Table of Contents
Nuclear Submarine Decommissioning Process.. భారత నావికాదళం అమ్ములపొదిలోకి అణు ఇంధనంతో పని చేసే సబ్‌మెరైన్లు ఎప్పుడో చేరిపోయాయి.
స్వదేశీ తయారీ అణు జలాంతర్గామి అరిహంత్ గురించి అందరికీ తెలిసిందే. అరిహంత్ క్లాస్ సబ్‌మెరీన్లు ఇప్పుడు మొత్తం మూడున్నాయి భారత నావికాదళంలో.
అంతకన్నా ముందు, భారతదేశం రష్యా తయారీ అణు జలాంతర్గామిని వినియోగించింది.. అదీ లీజుకి తీసుకుని. రష్యా నుంచే మరో అణు జలాంతర్గామిని లీజు ప్రాతిపదికన తీసుకురానున్నారు.
సంప్రదాయ జలంతర్గాములకీ, అణు జలాంతర్గాములకీ చాలా తేడా వుంది. సిబ్బంది ఆహారావసరాల నిమిత్తం మాత్రమే, అణు జలాంతర్గామి నీటిపైకి రావాల్సి వస్తుంది.
ఇంధన పరమైన అవసరాలేమీ వుండవు అణు జలాంతర్గామికి.. దాని జీవిత కాలంలో. కానీ, సంప్రదాయ ఇంధనంతో నడిచే జలాంతర్గాముల వ్యవహారం వేరు.
Nuclear Submarine Decommissioning Process.. జీవిత కాలం ముగిశాక.. ఏం జరుగుతుంది.?
ఇంతకీ, జీవిత కాలం ముగిశాక అణు జలాంతర్గాముల్ని ఏం చేస్తారు.? వాటి డి-కమిషనింగ్ ప్రక్రియ ఎలా వుంటుంది.? ఈ విషయాలపై అందరిలోనూ ఆసక్తి వుండడం సహజమే.
వివరాల్లోకి వెళితే, న్యూక్లియర్ సబ్‌మెరైన్‌ల వినియోగం ముగిసిన తర్వాత వాటిని డీకమిషన్ చేస్తారు. ఇది చాలా సంక్లిష్టమైన అలాగే చాలా ఖర్చుతో కూడుకున్నది.
అదే సమయంలో, చాలా నెమ్మదిగా జరిగే ప్రక్రియ కూడా.. ఈ ప్రక్రియలో వివిధ దశలు ఉంటాయి.
ఆయుధాల్ని తొలగించడం, అణు ఇంధనాన్ని తొలగించడం, రియాక్టర్ కంపార్టుమెంట్ తొలగించడం, మిగిలిన భాగాల్ని రీసైక్లింగ్ చేయడం, వ్యర్థాల నిర్వహణ.. ఆ దశలు.
ప్రతి ‘తొలగింపు’ అత్యంత జాగ్రత్తగా చేయాల్సిందే..
అది సంప్రదాయ జలాంతర్గామి అయినా, న్యూక్లియర్ జలాంతర్గామి అయినా.. మొట్టమొదటగా చేసేది, క్షిపణులు, టార్పెడోలు మరియు ఇతర ఆయుధ వ్యవస్థలను సురక్షితంగా తొలగించడమే.
ఆ తర్వాత అసలు సిసలు పని మొదలవుతుంది. ఇదే అత్యంత కీలకమైనదీ, సంక్లిష్టమైనది. డీకమిషనింగ్ ప్రక్రియలో అత్యంత కీలకమైన భాగంగా దీన్ని చెబుతారు.
అణు జలాంతర్గామిలోని రియాక్టర్‌లో ఉన్న యురేనియం ఇంధనాన్ని అత్యంత జాగ్రత్తగా తొలగించాల్సి వుంటుంది. ఇది అత్యంత రేడియోధార్మికతను కలిగి ఉంటుంది.

అత్యంత జాగ్రత్తగా తొలగించిన ఇంధనాన్ని ప్రత్యేక కంటైనర్లలో భద్రపరచి, అత్యంత సురక్షితమైన అణు వ్యర్థాల నిల్వ కేంద్రాలకు తరలిస్తారు.
కొన్ని సందర్భాల్లో, ఈ ఇంధనాన్ని తిరిగి ప్రాసెస్ చేసి, రీసైకిల్ చేస్తారు కూడా.
అణు ఇంధనాన్ని తొలగించిన తర్వాత కూడా, రియాక్టర్ కంపార్ట్‌మెంట్‌లోని పైప్‌వర్క్ మరియు ఇతర భాగాలలో రేడియోధార్మిక పదార్థాలు పేరుకుపోయి ఉంటాయి.
ఆ భాగాలను జలాంతర్గామి నుండి అత్యంత జాగ్రత్తగా వేరు చేస్తారు. ఇది కూడా సంక్లిష్టమైన పక్రియే. ఇవి తక్కువ స్థాయి రేడియోధార్మిక వ్యర్థాలుగా పరిగణించబడతాయి.
రేడియో ధార్మికత.. అదే అసలు సమస్య..
ఈ భాగాలను కూడా ప్రత్యేకంగా తీర్చిదిద్దబడ్డ నిల్వ ప్రదేశాలలో పాతిపెట్టడం లేదా సురక్షితంగా నిల్వ చేస్తారు.
రేడియోధార్మిక పదార్థాలను జలాంతర్గామి నుంచి పూర్తిగా తొలగించిన తర్వాత, అందులో మిగిలిన భాగాల్ని రీసైకిల్ చేసేందుకు మార్గం సుగమం అవుతుంది.
