Table of Contents
Mohanbabu Vishnu Manoj Fight.. మనిషివా.? మోహన్‌బాబువా.? అంటూ ఓ ఎర్నలిస్ట్, సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించేశాడు. ఇంతకీ, ఎర్నలిస్టు ఎవరు.? అదేనండీ, ఒకప్పుడు జర్నలిస్ట్.. అనేవాళ్ళం కదా.!
ఈ రోజుల్లో జర్నలిజం ఎక్కడుంది.? వున్నదంతా ఎర్నలిజం మాత్రమే.! పాత్రికేయం ముసుగులో నడుస్తున్నదంతా పాత్రికేయ వ్యభిచారమే.
అక్కడికేదో, సినీ నటుడు మోహన్‌బాబుని వెనకేసుకురావడం కాదిక్కడ.! మోహన్‌బాబు అంటే ముక్కోపి, మోహన్‌బాబు అంటే మూర్ఖుడు, మోహన్‌బాబు అంటే ఇంకోటేదో.! ఇది అందరికీ తెలిసిన విషయమే.
అన్నీ తెలిసీ, మీడియా ఎందుకు మోహన్‌బాబు ఇంట్లో గలాటా జరుగుతోంటే, కెమెరాలు వెంటేసుకుని వెళ్ళడం.? ఓహో, సెలబ్రిటీ కాబట్టి.. మీడియాకి అత్యుత్సాహం వుండడం సహజమే సుమీ.!
అయినాగానీ, ప్రైవేటు ప్రాపర్టీలోకి జర్నలిస్టులు ఎలా వెళతారు.? నాన్సెన్స్.! బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్.. వీటిల్లో ఏదో ఒకటి అరేంజ్ చేసి, ప్రెస్ మీట్ పేరుతో ‘మేత’కి పిలిస్తేనే వెళ్ళాలి కదా.?
Mohanbabu Vishnu Manoj Fight.. ప్రెస్ మీట్ మోడల్ మర్చిపోకూడదు..
నటుడు, నిర్మాత మోహన్‌బాబు సహా కొందరు సినీ ప్రముఖులు, చాలామంది రాజకీయ నాయకులు సెట్ చేసిన ప్రెస్ మీట్ మోడల్ ఇది. దాన్ని అతిక్రమిస్తే ఎలా.?
సోకాల్డ్ మీడియా కూడా, కొందరి విషయంలోనే అత్యుత్యాహం ప్రదర్శిస్తుంటుంది. మామూలుగా అయితే, మోహన్‌బాబుని టచ్ చేయాలంటే, సోకాల్డ్ మీడియాకి టెర్రర్.
కానీ, ఎందుకో ఈ సారి సోకాల్డ్ మీడియా ఒకింత ధైర్యం ప్రదర్శించింది. ధైర్యమా.? పిచ్చితనమా.? ఏదైతేనేం, మోహన్‌బాబు చేతి దెబ్బ రుచి చూశాడో ఎర్నలిస్టు.. అదేనండీ, జర్నలిస్టు.
జర్నలిస్టుల్లో చాలామందికి మోహన్‌బాబు గురించి తెలుసు. తెలిసీ, ఆ జర్నలిస్టు అలా ఎలా దూసుకెళ్ళినట్టు.? దెబ్బలు తింటే, వచ్చే పబ్లిసిటీయే వేరప్పా.. అనుకున్నాడేమో.!
విలువల్లేవ్.. వంకాయల్లేవ్.. క్రమశిక్షణ లేదు.. కాకరకాయ్ లేదు..
విలువలు, వంకాయలు.. క్రమ శిక్షణ, తొక్క తోటకూర.. ఇలాంటి డైలాగులు చెబుతూ, సెల్ఫ్ డబ్బా కొట్టుకునే మోహన్‌బాబు, తన కొడుకు మనోజ్ మీద చేసిన ఆరోపణలు చూశాక అయినా, మీడియా జాగ్రత్త పడి వుండాలి కదా.?
అక్కడేదో జరిగిపోతోందనీ, దాన్ని ‘కవర్’ చేసేసి, పెపంచకానికి చూపించేద్దామనీ.. ఎగేసుకుంటూ వెళ్ళిన మీడియాకి దెబ్బలు తప్పలేదు.
పైకి కనిపిస్తున్నది మోహన్‌బాబు చేతిలో దెబ్బలు తిన్న జర్నలిస్టు మాత్రమే. కానీ, అక్కడ చాలామంది జర్నలిస్టులు తిన్నారు తన్నులు. వాళ్ళలో చాలామంది పైకి చెప్పుకోవడానికీ, ఇష్టపడటంలేదు.
ఎర్నలిస్టులందరికీ ఓ ప్రశ్న.! మీ ఇంట్లోకి ఎవడన్నా కెమెరా పట్టుకుని, మీడియా.. అని దూసుకొస్తే ఊరుకుంటారా.? మరి, మీరెందుకు దూసుకెళ్తారు.?
మనిషివా.? మోహన్‌బాబువా.?
ఇక, మోహన్‌బాబు విషయానికొస్తే.. ‘నువ్వు మనిషివా.? మోహన్‌బాబువా.?’ అని ఓ జర్నలిస్టు ప్రశ్నించినట్లు.. ఆయనంతే, అదో టైపు.! ఈ మొత్తం వ్యవహారంలో అందరూ లైట్ తీసుకుంటున్న విషయం, మోహన్‌బాబు యూనివర్సిటీ.!
ఈ మోహన్‌బాబు యూనివర్సిటీ గురించే మోహన్‌బాబు, తన కొడుకు మనోజ్ కోసం విడుదల చేసిన ఆడియోలో ఎక్కువగా ప్రస్తావించాడు. అంటే, అందులో లుకలుకలు ఏవో మనోజ్‌కి కనిపించి వుండాలి.
పైగా, విష్ణుకీ – మనోజ్‌కీ మధ్య ఈ యూనివర్సిటీ విషయంలోనే గొడవలు జరుగుతున్నట్లు మోహన్‌బాబు ఆడియో ఆసాంతం పరిశీలిస్తే అర్థమవుతుంది.
నిజంగానే మీడియా అనేది వుంటే, నిఖార్సయిన జర్నలిస్టులు ఎవరైనా వుంటే, ఆ మోహన్‌బాబు యూనివర్సిటీ వ్యవహారాలకు సంబంధించి నిజాలు నిగ్గు తేల్చాలి తప్ప.. ప్రైవేటు వ్యక్తుల ఇళ్ళల్లోకి గోడలు దూకి తన్నులు తినడం వల్ల నో యూజ్.!