని వైసీపీ అంటోంది.
ఆసుపత్రి నుంచి వైఎస్ జగన్ డిశ్చార్జ్
నిన్న తనపై హత్యాయత్నం (Murder Attempt on YS Jaganmohan Reddy) జరిగిన తర్వాత, విశాఖపట్నం విమానాశ్రయంలోనే ప్రాథమిక వైద్య చికిత్స తీసుకున్న వైఎస్ జగన్ (YS Jagan), అక్కడినుంచి హైద్రాబాద్‌కి చేరుకుని, ఆ తర్వాత ఆసుపత్రికి వెళ్ళారు. అక్కడ ఆయనకు సర్జరీ నిర్వహించారు వైద్యులు. ఈ రోజు ఉదయమే వైఎస్ జగన్‌ని వైద్యులు డిశ్చార్జి (Discharge) చేశారు. తొమ్మిది కుట్లు పడ్డాయనీ, కొంత విశ్రాంతి ఆయనకు అవసరమని వైద్యులు చెప్పారు.
అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్ ఈ రోజు కోర్టు యెదుట హాజరు కావాల్సి వుండగా, ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ హాజరు కాలేరంటూ కోర్టుకు జగన్ తరఫు న్యాయవాదులు తెలిపారు. న్యాయస్థానం, జగన్‌కి ఈ రోజు కోర్టుకు హాజరు కాకుండా వెసులుబాటు కల్పించింది. మరోపక్క, జగన్ కాస్త కోలుకుంటే పాదయాత్ర తిరిగి కొనసాగిస్తారనీ, పాదయాత్ర చేయకుండా ఆయన్ని తాము సైతం ఆపలేమని వైఎస్సార్సీపీ ముఖ్య నేత వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.