సుమారు 90 శాతం భాగాలు, ముఖ్యంగా ఉక్కు మరియు ఇతర లోహాలను, రీసైకిల్ చేస్తారు.
జలాంతర్గాములు.. వంటి వాటి కోసం ప్రత్యేకమైన ఉక్కుని, ఇతర లోహాల్ని వినియోగిస్తారు గనుక, రీ-సైక్లింగ్ ప్రక్రియ ద్వారా వీటిని ఇతర ముఖ్యమైన అవసరాలకు వినియోగించుకోవచ్చు.
అణు జలాంతర్గాముల డీకమిషనింగ్ నుండి వచ్చే రేడియోధార్మిక వ్యర్థాలను సురక్షితంగా పారవేయడం నిజానికి చాలా పెద్ద సవాలు.
దీర్ఘకాలికంగా భూమిలో పాతిపెట్టడం లేదా ప్రత్యేకమైన భూగర్భ నిల్వ కేంద్రాలలో భద్రపరచడం వంటి పద్ధతులను ఉపయోగించాల్సి వుంటుంది.
రేడియేషన్ అస్సలేమాత్రం బయటకు రాకుండా, పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.
Nuclear Submarine Decommissioning Process.. భారత దేశం ఏం చేయబోతోంది.?
ఇంతకీ, మన దేశంలో పరిస్థితి ఏంటి.? ఈ ప్రశ్న సహజంగానే తెరపైకొస్తుంది. ఎందుకంటే, మనకున్న డౌటానుమానాలు అన్నీ ఇన్నీ కావు మరి.
భారతదేశంలో ప్రస్తుతం అణు జలాంతర్గామి డీకమిషనింగ్ ప్రక్రియ గురించి తగినంత సమాచారం అందుబాటులో లేదు.
ఐఎన్ఎస్ అరిహంత్ సహా మొత్తం మూడు అణు జలాంతర్గాములున్నాయి ప్రస్తుతం భారత నావికాదళానికి. మరికొన్ని అణు జలాంతర్గాములూ తయారు చేసుకుంటున్నాం.
సమీప భవిష్యత్తులో అణు ఇంధనంతో పని చేసే విమాన వాహక యుద్ధ నౌకనీ మనం తయారు చేసుకోవాల్సి వుంది.
ఇంకో రెండు మూడు దశాబ్దాల తర్వాతే, భారత దేశంలో అణు జలాంతర్గాముల డీ-కమిషనింగ్ జరుగుతుంది. కానీ, ఈలోగా, డీకమిషనింగ్ విధానాలపై ఎలాగూ పూర్తి స్పష్టత వస్తుంది.
ఆ సమయం వచ్చినప్పుడు, అంతర్జాతీయ ప్రమాణాల మరియు స్వదేశీ సాంకేతికతకు అనుగుణంగానే డి-కమిషనింగ్ ప్రక్రియను నిర్వహిస్తారనుకోండి.. అది వేరే చర్చ.
Also Read: ‘లిటిల్ హార్ట్స్’ సమీక్ష: ఈ ‘తేడా’ వ్యవహారాలెందుకు చెప్మా.?
భారతదేశం తన అణుశక్తి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి కృషి చేస్తోంది, దీనిలో డీకమిషనింగ్ మరియు వ్యర్థాల నిర్వహణ కూడా ముఖ్యమైన అంశాలుగా ఉంటాయి. వుండి తీరతాయి కూడా.
ఈ ప్రక్రియ కోసం చాలా సంవత్సరాలు పట్టవచ్చు, ముందే చెప్పుకున్నట్లు అత్యంత భారీ ఖర్చుతో కూడుకున్నది.
అందుకే, అగ్ర దేశాలుగా చెప్పబడుతున్న దేశాలు కూడా డీకమిషన్ చేసిన తమ అణు జలాంతర్గాములను తాత్కాలిక నిల్వలో వుంచుకోవాల్సి వస్తోంది.
మనకి తెలిసి, ఓ విమాన వాహక యుద్ధ నౌకని డీ-కమిషన్ చేసే క్రమంలో చాలా పెద్ద రచ్చ జరిగింది. చివరికి దాన్ని తుక్కుగా మార్చేశారు.
ఓ బైక్‌ల తయారీ సంస్థ, దాన్నుంచి సేకరించిన ఉక్కుని, తమ వాహనాల తయారీలో వినియోగించింది.
అది, డీజిల్‌తో నడిచే విమాన వాహక యుద్ధ నౌక కాబట్టి, డీ-కమిషనింగ్ ప్రాసెస్ సాధారణంగానే జరిగింది.
ఏతావాతా చెప్పేదేంటంటే, అణు ఇంధనంతో నడిచే జలాంతర్గాములు, విమాన వాహక యుద్ధ నౌకల్ని తయారు చేయడం చాలా చాలా కష్టం.
దానికంటే కష్టం.. వాటి వినియోగం తర్వాత.. రియాక్టర్లను.. వాడేసిన అణు ఇంధనాన్ని ‘జాగ్రత్త’ చేయడం అత్యంత సంక్లిష్టమైన పక్రియ అన్నమాట.
చివరగా: అంతర్జాతీయ స్థాయిలో అందుబాటులో వున్న సమాచారాన్ని విశ్లేషించి ఈ ఆర్టికల్ తయారు చేయబడింది.
– yeSBee