Little Hearts Review.. ఆడది కనిపిస్తే ముద్దు అయినా పెట్టెయ్యాలి.. కడుపైనా చేసెయ్యాలి.. అంటాడో పొలిటీషియన్ కమ్ సినిమా యాక్టర్.!
సినిమా వేదిక మీద ఫన్ కోసమే చేశాడో, నిజ జీవితంలోనూ అంతే కక్కుర్తి మనిషోగానీ.. అలవోకగా అతని నోటి వెంట ఈ పనికిమాలిన డైలాగ్ వచ్చేసింది.
అసలు విషయంలోకి వస్తే, సినిమా అన్నాక హీరో హీరోయిన్ల లిప్ లాక్ సీన్స్ వుండాలి.. వీలైతే, రేప్ సీన్స్ కూడా వుండాలి. సందర్భంతో పని లేకుండా, నరికేసుకోవడాలూ వుండాలి.
ఇవన్నీ కమర్షియల్ సినిమాకి సక్సెస్ ఫార్ములాస్ కిందే వస్తాయ్.! ప్చ్.. కానీ, ఇది నిజం కాదని నిరూపించిందో సినిమా. అది కూడా, చాలా చాలా చిన్న సినిమా.
Little Hearts Review.. లాంగ్ టెర్మ్ కోచింగ్..
సినిమా పేరేమో లిటిల్ హార్ట్స్.! నటీనటులు దాదాపు అంతా కొత్తవారే. మౌళి, శివానీ.. హీరో హీరోయిన్లు. సీనియర్ నటుడు రాజీవ్ కనకాల ఓ కీలక పాత్రలో మెరిశాడు.
లాంగ్ లాంగ్ ఎగో.. అని మొదలెడతారు కథని.! ఇంజనీరింగ్ లాంగ్ టెర్మ్ కోచింగ్‌కి అయిష్టంగానే వెళ్ళే అబ్బాయి, అంతే అయిష్టంగా నీట్ లాంగ్ టెర్మ్ కోచింగ్‌కి వెళ్ళే అమ్మాయి కథ ఇది.
ఇద్దరి మధ్యా ప్రేమ చిగురిస్తుంది. షరామామూలుగానే, ఇద్దరి ప్రేమ కథకీ చిన్న చిన్న ఇబ్బందులు. అవి కూడా, సరదాగానే వుంటాయి లెండి.
ఇంతకీ, ప్రేమ విజయ తీరాలకు చేరిందా.? చదువులు ఏమయ్యాయి.? ఇదంతా మిగతా కథ.! సినిమా మొదలవుతూనే, ఒకింత చికాకుగా అనిపిస్తుంది.
రాను రాను.. సినిమాలో లీనమవుతాం. అడుగడుగునా నవ్వులే. పైగా, ఫ్రెష్ నవ్వులు.! అలా అలా సాగిపోతుంటుంది సినిమా. ఇంతలోనే, శుభం కార్డు పడిపోతుంది.
అరరె.. సినిమా అప్పుడే అయిపోయిందా.. అనిపిస్తుంటుంది. పొట్ట చెక్కలయ్యేలా నవ్వేశాం.. అనలేంగానీ, సరదాగా నవ్వుకునేందుకు బోల్డంత అవకాశం వుందీ సినిమాలో.
జెన్ జి లవ్ స్టోరీ కదా.. లిప్ లాక్ సీన్స్ ఏమైనా వున్నాయా.? బెడ్రూమ్లో బంచిక్ వ్యవహారాలు ఏమైనా వున్నాయా.? అంటే, ప్చ్.. ఏమీ లేవని ఓ వర్గం నిరాశ చెందొచ్చుగాక.
క్లీన్ మూవీ.! తల్లిదండ్రులు, తమ పిల్లలతో కలిసి చూడగలిగే సినిమానే.! అందుకే, మంచి విజయాన్ని కూడా అందుకుంది.
ఏదన్నా సినిమా చూసేందుకు థియేటర్లకు వెళ్ళాలంటే, ఇంట్రెస్టు పూర్తిగా పోయిన రోజులివి. దాంతో, సినిమా బాగుందని చాలామంది చెప్పినా, ‘థియేటర్ ఎక్స్పీరియన్స్’ని స్కిప్ చేసేయాల్సి వచ్చింది.
ఓటీటీలో అందుబాటులోకి రావడంతో, కాస్త తీరిక చూసుకుని.. ‘లిటిల్ హార్ట్స్’ సినిమా కోసం సమయం వెచ్చించడం జరిగింది.
సినిమా బడ్జెట్‌కి తగ్గట్టుగా పాటలున్నాయి. సినిమాకి తగ్గట్టుగానే అన్ని క్రాఫ్ట్స్ పని చేశాయి. క్వాలిటీ బావుంది. మనసు పెట్టి సినిమాని చేశారు అందరూ.!
Also Read: బూతు కిట్టు ‘కుల’ పాత్రికేయ వ్యభిచారమ్.!
పలువురు సినీ ప్రముఖులు ‘లిటిల్ హార్ట్స్’ సినిమాని ప్రమోట్ చేశారు.. సోషల్ మీడియా వేదికగా. వాళ్ళందర్నీ అభినందించాల్సిందే.
నటీనటులంతా.. తమ పాత్రలకు తగ్గట్టుగా తెరపై ఒదిగిపోయారు. ఎవరి నటన విషయంలోనూ వంకలు పెట్టడానికేమీ లేదు.
చివరగా.. కమర్షియల్ ఎలిమెంట్స్.. అనే వంకతో, కక్కుర్తి ప్రదర్శించడానికి అవకాశం వున్నా, కక్కుర్తి పడని దర్శక నిర్మాతల్ని అభినందించకుండా వుండలేం.
