Table of Contents
Anushka Shetty Ghaati Review.. అనుష్క శెట్టి నుంచి ఏదన్నా సినిమా వస్తోందంటే, అది ఖచ్చితంగా ఫిమేల్ సెంట్రిక్ మూవీనే అవుతుంది.
అక్కినేని నాగార్జున – పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘సూపర్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ కన్నడ బ్యూటీ.. అనుష్క శెట్టి అలియాస్ స్వీటీ శెట్టి.
అయితే, అనుష్క శెట్టి దశ మార్చిన సినిమా మాత్రం, ‘అరుంధతి’. ఆ తర్వాత ‘బాహుబలి’ సినిమాతో అనుష్క రేంజ్ అంతకు మించి పెరిగిందన్నది నిర్వివాదాంశం.
మరి, అలాంటి అనుష్క నుంచి సినిమా వస్తోందంటే, ఆ సినిమాపై అంచనాలు ఏ రేంజ్‌లో వుంటాయో ప్రత్యేకంగా చెప్పాలా.? ‘ఘాటి’ విషయంలోనూ అదే జరిగింది.
Anushka Shetty Ghaati Review.. కథా కమామిషు ఇదీ..
క్రిష్ దర్శకత్వంలో అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ఘాటి’ తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇంతకీ, ఈ సినిమా కథా కథనాలేంటి.? చూద్దాం పదండిక.
ఆంధ్రా – ఒరిస్సా బోర్డర్‌లో గంజాయి స్మగ్లింగ్ చేసేవాళ్ళని ‘ఘాటీ’లు అని అంటారట. అలాంటి ఘాటీలు శీలవతి (అనుష్క శెట్టి), దేశి రాజు (విక్రమ్ ప్రభు).
తెర వెనుకాల వుండి, ఘాటీలతో గంజాయి వ్యాపారం చేస్తుంటారు కొందరు ప్రముఖులు. ఒకానొక సందర్భంలో శీలవతి, దేశి రాజు.. ఆ గంజాయి వ్యాపారులకు ఎదరు తిరగాల్సి వస్తుంది. ఇదీ క్లుప్తంగా కథ.
వాడకం ఏదీ.?
అనుష్క శెట్టి స్క్రీన్ ప్రెజెన్స్ గురించి కొత్తగా చెప్పేదేముంది.? సరిగ్గా విడితే, బొమ్మ అదిరిపోద్ది. కానీ, దర్శకుడు క్రిష్ ‘ఘాటీ’లో అనుష్కని సరిగ్గా స్క్రీన్ మీద వాడలేకపోయాడు.
విక్రమ్ ప్రభు కూడా మంచి నటుడు. అతన్ని సైతం సరిగ్గా వాడుకోలేకపోయాడు దర్శకుడు క్రిష్. సినిమా ప్రారంభం బానే వున్నా, క్రమంగా నీరసించిపోతుంది.

రొటీన్ రివెంజ్ డ్రామా.. అన్న ఫీలింగ్, మధ్యలోనే కలుగుతుంది. ట్విస్టులు, ఎలివేషన్స్.. ఇవేమంతగా వర్కవుట్ అవలేదు. ఒక్కో ఫ్రేములో, ఒక్కోలా కనిపిస్తుంది అనుష్క.
నెగెటివ్ రోల్స్ చేసిన చైతన్య రావు, రవీంద్ర విజయ్ తదితరులు.. పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. జగపతిబాబు పాత్ర కూడా తేలిపోయింది.
ఎందుకంత కక్కుర్తి.?
వీరోచితమైన ఫైట్స్ అనుష్కతో చేయించేయాలన్న తపన తప్ప, కథ, కథనాల విషయంలో, పాత్రల డిజైనింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోలేకపోయారు.
సినిమాకి మ్యూజిక్ కూడా అంతగా కలిసి రాలేదు. సినిమాటోగ్రఫీ ఓకే. ఖర్చు బాగానే చేశారుగానీ, క్వాలిటీ ఔట్‌పుట్ తీసుకురావడంలో విఫలమయ్యారు.
గంజాయిలో ఓ రకం పేరు శీలవతి. అలాగని, ప్రధాన పాత్రధారికి ఆ పేరు పెట్టేశారంతే. సెలక్టివ్‌గానే సినిమాలు చేస్తున్న అనుష్క, కథల ఎంపికలో జాగ్రత్త పడటంలేదు.
తన లుక్స్, పెర్ఫామెన్స్ విషయంలో అనుష్క నిర్లక్ష్యం చేస్తోందనే విషయం స్పష్టమవుతోంది. ఎవరికీ దక్కని స్టార్‌డమ్ అనుష్కకి దక్కింది. దాన్నిలా అనుష్క వృధా చేసుకుంటోంది.
ఓవరాల్‌గా ‘ఘాటీ’ నిరాశపరిచే సినిమా. చాన్నాళ్ళ తర్వాత అనుష్కని తెరపై చూసే అవకాశం.. అన్న కోణంలో సినిమాకి వెళితే ఓకే. కానీ, అంతకు మించి ఆశిస్తే, ప్చ్.. ఫీలవుతారు.