Family Star Review: గోవర్ధన్, ఇందు.. జగమంత నీరసం.!
Family Star Vijay Deverakonda Mrunal Thakur
Family Star Review.. సినిమా టైటిల్ ‘ఫ్యామిలీ స్టార్’.! ఇంకేముంది.? ‘అర్జున్ రెడ్డి’ మేనియా నుంచి బయటపడి, ఫ్యామిలీ ఆడియన్స్, థియేటర్ల వైపు చూశారు. సినిమా ప్రమోషన్స్ అంత ప్లెజెంట్‌గా వున్నాయ్ మరి.!
నేనూ, నా సతీమణిని వెంటేసుకుని ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా చూసేందుకు వెళ్ళాను.! మధ్యతరగతి కుటుంబం.. ఆ కుటుంబంలో ఇద్దరు అన్నల తమ్ముడు, కుటుంబ బాధ్యతనంతటినీ భుజాలపైన మోస్తుంటాడు.
పెద్దన్నది బాధ్యతారాహిత్యం. చిన్న అన్నది వేరే వ్యవహారం.! మొత్తం ఐదుగురు పిల్లలు.! ఓ బామ్మ. ఇద్దరు వదినలు.. ఇదీ మన ‘ఫ్యామిలీ స్టార్’ కుటుంబం.
ఆ కుటుంబానికి అన్నీ తానే అయి వ్యవహరించే ఆ ఫ్యామిలీ స్టార్ గోవర్ధన్ జీవితంలోకి ఇందు అనే అమ్మాయి వస్తుంది. ప్రేమించేస్తాడు, పెళ్ళి చేసుకుందామనీ అనుకుంటాడు.
Family Star Review.. స్టూడెంటు.. సీఈవో.!
పరమ రొటీన్‌గానే, ఆ ప్రేమలో ఓ పెద్ద ట్విస్ట్.! విషయం ఇండియా నుంచి, వేరే దేశానికి వెళుతుంది. సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంటు కాస్తా, ఓ పెద్ద కంపెనీకి సీఈవో అని తేలుతుంది. అప్పటిదాకా ప్రేమించినోడు, ఆమె మీద చిన్నపాటి రివెంజ్ లాంటిది ప్లాన్ చేస్తాడు.. అదీ విదేశంలో.
ఇంతకీ, కుటుంబం ఏమైంది.? ఆ కుటుంబానికి మంచి జీవితాన్ని ఇద్దామనే, మనోడు విదేశాలకు వెళ్ళాడట. అడపా దడపా ఫోన్లో మాట్లాడుతుండాడు లెండి.! కథ ఇలా సాగుతుంటుంది.

విజయ్ దేవరకొండ బాగానే చేశాడు. నటుడిగా తనను తాను మార్చుకుంటున్న తీరు అభినందనీయమే. దర్శకుడు ఏం చెబితే, అది చేసేస్తున్నాడు. కాకపోతే, విజయ్‌తో సినిమాలు చేస్తున్న దర్శకులే మారడంలేదు.
కథలో కాన్‌ఫ్లిక్ట్ ఏంటి.? అంటే, ఎవడికీ తెలీదు. అసలు తెరపై ఏం జరుగుతోందబ్బా.? అని నా సతీమణి మధ్య మధ్యలో అడుగుతోంటే, ఏం చెప్పాలో అర్థం కాలేదు.
‘తొలిప్రేమ’ సినిమాలో పవన్ కళ్యాణ్ చెల్లెలిగా కనిపించిన వాసుకి, ఈ సినిమాలో దర్శనమిచ్చింది. ప్చ్.. ఆమె చేయడానికేమీ లేదు.
పిల్లలకి ఏం పాఠం చెప్పావ్ గోవర్ధనం.!?
రవిబాబు నుంచి కాస్తంత ఫన్ లేదంటే కాస్తంత విలనిజం ఆశిస్తాం. ఇవేవీ ఆయన్నుంచి రాలేదు. తెరపై ఇలా వచ్చి, అలా వెళ్ళాడంతే, ఆ సీన్ వల్ల సినిమాకి కలిగిన ప్రయోజనం శూన్యం.
పిల్లలకి ఏదో పాఠం చెప్పాడట, ఫైట్ చేసి.. ఆ సీన్‌లో గోవర్ధనం. ఏందది.? బుర్ర ఎంత గోక్కున్నా, విషయం అర్థం కాలేదాయె.
విదేశాలకి వెళ్ళి ఏదో ప్రాజెక్టు చేసేశాడట హీరో (The Family Star). దాన్నో ప్రాజెక్టు అంటారా ఎవరైనా.? అనే డౌట్ మీకొస్తే అది మీ తప్పు కాదు.!
జగపతిబాబు పాత్ర వేస్టయ్యింది. రోహిణి హట్టంగడితో ఏదో కాస్త చేయించారు. ఆమె తన అనుభవాన్నంతా రంగరించిందిగానీ, ప్చ్.. ఆ పాత్ర కూడా తేలిపోయింది.
