స్వర్గీయ అల్లు రామలింగయ్య తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయన జయంతిని పురస్కరించుకుని, అల్లు కుటుంబం ఓ ఆసక్తికరమైన, అద్భుతమైన అనౌన్స్‌మెంట్ (Allu Studio Allu Family) చేసింది. అదే ‘అల్లు స్టూడియో’ గురించిన ప్రకటన.
అల్లు స్టూడియో, అల్లు ఎంటర్‌టైన్‌మెంట్.. అంటూ ఈ ప్రకటన బయటకు వచ్చింది. అల్లు రామలింగయ్య తనయుడు అల్లు అరవింద్, తెలుగు సినీ పరిశ్రమలో ఓ ప్రముఖ నిర్మాత. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో ఎన్నో ఏళ్ళుగా అత్యద్భుతమైన సినిమాలు చేస్తున్నారు. ఆయన తనయుడు అల్లు అర్జున్, టాలీవుడ్‌లో వున్న టాప్ 5 యంగ్ హీరోల్లో ఒకడు.
‘అల్లు’ అనే ఇంటి పేరు ఇప్పటికే ఓ బ్రాండ్‌గా మారింది. ఆ బ్రాండ్‌ని మరింత విస్తరించే క్రమంలో అల్లు అర్జున్, ఈ స్టూడియో ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. హైద్రాబాద్ శివార్లలో సుమారు 10 ఎకరాల్లో ఈ స్టూడియో నిర్మితం కానుందనీ, ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఇది చాలా అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో రూపొందబోయే స్టూడియో అవుతుందనీ ఇన్‌సైడ్ సోర్సెస్ సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
టాలీవుడ్‌లో ఇప్పటికే పలు ప్రముఖ స్టూడియోలు వున్నాయి. అంతకు మించి అనే స్థాయిలో ‘అల్లు స్టూడియో’ వుండబోతోందట. బాలీవుడ్ సైతం, టాలీవుడ్ వైపు చూసేలా ఈ స్టూడియో వుంటుందని టాలీవుడ్ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇక, అల్లు అర్జున్ ప్రస్తుతం చేస్తున్న ‘పుష్ప’ సినిమా విషయానికొస్తే, చిత్ర దర్శకుడు సుకుమార్ ఓ సూపర్బ్ యాక్షన్ సీన్ చిత్రీకరణకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కరోనా కారణంగా ‘పుష్ప’ సినిమా షూటింగ్‌కి బ్రేకులు పడ్డాయిగానీ, లేదంటే చాలా ముఖ్యమైన పార్ట్ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసేసుకునేదే. రష్మిక మండన్న ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.