Little Hearts Telugu Review.. మలయాళ సినిమాలు ‘కాన్సెప్ట్ బేస్డ్’గా వుంటాయి.
సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం, నటీ నటుల ప్రతిభ.. అన్ని విషయాల్లోనూ జాగ్రత్తలు తీసుకుంటారు.
తక్కువ బడ్జెట్‌తోనే మలయాళ సినిమాలు తెరకెక్కుతుంటాయి సాధారణంగా. ఆ కోవలోనే, ‘లిటిల్ హార్ట్స్’ అనే సినిమా కూడా తెరకెక్కింది.!
తెలిసిన కథే ఇది. కథనం కూడా కొత్తగా ఏమీ లేదు.! కాకపోతే, నటీనటుల ప్రతిభ ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఆయా పాత్రలతో మనం కనెక్ట్ అయ్యేలా చేస్తుంటుంది.
నటీనటులు.. ఎవరికి వారు తమదైన నటనా ప్రతిభతో మెప్పించారు. సినిమాలోని ప్రతి సన్నివేశమూ మనం ఇంతకు ముందెప్పుడో చూసినట్లే అనిపిస్తుంటుంది.
Little Hearts Telugu Review.. కనెక్టింగ్ పాయింట్.. అదే కాన్‌ఫ్లిక్ట్.!
ఓటీటీ ప్రభావమో, మారుతున్న ట్రెండ్ ప్రభావమో గానీ, ఇద్దరు మగవాళ్ళ మధ్య ఆకర్షణ అనే అంశం చుట్టూ, అల్లిన ఓ థ్రెడ్.. చాలామంది సినీ అభిమానులకు ఇబ్బందికరంగా అనిపిస్తుంటుంది.
నిజానికి, వల్గారిటీ ఏమీ లేదు. సమాజం, యాక్సెప్ట్ చేయని ఓ అంశం అది. చాలా సున్నితంగానే డీల్ చేశారు. దానికి కొంత కామెడీ టచ్ కూడా ఇచ్చార్లెండి.
తేనె పూసిన కత్తి.. అనొచ్చు.! విషపు గుళికలకు షుగర్ కోటింగ్ అని కూడా అనుకోవచ్చు. ఇంకేమైనా అనుకోవచ్చు. సమాజంపై ఇలాంటి సినిమాల ప్రభావం, ఒకింత గట్టిగానే వుంటోంది.. అదీ, నెగెటివ్ ఇంపాక్ట్.
మహిమ నంబియార్, షైన్ టామ్ చాకో.. ఈ సినిమాలో మనకు తెలిసిన నటీనటులు. మహిమ నంబియార్ బానే చేసింది. షైన్ టామ్ చాకో.. మంచి నటుడని ఆల్రెడీ ప్రూవ్ అయిపోయిందెప్పుడో.!
వయసుకొచ్చిన కొడుకు.. ప్రేమలో పడ్డ తండ్రి..
పెళ్ళీడుకొచ్చిన కొడుకున్నా, వేరే మహిళతో ప్రేమలో పడతాడు ఇందులో హీరో తండ్రి. ఆ మహిళకీ ఓ కూతురు వుంటుంది. ఆమెకి భర్త కూడా వుంటాడుగానీ, కుటుంబానికి దూరంగా వుంటాడతడు.
హీరో, హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్.. ఇంకో మగాడితో, విదేశాల్లో పెళ్ళి చేసుకోవాలనుకునే కుర్రాడు.. ఇలా సాగుతుంది వ్యవహారం. మొత్తంగా మూడు ప్రేమ కథలన్నమాట.
హీరో తండ్రి, హీరోయిన్ తండ్రి.. స్నేహితులు.! హీరోయిన్ సోదరుడే, వేరే మగాడ్ని పెళ్ళాడాలనుకుంటాడు. అదీ సినిమాలో టర్నింగ్ పాయింట్.
చివరికి కథ సుఖాంతమవుతుందనుకోండి.. అది వేరే సంగతి. ముందే చెప్పుకున్నట్లు, ఈ తరహా సినిమాలు, మన సమాజంపై ఎందుకు బలవంతంగా రుద్దబడుతున్నాయన్నది ఓ బిగ్ క్వశ్చన్.
Also Read: అంబటి రాయుడి ‘గుడ్డి’ సిద్ధాంతం.!
ఆ మధ్య మలయాళ నటుడు బాసిల్ జోసెఫ్ నటించిన ఓ సినిమాలో, ఇద్దరు మహిళలు ఒకరి పట్ల ఒకరు ఆకర్షితులవుతారు. దాన్నొక మర్డర్ మిస్టరీలా తెరకెక్కించారు.
ఇక్కడ, ఈ ‘లిటిల్ హార్ట్స్’ ఓ రొమాంటిక్ మూవీ అన్నమాట.! ‘స్వలింగ వివాహాల’ చుట్టూ, ఎమోషనల్ స్టోరీలు అల్లేసి, సభ్య సమాజానికి ఏం సంకేతం ఇస్తున్నట్లు.?
భారత దేశంలో ‘స్వలింగ వివాహాలకు’ అనుమతి లేదు గనుక, విదేశాల్లో ‘పెళ్ళి’ అని సినిమాలో తెలివిగా ప్లాన్ చేశారు.
లేకపోతే, అదేదో ఇక్కడే.. మిగతా రెండు జంటలతో కలిసి చేసేసినట్లు చూపించేవారేమో.! సినిమా అంటే ఇంతేనా.? సినిమాలు తీస్తున్నది ఇందుకేనా.?
చివరగా..
దర్శక నిర్మాతలు, నటీనటులు, సెన్సార్ బోర్డు కూడా ఈ తరహా సినిమాల విషయమై ఆత్మ విమర్శ చేసుకోవడం మంచిది. వల్గారిటీకి మించి, ‘జుగుప్సాకరం’ ఈ తరహా కాన్సెప్టులతో సినిమాలు తెరకెక్కడం.