ఓ మంచి విషయం ఏంటంటే.. సినిమాలో ఎక్కడా అసభ్యత లేదు.! ఈ విషయంలో దర్శకుడ్ని మెచ్చుకోవాలి.! టైటిల్ ‘ఫ్యామిలీ స్టార్’ అని పెట్టి, ఫ్యామిలీని ఎట్రాక్ట్ చేసే కాన్సెప్ట్‌తోనే సినిమాని తెరకెక్కించినా.. ఆ ఫ్యామిలీ జనాలకీ విసుగు తెప్పించేంత సాగతీత.. సినిమాకి మైనస్ అయ్యింది.
Mudra369
వెన్నెల కిషోర్ తెరపై కన్పిస్తే ఆ కిక్కే వేరు మామూలుగా అయితే. ఇందులో వెన్నెల కిషోర్ కూడా వేస్టయ్యాడు. ఆ పాత్ర, ఈ పాత్ర.. అని కాదు. అందరిదీ అదే పరిస్థితి.
హీరోయిన్ మృనాల్ ఠాకూర్ (Mrunal Thakur) నుంచి బోల్డంత రాబట్టుకోవచ్చు. నటన కావొచ్చు, గ్లామర్ కావొచ్చు.. ఏదైనాసరే.
అయ్యో పాపం మృనాల్ ఠాకూర్..
ప్చ్.. మృనాల్ ఠాకూర్‌ని కూడా సరిగ్గా వాడుకోలేకపోయాడు దర్శకుడు. అటు విజయ్ కూడా అంతకు మించి ఏమీ చేయలేకపోయాడు. మ్యూజిక్ అయితే పరమ బోరింగ్. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఎడిటింగ్.. వాట్ నాట్.. అన్నీ చేతులెత్తేశాయ్.
ఎంత దారుణమైన సినిమా అయినా, అందులో కొన్ని డైలాగులు ఆకట్టుకుంటాయ్. పరశురామ్ సినిమాల్లో డైలాగులు చాలా స్పెషల్‌గా వుంటాయ్ నిజానికి. కానీ, ఇందులో ఒక్కటంటే ఒక్క డైలాగ్ కూడా గుర్తుండదు సినిమా చూశాక.
సూపర్ హిట్ ఆల్బమ్ పడి వుండాలి ఇలాంటి సినిమాకి.! ప్చ్.. లేదాయె. కాస్ట్యూమ్స్ అయితే మరీ దారుణం.! హీరోయిన్ మృనాల్ ఠాకూర్‌ని ఆ దుస్తుల్లో చూస్తే, అయ్యోపాపం.. అనిపించింది. ఎంత అందంగా కాస్ట్యూమ్స్‌లో ఆమెని చూపించొచ్చు.?
ఇలా ఎలా పరశురామ్.?
విజయ్ దేవరకొండ ఫ్లాపుల పరంపరకి ఈ ‘ఫ్యామిలీ స్టార్’ కొనసాగింపు. మృనాల్ ఠాకూర్‌కి తెలుగులో ఇది తొలి ఫ్లాప్. డిజాస్టర్ అని కూడా అనొచ్చు. ‘ఫ్యామిలీ స్టార్’ టైటిల్ చూసి, నాలాంటి చాలామంది సకుటుంబ సమేతంగా సినిమాకి రావడం కనిపించింది. అందరిలోనూ నిట్టూర్పులే.!
కొన్ని సీన్స్ ఎడిటింగ్ టేబుల్ దగ్గర ఆగిపోకుండా, ఎలా స్క్రీన్ మీదకు వచ్చాయి.? అన్న అనుమానం చాలా సందర్భాల్లో కలుగుతుంది. దిల్ రాజు నుంచి వచ్చిన సినిమాయేనా ఇది.? అన్న డౌట్ మీకొస్తే అది మీ తప్పు కానే కాదు.
అన్నట్టు, ఈ సినిమాలో ‘మజిలీ’ ఫేం దివ్యాన్ష కౌశిక్ కూడా వుందండోయ్.! ఆమె వల్ల కూడా ఈ సినిమాకి ఏమాత్రం ఉపయోగం లేదు.! ఆమెకీ ఈ సినిమా వల్ల ఏమాత్రం లాభం లేదు.!
చివరగా.. సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతున్న పెద్దన్న, అర్థం పర్థం లేని ఓ చిన్న కారణానికి పచ్చి తాగుబోతుగా మారిపోతాడు.! పెద్ద కంపెనీ సీఈఓ అయిన ఇందు, మిడిల్ క్లాస్ అబ్బాయి మీద థీసిస్ రాస్తుంది.
ఏం చదువులో ఏంటో.! పిచ్చి అంటార్రా దీన్ని.. అని దర్శకుడు పరశురామ్ గురించి నా సతీమణి నాతో సినిమా పూర్తయ్యాక సెలవిచ్చింది.