Table of Contents
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jaganmohan Reddy), తనపై విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం ఘటనకు సంబంధించి హైకోర్టును ఆశ్రయించడం సంచలనంగా మారింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ జరుగుతుండగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh) , ఆంధ్రప్రదేశ్ పోలీసులు (Andhra Pradesh Police) చేసే విచారణ పట్ల తనకు నమ్మకం లేదని పేర్కొంటూ, స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాల్సిందిగా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan). అయితే, ఈ కేసులో ఇంతవరకు వైఎస్ జగన్, ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ‘వాంగ్మూలం’ ఇవ్వకపోవడంతో, ఇప్పుడీ అంశం రాజకీయంగా చర్చనీయాంశమయ్యింది.
అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.!
దాడి జరిగిన మరుసటి రోజే వైఎస్ జగన్ వద్దకు ఏపీ పోలీసులు వెళ్ళారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (Jagan) వాంగ్మూలం తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా, ఆయన అందుకు నిరాకరించారు. కానీ, వైసీపీ నేతలు ‘అలాంటిదేమీ లేదు.. ఏపీ పోలీసులపై నమ్మకం లేదని జగన్ ఎప్పుడూ చెప్పలేదు. మేమూ ఆ మాట చెప్పడంలేదు. జగన్‌పై హత్యాయత్నం జరిగిన తర్వాత ముఖ్యమంత్రి (Nara Chandrababu Naidu), డీజీపీ (AP DGP) చేసిన నిర్లక్ష్య పూరిత వ్యాఖ్యలపైనే మా అభ్యంతరం..’ అని చెప్పిన సంగతి తెల్సిందే. కానీ, ఇప్పుడు సాక్షాత్తూ జగన్, హైకోర్టుకి ‘ఏపీ పోలీసులు జరిపే విచారణపై నమ్మకం లేదు’ అని తేల్చేయడం గమనార్హం.
జగన్ ఇంకా ఏం చెప్పారంటే..
ఆ రోజు విమానాశ్రయంలో వున్న తనపై, సెల్ఫీ కోసం అని వచ్చిన ఓ యువకుడు తన మీద హత్యాయత్నానికి (Murder Attempt On YS Jagan) పాల్పడ్డాడనీ, తప్పించుకునే ప్రయత్నంలో తన భుజానికి గాయమయ్యిందనీ, ప్రాథమిక చికిత్స అనంతరం విశాఖ నుంచి హైద్రాబాద్ చేరుకోవడం జరిగిందనీ, హైద్రాబాద్‌లోని ఆసుపత్రిలో తనకు పూర్తిస్థాయి వైద్య చికిత్స అందిందని వైఎస్ జగన్, హైకోర్టుకు విన్నవించారు. ఆ సమయంలో తాను కిందికి వంగకపోయి వుంటే, కత్తి మెడమీద గుచ్చుకుని, జరగరానిది జరిగి వుండేదని జగన్ పేర్కొన్నారు.
తనకు దక్కుతున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకనే..
ప్రజా సంకల్ప యాత్రలో (Praja Sankalpa Yatra) భాగంగా తాను ప్రజల వద్దకు వెళుతున్నాననీ, ఈ క్రమంలో అధికార పార్టీ అక్రమాల్ని ఎండగడుతున్న తనకు వ్యతిరేకంగా ఆపరేషన్ గరుడ పేరుతో కొత్త నాటకాన్ని తెరపైకి తెచ్చారంటూ జగన్, హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో ప్రస్తావించారు. టీడీపీ సానుభూతిపరుడైన సినీ నటుడు శివాజీనే (Actor Sivaji) ఆపరేషన్ గరుడ పాత్రధారి అని కూడా జగన్ పేర్కొనడం గమనించాల్సిన విషయం. తాజా పరిణామాల్ని బట్టి ఇదొక భారీ కుట్ర అనీ, ప్రతిపక్ష నేతను హత్య చేయించడం, ఆ తర్వాత దాన్ని ఆపరేషన్ గరుడలో భాగమని అందర్నీ నమ్మించే ప్రయత్నం చేసేలా వున్నారని జగన్ అనుమానం వ్యక్తం చేశారు.
జగన్ వాంగ్మూలం కోసం మరో ప్రయత్నం
జగన్, హైకోర్టులో పిటిషన్ వేయడం సంగతి పక్కన పెడితే, ఇప్పటికే జగన్‌పై హత్యాయత్నం కేసును విచారిస్తున్న పోలీసులు మరోమారు, జగన్ వద్ద వాంగ్మూలం తీసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. జగన్ ఆ ఘటన జరిగిన రోజు ధరించిన షర్ట్‌తోపాటు, నిందితుడి దస్తూరీని న్యాయస్థానం సమక్షంలో పొందేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఏపీ పోలీసులపై నమ్మకం లేదన్న జగన్, వారికి సహకరిస్తారా? లేదా? అన్నది అనుమానాస్పదమే.
ఏదిఏమైనా, ఏపీ పోలీసులపై నమ్మకం లేదని హైకోర్టుకు జగన్ విన్నవించడం రాజకీయంగా వ్యూహాత్మక తప్పిదంగా భావించాలని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. గత కొన్ని నెలలుగా ఆయన ప్రజా సంకల్ప యాత్ర నిర్వహిస్తోంటే.. ఆయనకు పూర్తి స్థాయిలో భద్రత కల్పిస్తున్నది ఏపీ పోలీసులే. ఈ విషయంలో జగన్, అధికార పార్టీకి చాలా తేలిగ్గా టార్గెట్ కాబోతున్నారని నిస్సందేహంగా చెప్పవచ్చు.