IAF Tejas Vs Rafale.. రఫేల్ గొప్పదా.? తేజస్ గొప్పదా.? యుద్ధ రంగాన ఏ యుద్ధ విమానం శక్తి ఎంత.? ఈ విషయమై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.!
డౌట్ ఏముంది.? రఫేల్ అత్యాధునిక యుద్ధ విమానం.! ఇందులో ఇంకో మాటకు తావు లేదు.! ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు రఫేల్ యుద్ధ విమానాన్ని వినియోగిస్తున్నాయి.
ఫ్రాన్స్ నుంచి రఫేల్ యుద్ధ విమానాల్ని భారత వైమానిక దళం కొనుగోలు చేసింది. భారత నౌకాదళం కూడా రఫేల్ యుద్ధ విమానాల్ని త్వరలో సొంతం చేసుకోనుంది.
ఇప్పటికే భారత వైమానిక దళానికి అందిన రఫేల్ యుద్ధ విమానాలకు అదనంగా, మరికొన్ని రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు దిశగా ప్రయత్నాలూ జరుగుతున్నాయి.
మరోపక్క, తేజస్ అంటే.. భారత్ తయారీ యుద్ధ విమానం.! తేజస్ అంటే, ప్రస్తుతానికి తేలికపాటి యుద్ధ విమానం మాత్రమే.! రఫేల్‌తో పోల్చితే, తేజస్ చిన్నది.!

చిన్నదైనా, యుద్ధ రంగాన తేజస్ పని తీరు అత్యద్భుతంగా వుంటుందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. అయినాసరే, తేజస్ యుద్ధ విమానాన్ని, రఫేల్‌తో పోల్చడం సబబు కాదన్నది సర్వత్రా వినిపిస్తోన్న వాదన.
త్వరలో భారత వైమానిక దళంలో చేరబోతోంది తేజస్ ఎంకె-1ఎ యుద్ధ విమానం. ప్రస్తుతం, వెపన్ టెస్టింగ్ జరుగుతోంది. తేజస్ ఎంకె1 యుద్ధ విమానంతో పోల్చితే ఎంకె1ఎ ఇంకాస్త అత్యాధునికమైన యుద్ధ విమానం.
అయితే, తేజస్ సిరీస్‌లో ఎంకె2 యుద్ధ విమానం కూడా ప్రస్తుతం నిర్మాణ దశలో వుంది. ఎంకె2 యుద్ధ విమానం, ప్రస్తుత తేజస్ కంటే, మరింత మెరుగైనది కాబోతోంది.
తేజస్ ఎంకె2 యుద్ద విమానం మాత్రం, రఫేల్‌తో పోల్చితే, మెరుగైన యుద్ధ విమానం అవుతుందన్నది రక్షణ రంగ నిపుణులు చెబుతున్నమాట.
స్వదేశీ తయారీ యుద్ధ విమానానికీ, విదేశీ తయారీ యుద్ధ విమానానికీ.. మధ్య కొన్ని సానుకూలతలూ, ప్రతికూలతలూ వుంటాయి.
రఫేల్ ప్రతికూలతల విషయానికొస్తే, సరికొత్త ఆయుధాల ఇంటెగ్రేషన్ విషయంలో సమస్యలొస్తాయి.
సుఖోయ్ యుద్ధ విమానాన్ని మన దేశంలోనే తయారు చేసుకుంటున్నా, సూపర్ సుఖోయ్ కోసం, రష్యా సాయం తప్పనిసరవుతోంది.
అదే, తేజస్ విషయంలో అలాంటి సమస్యలేమీ ఉత్పన్నం కావు. అలా చూసుకుంటే, ఎప్పటికప్పుడు, తేజస్ యుద్ధ విమానానికి సంబంధించిన సాంకేతికతను అప్‌డేట్ చేసుకోవడం సాధ్యపడుతుంది.
తేజస్ యుద్ధ విమానానికి వెపన్ ఇంటెగ్రేషన్ కూడా, మనకి ఇష్టమైనట్లు చేసుకోవడానికి వీలుంటుంది. అలా చూస్తే, రఫేల్ కంటే తేజస్ వైపే మొగ్గు చూపాల్సి వుంటుంది.
