సినిమా రివ్యూ: ‘వకీల్ సాబ్’.. ది పవర్ కింగ్.!
రాడనుకున్నారా.? రాలేడనుకున్నారా.? అక్కడున్నది పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లో నటించడం అసాధ్యమేమోనన్న అనుమానాలకు తెరపడింది. తిరిగి సినిమాల్లో నటిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించినా, ఎన్నో అనుమానాలు రీ-ఎంట్రీ సినిమా రిలీజయ్యేవరకూ (Vakeel Saab Review Pawan Kalyan) అలాగే వున్నాయి.
అసలు సినిమాని రిలీజ్ చేయనిస్తారా.? ఎన్నెన్ని రాజకీయ అడ్డంకుల్ని అధిగమించాలోనన్న చర్చ సర్వత్రా జరిగింది. అందరి అనుమానాల్నీ పటాపంచలు చేసేశాడు పవన్ కళ్యాణ్. రాజకీయ పరమైన అడ్డంకుల్ని ఈడ్చి అవతల పాడేశాడు పవర్ స్టార్.
జనంలోకి అది ప్రత్యక్షంగా కావొచ్చు, సినిమాలతో కావొచ్చు.. తాను వెళ్ళి తీరతానని పవన్ నిరూపించారు. మూడేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా ‘వకీల్ సాబ్’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. బాలీవుడ్ సినిమా ‘పింక్’కి రీమేక్ అయిన ‘వకీల్ సాబ్’ ఎలా వుందో తెలుసుకుందాం పదండిక..
సినిమా టైటిల్: వకీల్ సాబ్
నటీనటులు: పవన్ కళ్యాణ్, నివేదా థామస్, ప్రకాష్ రాజ్, అంజలి, శృతి హాసన్, అనన్య నాగళ్ళ తదితరులు.
సంగీతం: ఎస్ఎస్ థమన్
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
సినిమాటోగ్రఫీ: పి.ఎస్. వినోద్
సమర్పణ: బోనీ కపూర్
దర్శకత్వం: శ్రీరామ్ వేణు
నిర్మాణం: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
విడుదల తేదీ: 09 ఏప్రిల్ 2021
వకీల్ సాబ్ కథలోకి వెళ్ళిపోదాం..
వేర్వేరు ప్రాంతాలకు చెందిన ముగ్గురు యువతులు (నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ళ), హైద్రాబాద్‌లో ఉద్యోగాలు చేస్తూ జీవనం సాగిస్తుంటారు. అనుకోని పరిస్థితుల్లో ఓ రాజకీయ నాయకుడి కుమారుడి చేతికి చిక్కుతారు ఈ ముగ్గురూ. విధిలేని పరిస్థితుల్లో అతనిపై దాడి చేసి తప్పించుకుంటారు.
తన పలుకుబడిని ఉపయోగించి ఆ రాజకీయ నాయకుడి తనయుడు ముగ్గురు యువతుల్నీ వేధిస్తుంటాడు. రాజకీయ నాయకుడి పలుుకుబడి ముందు తమ జీవితాలు చిన్నవనే భావనతో కుంగిపోతున్న ఆ ముగ్గరు యువతులకు అండగా నిలుస్తాడు న్యాయవాది సత్యదేవ్.
ఇంతకీ, సత్య దేవ్ ఎవరు.? ముగ్గురు యువతుల్నీ సత్యదేవ్ ఎలా రక్షించాడు.? వారికి న్యాయం ఎలా చేశాడు.? ఈ క్రమంలో రాజకీయ పలుకుబడిని సత్యదేవ్ ఎలా ఎదుర్కొన్నాడు.? అన్నది తెరపై చూడాల్సిందే.
నటీనటులెలా చేశారంటే..
పవన్ కళ్యాణ్ నటనలో పూర్తిస్థాయి పవర్ కనిపిస్తుంది. బాలీవుడ్ సినిమా ‘పింక్’ రీమేక్ అయినా, పవన్ ఇమేజ్‌కి తగ్గట్టుగా పవర్ ఫుల్ సన్నివేశాల్ని దర్శకుడు క్రియేట్ చేస్తే.. పవన్ తనదైన మ్యాజిక్ చేశాడు. యాక్షన్ సీక్వెన్సెస్ కావొచ్చు, కోర్టు రూమ్ డ్రామాలో కావొచ్చు.. పవన్ సింప్లీ సూపర్బ్. సినిమా మొత్తాన్నీ తన భుజస్కంధాల మీద మోశాడు పవన్.. అని నిస్సందేహంగా చెప్పొచ్చ. పవన్ సెటిల్డ్ పెర్ఫామెన్స్, హై ఓల్టేజ్ పెర్ఫామెన్స్.. ఇలా చాలా వేరియేషన్స్ కనిపిస్తాయి ఈ సినిమాలో.
