ఇండియన్ ప్రీమియర్ లీగ్.. (Indian Premiere League 2021) అంటే అదో కిక్కు! కానీ, గతంతో పోల్చితే, ఇప్పుడు ఆ కిక్కు అంతలా క్రికెట్ అభిమానులకు ఎక్కడంలేదు. స్టేడియంలో క్రికెట్ చూసే అవకాశం లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.
గత ఏడాది కరోనా నేపథ్యంలో యూఏఈలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ పోటీలు జరిగాయి. ఈసారి మన దేశంలోనే జరుగుతోంది 2021 ఇండియన్ ప్రీమియర్ లీగ్. టైటిల్ ఫేవరెట్ ఎవరంటే ముంబై అని నిస్సందేహంగా చెప్పొచ్చు. చెన్నయ్ సూపర్ కింగ్స్ జట్టు ఈ ఏడాది కూడా నిరాశపరిచేలానే వుంది.
పోటీల ప్రారంభోత్సవం ఘనంగా లేకపోవడం, అదే సమయంలో దేశంలో కరోనా వైరస్ అనూహ్యంగా వ్యాప్తి చెందుతుండడంతో.. కరోనా వార్తలకే ఎక్కువ ప్రాధాన్యత వుంటోంది. ఓ వైపు ఐపీఎల్, ఇంకో వైపు కరోనా.. ఈ రెండు కారణాలతో బాలీవుడ్ సినిమాలు చాలానే వాయిదా పడ్డాయి.
సినిమాల సంగతి పక్కన పెట్టి, ఐపీఎల్ విషయానికొస్తే, అభిమానుల్లో మునుపటి ఉత్సాహం అస్సలేమాత్రం కనిపించడంలేదు. పబ్బులు, సినిమా థియేటర్లు.. ఒకప్పుడు ఐపీఎల్ సందడికి వేదికలుగా మారేవి. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. చిన్నా చితకా పట్టణాల్లో ప్రత్యేకంగా ‘లైవ్-షో’ చూసే పరిస్థితి కూడా లేదు.
అయితే, పోటీలు (Indian Premiere League 2021) ముందు ముందు మరింత రసవత్తరంగా మారుతాయనీ, అప్పుడు ఐపీఎల్ మీద క్రికెట్ అభిమానుల్లో మోజు కూడా పెరుగుతుందనే వాదనా లేకపోలేదు. ఆశపడ్డం వరకూ బాగానే వుందిగానీ, నిజంగానే ఆ ఊపు వస్తుందా.? లేదంటే, కరోనా దెబ్బకి ఇంకో ఐపీఎల్ సీజన్.. ‘మమ’ అన్పించేసినట్లేనా.? అన్న అనుమానం అయితే ఐపీఎల్ నిర్వాహకుల్లోనూ కనిపిస్తోంది.