Table of Contents
NTR Backstab Politics.. విశ్వ విఖ్యాత నట సార్వ భౌముడు.. అని స్వర్గీయ నందమూరి తారక రామారావు గురించి చెబుతుంటాం. ఓ తరం సినీ ప్రేక్షకులకి రాముడన్నా, కృష్ణుడన్నా ఎన్టీయార్ మాత్రమే.
సినీ రంగంపై స్వర్గీయ ఎన్టీయార్ వేసిన ముద్ర, చాలా చాలా ప్రత్యేకం. తెలుగు రాజకీయాలపై స్వర్గీయ ఎన్టీయార్ చేసిన సంతకం, ఎప్పటికీ చెరిగిపోదు.!
సినీ రంగంలోంచి రాజకీయాల్లోకి వచ్చి, ముఖ్యమంత్రి పీఠమెక్కిన ఒకే ఒక్కడు స్వర్గీయ ఎన్టీయార్. భవిష్యత్‌లో ఇంకో సినీ ప్రముఖుడు, రాజకీయ తెరపై ఆ స్థాయికి తెలుగు నేల నుంచి వెళతారా.?
ఆ సంగతి పక్కన పెడితే, ఎన్టీయార్ సాధించిన విజయాలే కాదు, ఆయన చూసిన ‘పతనాలూ’ వున్నాయి. ఎప్పుడూ నాణేనికి ఓ వైపు మాత్రమే చూపించడం, ఓ వర్గం మీడియాకి అలవాటు.
NTR Backstab Politics.. పెట్టిన పార్టీనే తన్ని తరిమేసింది..
ఏ రాజకీయ పార్టీని అయితే, స్వర్గీయ ఎన్టీయార్ స్థాపించారో, అదే రాజకీయ పార్టీ నుంచి గెంటివేయబడ్డారాయన. చిత్రంగా, అదే రాజకీయ పార్టీ, ఇప్పుడాయన ఫొటో లేకుండా మనుగడ సాధించలేదు.
తెలుగు దేశం పార్టీ గురించే ఇదంతా.. అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
యుగ పురుషుడు, తెలుగు జాతి ఆత్మ గౌరవం.. అని, స్వర్గీయ ఎన్టీయార్ గురించి ఇప్పుడు చెబుతున్నవారు, అప్పట్లో ఆయన మీద వేసిన నిందలు అన్నీ ఇన్నీ కావు.
స్వర్గీయ ఎన్టీయార్ అంటే, ఓ స్ఫూర్తి.. అదే సమయంలో, స్వర్గీయ ఎన్టీయార్ అంటే, ‘ఆయనకు లభించిన ముగింపు’ పగవాడిక్కూడా రాకూడదు.
చివరి రోజుల్లో స్వర్గీయ ఎన్టీయార్ వెంట ఆయన వారసులుగా చెబుతున్నవారెవరూ లేరు.
అలాంటి చావు.. ఇంకెవరికీ రాకూడదు..
ఆయన్నసలెవరూ పట్టించుకోలేదు. ‘ఇలాంటి చావు ఇంకెవరికీ రాకూడదు’ అని ఆయన అభిమానులు కోరుకున్నారు అప్పట్లో.
ప్రతి సంవత్సరం ఎన్టీయార్ జయంతి రోజున, ఎన్టీయార్ గొప్పతనం గురించి చెప్పుకోవడం… అది కూడా, ఎన్టీయార్ పతనానికి కారణమైనవాళ్ళ చెప్పడం అత్యంత అసహ్యకరంగా అనిపిస్తుంటుంది.
మా నాన్న, మా తాత.. అని చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకునే వారసులు, స్వర్గీయ ఎన్టీయార్‌కి చివరి రోజుల్లో జరిగిన ‘ద్రోహం’ గురించి పెదవి విప్పరు.
ఎందుకంటే, ఆ ‘వెన్నుపోటు’లో భాగస్వాములే వీళ్ళంతా. పాపిష్టి కాలం.. పాపిష్టి బంధాలు.! పాపిష్టి రాజకీయాలు.! అసలు వీళ్ళు మనుషులేనా.?
ఎందుకు ‘తాకి పోవాలి’.?
ఓసారి వచ్చి తాకిపో.. అంటాడో మనవడు.! దేనికి.? ఇంకోసారి వెన్నుపోటు పొడవడానికా.? బతికున్నప్పుడు తిండి పెట్టనివాళ్ళు, చనిపోయాక సమాధి దగ్గర, ఏటా మొసలి కన్నీరు కార్చేస్తుంటారు.
మీడియా కెమెరాలను వెంటేసుకుని ఎన్టీయార్ ఘాట్ వద్ద పబ్లిసిటీ నివాళుల కార్యక్రమం.. ప్రతి ఏటా ఓ ప్రసహనం.
ఇక, మీడియా ఏం చెబితే, అదే నిజం.. అన్నట్లు తయారైంది పరిస్థితి. ఓ వర్గం మీడియా, ఎప్పుడూ ఎన్టీయార్ చివరి రోజుల గురించి నిజాలు చెప్పదు. చెప్పదు గాక చెప్పదు.
కానీ, ‘చరిత్ర’ని చెరిపేయాలనుకుంటే, సాధ్యపడే వ్యవహారం కాదు. చెరిపేయాలన్న ప్రయత్నమైతే జరుగుతూనే వుంది.! జరుగుతూనే వుంటుంది కూడా.!