యావత్ భారతదేశం కరోనా వైరస్ అనే మహమ్మారితో యుద్ధం చేస్తోంది (India Fights Corona Virus Covid 19 It Is A War). ప్రపంచ వ్యాప్తంగా ఈ మహమ్మారి చాలా దేశాల్లో చాలా ప్రాణాల్ని తీసేసింది, తీసేస్తోంది కూడా. మిగతా దేశాలతో పోల్చితే, భారతదేశం ఈ విషయంలో ఎదుర్కొంటున్న సమస్య ఇంకాస్త భిన్నమైనది, బాధాకరమైనది.
దాదాపు 138 కోట్ల మంది ప్రజలున్న భారతదేశంలో, కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజువారీ కేసుల సంఖ్య 4 లక్షల మార్క్ దాటేయడమంటే చిన్న విషయం కాదు. ఈ క్రమంలో వైద్యులు, పోలీసులు, ఇతర సిబ్బంది పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు.
ఒక్కమాటలో చెప్పాలంటే, ఇది నిఖార్సయిన యుద్ధం. భారత నావికాదళానికి చెందిన యుద్ధ నౌకలు, భారత వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానాలు కూడా రంగంలోకి దిగాల్సి వస్తోంది. విదేశాల నుంచి అవసరమైన సామాగ్రిని తరలిస్తున్నాయి.
ఇంత జరుగుతున్నా, కొంతమంది ప్రజల్లో క్రమశిక్షణ కనిపించడంలేదు. ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించడమేంటి.? ప్రజలే స్వచ్ఛందంగా లాక్ డౌన్ పాటించాలి. ఎందుకంటే, భారతదేశ పౌరులుగా మనందరి బాధ్యత ఇది. రోడ్ల మీదకు గుంపులుగా వెళ్ళిపోవడం వల్ల మన ప్రాణాల్ని, మన కుటుంబ సభ్యుల ప్రాణాల్ని రిస్కలో పెట్టేసినట్లే కదా.?
కొందరు.. ఆ కొందరు చేసే తప్పిదం.. ఘోర తప్పిదమవుతోంది.. అత్యంత వేగంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న దరిమిలా, స్వీయ లాక్ డౌన్ అనేది ప్రతి ఒక్కరూ పాటించాల్సిందే. ప్రభుత్వాల వైఫల్యాలు, రాజకీయాలు.. ఇవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు. కానీ, ఈలోగా ప్రతి పౌరుడూ.. దేశ ప్రజలందరి భద్రత కోసం తనవంతుగా స్వీయ జాగ్రత్తలు (India Fights Corona Virus Covid 19 It Is A War) తీసుకోవాల్సిందే.