Allu Arjun NTR Politics.. అల్లు అర్జున్ రాజకీయాల్లోకి వస్తున్నాడట.. జూనియర్ ఎన్టీయార్ కూడా కొత్త రాజకీయ పార్టీ దిశగా మంతనాలు ప్రారంభించాడట.!
2028లో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం జూనియర్ ఎన్టీయార్ సన్నద్ధమవుతున్నాడట. అల్లు అర్జున్ కూడా అదే సమయానికి రాజకీయ రంగ ప్రవేశం చేసేస్తాడట.!
ఏంటీ.? ఇదంతా నిజమేనా.? ఇంతకీ, అల్లు అర్జున్ తదుపరి సినిమా ‘రాకా’ రిలీజ్ ఎప్పుడు.? జూనియర్ ఎన్టీయార్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా రిలీజ్ అయ్యేదెప్పుడు.?
ప్రస్తుతం వున్న పరిస్థితుల్లో ఆయా హీరోల సినిమాల రిలీజ్‌ల డేట్ విషయమ్మీదనే పూర్తిస్థాయి స్పష్టత వుండటం లేదు. వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి.
అలాంటిది, అల్లు అర్జున్ అయినా జూనియర్ ఎన్టీయార్ అయినా.. రాజకీయ కోణంలో ఆలోచనలు మొదలు పెడితే, అవెప్పటికి కార్యరూపం దాల్చాలి.?
తమిళనాడు వ్యవహారం వేరు. చాలా ఏళ్ళుగా విజయ్, రాజకీయ రంగ ప్రవేశం గురించి చర్చోపచర్చలు జరిగాయి. చివరికి మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి, విజయ్ గెలిచాడు.. తమిళనాడు సీఎం అయ్యాడు.
ఏమో, తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాల్లోనూ అలాంటి అద్భుతాలు ముందు ముందు జరుగుతాయేమో. సినీ నటుడు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్న సంగతి తెలిసిందే.
తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాలు చాలా భిన్నమైనవి. ఇక్కడ విభజన రాజకీయాల్ని తట్టుకుని నిలబడటం అంత తేలిక కాదు. పైగా, కుల రాజకీయాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఇక్కడ.
జూనియర్ ఎన్టీయార్, అల్లు అర్జున్.. ఈ ఇద్దర్నీ రాజకీయాల్లోకి ఎవరు లాగుతున్నారు.? మీడియా అత్యుత్సాహం వెనుక అసలు కారణమేంటి.? అన్నది తెలియాల్సి వుంది.
కావాలనుకుంటే, జూనియర్ ఎన్టీయార్‌కి టీడీపీలో కీలక పదవి దక్కుతుంది. తెలంగాణ రాష్ట్ర టీడీపీ బాధ్యతల్ని ఆయన ఎప్పుడైనా చేపట్టొచ్చు.. ఎవరూ అడ్డుకునే ప్రసక్తే లేదు.
అంతెందుకు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మంత్రి పదవిని కూడా కోరుకోవడంలేదు.. వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యారాయన.
ఇక, అల్లు అర్జున్ విషయానికొస్తే.. అతని అభిమానుల ముసుగులో కొందరు సోషల్ మీడియా వేదికగా జన సేన మీద ట్రోల్ చేస్తున్నా, ఆయనెప్పుడూ పవన్ కళ్యాణ్‌కి వీరాభిమానిగానే వుంటాడు.
సో, ఎలా చూసినా అల్లు అర్జున్ కావొచ్చు.. జూనియర్ ఎన్టీయార్ కావొచ్చు.. ఇప్పట్లో రాజకీయాల్లోకి వచ్చే అవకాశమే లేదు.
పుకార్లు పుట్టించడం కోసం ప్రభాస్, మహేష్ తదితర హీరోల్ని కూడా ముందు ముందు రాజకీయ తెరపైకి లాగేస్తుంది మన తెగులు మీడియా నిస్సిగ్గుగా.! ఇందులో వింతేమీ లేదు.
