రాజకీయాల్లో పూటకో మాట చెప్పడం మామూలే. అలా చెప్పకపోతే, వాళ్ళనసలు రాజకీయ నాయకులు అనలేం ఈ నయా ట్రెండ్ రాజకీయాల్లో. పొద్దున్న ఓ పార్టీ, మధ్యాహ్నం మరోపార్టీ, సాయంత్రానికి ఇంకో పార్టీ.. రేపు మళ్ళీ కొత్త కుంపటి వెతుక్కోవాల్సిందే (Political Leaders Jumping Politics) అన్నట్టు తయారైంది.
విలువల్లేవ్, వంకాయల్లేవ్. ఫలానా రాజకీయ నాయకుడు.. అని పనిగట్టుకుని ఒకరి పేరు చెప్పాల్సిన పనిలేదు.. మొత్తంగా రాజకీయ నాయకులంతా అలాగే తయారయ్యారు. ఆయా పార్టీల సిద్ధాంతాలు నచ్చి, ఆయా పార్టీల్లో చేరే నాయకులు కనిపించరు. ఏ పార్టీలో చేరితే, బాగా సంపాదించొచ్చు.. అని మాత్రమే ఆలోచిస్తున్నారు నేటి తరం రాజకీయ నాయకులు.
‘ఫలానా పార్టీలో పనిచేయడం గర్వకారణం..’ అని ఒకప్పుడు రాజకీయ నాయకులు చెప్పుకునేవారు. ఇప్పుడలా కాదు, పార్టీ మారగానే.. పాత పార్టీ పాపాలన్నీ గుర్తుకొచ్చేస్తాయ్. కొత్త పార్టీ భజన మొదలువుతుంది.
ఇట్నుంచి అటు.. అట్నుంచి ఇటు.. ఈ కప్పల తక్కెడ (Political Leaders Jumping Politics) వ్యవహారాన్ని నడుపుతున్న రాజకీయ నాయకుల్ని ప్రజలు ఛీ కొడుతున్నాసరే, వాళ్ళసలు మారనే మారరు.
రాములమ్మ రూటే సెపరేటు..
సరే, అవన్నీ పక్కన పెట్టి రాములమ్మ.. అదేనండీ, సినీ నటి విజయశాంతి (Vijayasanthi) విషయానికొద్దాం. ఆమె తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీ అయ్యారు గతంలో. అప్పట్లో కేసీఆర్, విజయశాంతికి దేవుడిచ్చిన అన్నగారు. కానీ, అలా కేసీఆర్‌తో కలిసి రాజకీయాల్లో పనిచేసినందుకు ‘సిగ్గుగా వుంది’ అని తాజాగా విజయశాంతి సెలవిచ్చారు.
విజయశాంతి మెడలో కండువా రంగు ఈ మధ్యనే మారింది కదా, పొలిటికల్ స్పీచులు ఇలాగే వుండాలి. లేదంటే, కొత్త పార్టీలో ఆమెకు కావాల్సిన పదవులు దక్కవు. గులాబీ పార్టీకీ కమలం పార్టీకి మధ్యలో ఆమె కొన్నాళ్ళపాటు కాంగ్రెస్ పార్టీతో సావాసం చేశారు. ఆ సమయంలో ఆమెకు, ఈ కమలం పార్టీ అస్సలు నచ్చలేదు (Political Leaders Jumping Politics). కమలం పార్టీ మీద విరుచుకుపడిపోయారు.
కమలం పార్టీ విజయశాంతికి కొత్త కాదు, ఆమె రాజకీయం మొదలైందే కమలం పార్టీతో. ఆంధ్రపదేశ్, తెలంగాణ రాజకీయాల్లో ఇలా ‘కండువా మార్చేసిన’ రాజకీయ నాయకుల్లో చాలామంది ఇలాంటి మాటలు చెప్పినవారే, చెబుతున్నవారే.
తమ్మినేని అప్పుడలా, ఇప్పుడిలా..
ఇప్పుడు వైసీపీలో వున్న తమ్మినేని సీతారాం, ‘నా మరణం తర్వాత, నా పార్దీవ దేహమ్మీద తెలుగుదేశం జెండానే వుండాలి’ అన్నారు.
తెలుగుదేశం, ప్రజారాజ్యం.. ఇవన్నీ అయిపోయాయి.. ప్రస్తుతం వైసీపీలో వున్నారాయన. ముందు ముందు ఆయన రాజకీయం ఎలా వుంటుందో చెప్పలేం. రేవంత్ రెడ్డి, బొత్స సత్యనారాయణ.. ఇలా చెప్పుకుంటూ పోతే, ఆ లిస్ట్ చాంతాడంత వుంటుంది.. అవలీలగా పార్టీలు మార్చేసిన (Political Leaders Jumping Politics) నాయకుల వివరాలు తీస్తే.
రాజకీయంగా పుట్టుక ఓ పార్టీలోనే.. చావు కూడా ఓ పార్టీలోనే.. అనకుని, సిద్ధాంతాలకు కట్టుబడే నాయకుల్ని ఈ నయా ట్రెండ్ రాజకీయాల్లో ఆశించలేం.
అందుకే, రాజకీయ నాయకులు చెప్పే డైలాగుల్లో బోల్డంత ఎంటర్‌టైన్‌మెంట్ వుంటుందనుకుని, ఎంజాయ్ చేయడమే. అందరూ చేస్తున్నది అదే రాజకీయమైనప్పుడు ఎవర్ని మాత్రం ప్రత్యేకంగా నిందించి ఏం ప్రయోజనం.?