హీరోయిన్లలో నివేదా థామస్‌కి మంచి పాత్ర దక్కింది. అంజలి ఓకే. అనన్య నాగళ్ళ కూడా బాగానే చేసింది. శృతిహాసన్ పాత్ర సరిగ్గా పండలేదు. ఆమె నటన ఈ సినిమాకి పెద్దగా ఉపయోగపడలేదు. ఆమె నటించిన సన్నివేశాలు అంతగా ఆకట్టుకోవు.
ప్రకాష్ రాజ్ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రకాష్ రాజ్ – పవన్ కళ్యాణ్ మధ్య నడిచే కోర్టు రూమ్ డ్రామా సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయి. ప్రకాష్ రాజ్ పాత్ర, అతని నటన కొంతకాలం గుర్తుండిపోతుంది. మిగతా పాత్రధారులంతా తమ పాత్ర పరిధి మేర బాగానే చేశారు.
సాంకేతికంగా ఎలా వుందంటే..
‘వకీల్ సాబ్’ సినిమాకి పవన్ కళ్యాణ్ పవర్ ఎంత మ్యాజిక్ చేసిందో, తమన్ మ్యూజిక్ కూడా అంతే మ్యాజిక్ చేసింది. ‘ఫ్యాన్ బాయ్ మూమెంట్’ అని పవన్ అనుకున్నాడో ఏమో, కెరీర్ బెస్ట్ నేపథ్య సంగీతం అందించేశాడు. పవన్ పవర్‌ని ఎలివేట్ చేయడంలో కీలక పాత్ర పోషించింది నేపథ్య సంగీతం. కొన్ని చోట్ల సాధారణ సన్నివేశాలు కూడా తమన్ నేపథ్య సంగీతంతో మరో లెవల్‌కి వెళ్ళాయి. పాటలు సినిమా రిలీజ్‌కి ముందే హిట్టయిన విషయం విదితమే.
సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి మరో ప్రధాన ఆకర్షణ. డైలాగ్స్ బావున్నాయి. పవన్ పొలిటికల్ కెరీర్‌ని కూడా దృష్టిలో పెట్టకుని కొన్ని డైలాగులు రాసినట్టున్నారు.. అవి బాగా పేలాయి. ఆర్ట్ వర్క్ సహా మిగతా విభాగాలన్నీ బాగా పనిచేశాయి. ఎడిటింగ్ బావుంది.. అయితే, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ వరకు ఎడిటర్ ఇంకాస్త శ్రద్ధ పెట్టి వుండాల్సిందేమో. నిర్మాణపు విలువలు చాలా చాలా బావున్నాయి.
విశ్లేషణ
పవన్ కళ్యాణ్.. ఆ పేరులోనే పవర్ వుందంటారు పవన్ అభిమానులు. ఆ పవర్ పూర్తిస్థాయిలో తెరపై ఆవిష్కృతమైంది. రాజకీయాల్లోకి వెళ్ళడం సహా అనేక అనివార్య కారణాలతో సినిమాలకు దాదాపు మూడేళ్ళపాటు దూరమైపోయిన పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన సినిమా ఇది.
ఇటు షూటింగ్, అటు రాజకీయాలు.. వెరసి పవన్, ఈ సినిమాపై పూర్తి ఫోకస్ పెట్టాడా.? లేదా.? అన్న అనుమానాలు పటాపంచలైపోయాయ్. ఉదయం హైదరాబాద్‌లోని షూటింగ్ స్పాట్‌లో.. సాయంత్రం ప్రత్యేక విమానంలో విజవాడకి.. దాదాపు ప్రతిరోజూ ఇదే తంతు నడిచింది కొన్నాళ్ళపాటు. మధ్యలో కరోనా దెబ్బకి సినిమా షెడ్యూల్స్ అయోమయంలో పడిపోయాయి.
ఏడాది క్రితం రావాల్సిన సినిమా.. ఈ మధ్యలో చాలా జరిగాయి. అయినా, సినిమా ఔట్ పుట్ మాత్రం పక్కగా వుంది. ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు అనవసరమేమో అనిపిస్తాయి. కోర్టు రూమ్ డ్రామా విషయంలో ఒరిజినల్ పవర్ ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డాడు.
సినిమాటిక్ లిబర్టీ.. పవన్ పవర్‌ని ఎలివేట్ చేసేందుకు మాత్రం వినియోగించుకున్నాడు దర్శకుడు. కమర్షియల్ ఫ్లేవర్ అద్దడంలో దర్శకుడు చాలా జాగ్రత్తపడినట్లే కనిపిస్తోంది. ఓవరాల్‌గా మూడేళ్ళపాటు ఎదురు చూసిన పవన్ అభిమానులకి మంచి ట్రీట్ ఇచ్చింది ‘వకీల్ సాబ్’ టీమ్.
ఒరిజనల్ వెర్షన్‌ని చూసినవారికీ, చూడనివారికీ.. ‘వకీల్ సాబ్’ నచ్చేస్తాడు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పట్ల ఇంకాస్త శ్రద్ధ తీసుకుని వుంటే.. అసలు వంక పెట్టడానికే అవకాశముండేది కాదు.
ఒక చిన్న మాట: వకీల్ సాబ్.. బాక్సాఫీస్ పవర్ కింగ్.!