ఇండియన్ క్రికెట్‌కి సంబంధించి ‘లెజెండ్’ అనదగ్గ వ్యక్తుల్లో ఆయనా ఒకరు. అలాంటి ఆ లెజెండ్, చిన్న కామెంట్‌తో వివాదాస్పద వ్యక్తిగా (Anushka Sharma Sunil Gavaskar) మారిపోయారు. ఆయనే సునీల్ గవాస్కర్.
ఐపీఎల్ టీ20 నేపథ్యంలో, విరాట్ కోహ్లీ ఆట తీరు గురించి మాట్లాడుతూ, మధ్యలో విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ పేరుని ప్రస్తావించడమే గవాస్కర్ చేసిన అతి పెద్ద తప్పు. ఏదో సరదాగా ఆయన అనుష్క పేరుని ప్రస్తావించాడేమోగానీ, అది కాస్తా అనేక రకాలైన వక్రీకరణలకు గురై.. డబుల్ మీనింగ్ డైలాగులా మారిపోయి.. అనుష్క, గవాస్కర్ మీద మండిపడేంత దాకా వెళ్ళిపోయింది.
అనుష్క ప్రస్తుతం ప్రెగ్నెంట్. ఇలాంటి సమయంలో చిన్న చిన్న విషయాలూ ఆమెకు ఒకింత అసహనం కల్గిస్తాయన్నది నిర్వివాదాంశం. అయినా, గవాస్కర్‌కి అనుష్క పేరుని విరాట్ ఆటతీరుతో ముడిపెట్టాలని ఎలా అనిపించిందట.? ఇదే చాలామందికి అర్థం కావడంలేదు.
లాక్‌డౌన్ సమయంలో భార్య అనుష్క బౌలింగ్ చేస్తోంటే, విరాట్ బ్యాటింగ్ చేయడం అనేది అసలు ‘ప్రాక్టీస్’ కిందికి రాదు, ఆ ప్రాక్టీస్ సరిపోదు.. అన్నది సునీల్ గవాస్కర్ చెప్పిన మాట. సాధారణ టోన్‌లో ఈ డైలాగ్‌లో పెద్దగా తప్పేమీ కనిపించదు.
కానీ, లాక్‌డౌన్‌లో విరాట్ బాగా బ్యాటింగ్ చేయడం వల్ల అనుష్క ప్రెగ్నెంట్ అయ్యిందేమోగానీ, అలాంటి ప్రాక్టీస్‌తో మైదానంలో ఉపయోగముండదు.. అనే ఉద్దేశ్యంతో గవాస్కర్ ఆ వ్యాఖ్యలు చేశాడన్నట్లుగా విషయం ప్రొజెక్ట్ అయ్యింది. ఈ విషయమై గవాస్కర్ ఇప్పటికే వివరణ ఇచ్చారు.
తన వ్యాఖ్యల్లో ద్వందార్థం ఏమీ లేదనీ, తాను కేవలం విరాట్ కోహ్లీ ఆట తీరు గురించి మాత్రమే మాట్లాడాననీ, తాను మాట్లాడిన మాటల్ని ఎడిట్ చేసి, పెడార్థాలు తీస్తున్నారని గవాస్కర్ చెప్పుకొచ్చారు. కానీ, అనుష్క కోపం ఇంకా చల్లారినట్లు లేదు.
దాంతో, పలువురు క్రికెటర్లు, గవాస్కర్ పెద్దరికాన్ని దృష్టిలో పెట్టుకోవాలంటూ అనుష్కకి సూచిస్తున్నారు. సినిమా హీరోయిన్‌గా అనుష్క ఎన్నెన్నో విమర్శలు, ట్రోలింగ్ ఎదుర్కొని వుండొచ్చుగాక. కానీ, తల్లికాబోతున్నానన్న ఆనందంలో వున్న అనుష్కని ఇలాంటి వివాదాలు తీవ్ర మనోవేదనకు గురిచేస్తాయన్నది నిర్వివాదాంశం.