Table of Contents
మాస్ మహరాజ్ రవితేజ (Mass Maharaj Raviteja) హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ని విడుదల చేసింది చిత్ర నిర్మాణ సంస్థ మైవ్రీ మూవీ మేకర్స్. టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers), ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్ల (Srinu Vytla) దర్శకత్వంలో రవితేజ (Raviteja) హీరోగా రూపొందిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే వున్నాయి.
టీజర్‌తోనే సినిమా కథేంటన్నదానిపై దాదాపుగా ఓ క్లారిటీ ఇచ్చేశారు. ఇదొక థ్రిల్లర్ సినిమా అనే బిల్డప్ కన్పించింది. రవితేజ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేస్తోన్న సినిమా ‘అమర్ అక్బర్ ఆంటోనీ’. అయితే, ముగ్గురూ వేర్వేరా.? ఒక్కడే, ముగ్గురిలా కన్పించబోతున్నాడా.? అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. చాలాకాలం తర్వాత తెలుగు తెరపై కన్పించబోతోంది ‘బెల్లీ బ్యూటీ’ ఇలియానా. రవితేజతో ఇలియానా ఇప్పటికే మూడు సినిమాల్లో నటించిన విషయం విదితమే.
శ్రీనువైట్ల కొంచెం కొత్తగా
మామూలుగా అయితే శ్రీను వైట్ల సినిమాల్లో కొత్తదనం గురించి ఆశించలేం. సక్సెస్‌ల మీద సక్సెస్‌లు కొట్టినా శ్రీను వైట్ల దాదాపుగా ఒకే ఫార్ములాతో సినిమాలు తీశాడు. అలా హిట్టు మీద హిట్టు కొడుతూ, టాలీవుడ్‌లో టాప్ డైరెక్టర్‌గా ఎదిగాడు శ్రీను వైట్ల. అయితే అనూహ్యంగా శ్రీను వైట్ల కెరీర్ గాడి తప్పింది. వరుస పరాజయాలతో డీలా పడ్డాడు. ఈ నేపథ్యంలో రూటు మార్చినట్టున్నాడు.
‘అమర్ అక్బర్ ఆంటోనీ’ టీజర్‌ని చూస్తే, ఇది శ్రీను వైట్ల సినిమా కాదేమో.. అన్న సందేహాల్ని రేకెత్తించడం ఖాయం. అంత కొత్తగా సినిమాని శ్రీను వైట్ల తెరకెక్కించాడన్పిస్తోంది. ఆ కొత్తదనం టీజర్‌తోనే ఇంతలా చూపించిన శ్రీను వైట్ల, సినిమాలో ఇంకెంత కొత్తదనం చూపిస్తాడో ఏమో. శ్రీను వైట్ల – రవితేజ కాంబినేషన్‌లోనూ గతంలో పలు సినిమాలొచ్చిన విషయం విదితమే. ఆ సంగతి పక్కన పెడితే ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమా టీజర్‌ని చూస్తే, శ్రీను వైట్ల ఈ సినిమాతో బిగ్ హిట్ కొట్టబోతున్నాడనే నమ్మకం ఖచ్చితంగా కలుగుతుంది.
ఇల్లీ బేబ్ మళ్ళీ వచ్చిందోచ్
ఎన్నాళ్ళకెన్నాళ్ళకు.? తెలుగు సినిమాపై శీతకన్నేసిన ఇలియానా (Ileana D Cruz), చాలా కాలం తర్వాత మళ్ళీ తెలుగు ప్రేక్షకుల్ని స్ట్రెయిట్ తెలుగు సినిమాతో పలకరించబోతోంది. ‘దేవదాసు’తో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన ఇలియానా, ఓ దశలో టాలీవుడ్‌లో అగ్రహీరోయిన్‌గా చెలామణీ అయిన సంగతి తెల్సిందే. రవితేజతో ‘ఖతర్నాక్’, ‘కిక్’ (Kick), ‘దేవుడు చేసిన మనుషులు’ సినిమాల్లో నటించి మెప్పించింది ఇలియానా.
టాలీవుడ్‌లో టాప్ టెన్ చిత్రాల్లో ఒకటిగా చెప్పుకునే ‘పోకిరి’ (Mahesh Babu Pokiri) సినిమాలో మహేష్ సరసన హీరోయిన్‌గా నటించింది ఇలియానా. ‘జల్సా’ (Pawan Jalsa), ‘జులాయి’ (Allu Arjun Julayi) సహా పలు హిట్ సినిమాలతో ఇలియానా, తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. కానీ, బాలీవుడ్‌కి వెళ్ళాక ఎందుకో సౌత్ సినిమాని లైట్ తీసుకున్న ఇలియానా, మళ్ళీ ఇన్నాళ్ళకు తెలుగులో నటించనుండడం విశేషం కాకుండా ఎలా ఉంటుంది? అన్ని సినిమాల్లోనూ బక్కగా కన్పించే ఇలియానా ‘కిక్’ సినిమా కోసం కాస్త ఒళ్ళు చేసింది. మళ్ళీ ఇప్పుడీ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాలోనూ బొద్దుగా కన్పిస్తుండడం మరో విశేషంగా చెప్పుకోవాల్సి వుంటుంది.
మాస్ మహరాజ్.. ఆ కిక్కే వేరు
మాస్ మహరాజ్ రవితేజ, కొన్ని పరాజయాల తర్వాత ‘రాజా ది గ్రేట్’ అంటూ డిఫరెంట్ మూవీ చేశాడు. అందులో అంధుడిగా నటించి మెప్పించిన రవితేజ, ఈసారి ఇంకో ప్రయోగాత్మక సినిమా చేస్తున్నట్లే కన్పిస్తోంది. రవితేజ స్టయిలింగ్ దగ్గర్నుంచి, బాడీ లాంగ్వేజ్ వరకూ అంతా కొత్తగా కన్పిస్తున్నాయి. కథేంటన్నదానిపై పూర్తి స్పష్టత రాలేదుగానీ, దీన్నొక థ్రిల్లర్ మూవీగా భావించొచ్చేమో. అలాగే, మాస్ మహరాజ్ సినిమాలో ఏమేం వుండాలో అన్నీ ఈ సినిమాలో వుంటాయట. అంటే, ఫుల్ ఫ్లెడ్జ్‌డ్ కామెడీతో కూడిన యాక్షన్ ఎంటర్‌టైనర్‌లా అన్నమాట.
టీజర్ కెవ్వు కేక
‘ముగింపు రాసుకున్న తర్వాతే కథ మొదలు పెట్టాలి..’ అంటూ టీజర్ (Amar Akbar Anthony Teaser) స్టార్ట్ అవుతుంది. ‘మనకు నిజమైన ఆపద వచ్చినప్పుడు మనల్ని కాపాడేది మన చుట్టూ వున్న బలగం కాదు, మనలో వున్న బలం’ అని రవితేజ చెప్పే డైలాగ్ అదిరిపోయిందంతే. మరోపక్క ‘వాడు ఎక్కడుంటాడో, ఎలా వస్తాడో ఎవరికీ తెలియదు’ అని విలన్ చెప్పే డైలాగ్ ఓ ఎత్తు అయితే, చివర్లో ‘రిలాక్స్’ అంటూ రవితేజ చెప్పడం మరో హైలైట్. సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, యాక్షన్ ఎపిసోడ్స్.. అన్నిటికీ మించి మాస్ మహరాజ్ ఎనర్జీ ఈ టీజర్‌కి మేజర్ హైలైట్స్‌గా చెప్పుకోవచ్చు. నవంబర్ 16న ఈ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ (Amar Akbar Antony) విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.