అమరజీవి పొట్టి శ్రీరాములు.. (Amarajeevi Potti Sriramulu Sacrifice) ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు జరిగిందంటే, దానిక్కారణం ఆయన చేసిన త్యాగమే. అసలు సిసలు ఆమరణ నిరాహార దీక్ష అంటే ఏంటో చాలామందికి తెలియని రోజులివి.
ఉదయం నుంచి సాయంత్రం దాకా చేసే నిరాహార దీక్షలు, రెండ్రోజులు చేసే నిరాహార దీక్షలు.. ఇవి కావు అసలు నిరసన దీక్షలంటే. ఆ లెక్క వేరే. అనుకున్నది సాధించేదాకా ఆహారం ముట్టకపోవడం అనేది ఆమరణ నిరాహార దీక్ష. అంటే, ప్రాణం పోయేదాకా ఆహారం ముట్టుకోకపోవడమన్నమాట. ఈ విషయంలో తెలుగు జాతికి స్ఫూర్తి పొట్టి శ్రీరాములు.
ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తెలుగువారికి ఎదురవుతున్న అవమానాల నేపథ్యంలో పొట్టి శ్రీరాములు, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. నిరాహార దీక్ష కొనసాగిస్తూనే ఆయన (Amarajeevi Potti Sriramulu Sacrifice) ప్రాణాలు కోల్పోయారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అదే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకి బీజం వేసింది.
హైద్రాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతం, ప్రత్యేకాంధ్ర రాష్టంతో కలిసి ఉమ్మడి ఆంధ్రపదేశ్ ఏర్పాటయ్యింది. తెలంగాణ ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు.. ఇవన్నీ వేరే అంశాలు.
ప్రజల కోసం అవసరమైతే తన ప్రాణాల్ని పణంగా పెట్టేవాడు నాయకుడు. అలాంటి నాయకుడు పొట్టి శ్రీరాములు కాగా, తన ప్రాణాల్ని పణంగా పెడతానని పబ్లసిటీ స్టంట్లు చేసి అధికారం దక్కించుకునేవారు నేటితరం రాజకీయ నాయకులు.
నాటి పొట్టి శ్రీరాములు స్ఫూర్తి నేటి రాజకీయాల్లో లేకపోవడం వల్లే.. ప్రజా పోరాటాలు ఎక్కువ కాలం మనుగడ సాధించలేకపోతున్నాయి.. గమ్యం చేరలేకపోతున్నాయి. అసలు పొట్టి శ్రీరాములు అంటే ఎవరు.? అని ప్రశ్నిస్తోన్న రోజులివి.
మనలో ఎంతమందికి నిజంగా పొట్టి శ్రీరాములు త్యాగం గురించి తెలుసు.? ఆ మహనీయుల త్యాగఫలమే.. నేటి మన జీవితం. దురదృష్టం అలాంటి మహనీయుల గురించి మనం తెలుసుకోకపోవడం.! ‘ఆంధ్ర’ అన్న మాట విన్పించినంతకాలం పొట్టి శ్రీరాములు (Amarajeevi Potti Sriramulu Sacrifice) పేరుని మనం మననం చేసుకోకపోతే, ఆయన చేసిన ప్రాణ త్యాగానికి విలువ లేనట్టే.