Table of Contents
Adbhutam Review.. పదేళ్ళ తర్వాతో, పాతికేళ్ళ తర్వాతో మనమెలా వుంటామో తెలిస్తే.? మనల్ని పాతకాలంలోకి కొన్ని జ్ఞాపకాలు లాగేస్తే.? ఈ ఆలోచన రానివారెవరుంటారు.! అలాంటి ఆలోచనల్లోంచి పుట్టుకొచ్చిన సినిమానే ‘అద్భుతం’. ఒక్కసారిగా గతంలోకి వెళ్ళిపోయి, గతంలో జరిగిపోయినదాన్ని సరిదిద్దాలనుకునే ప్రయత్నం.. ‘ప్లే బ్యాక్’ సినిమాలో చూసేశాం. మరి, అదే కాన్సెప్టుతో వచ్చిన ‘అద్భుతం’ సంగతేంటి.?
నిజానికి, రెండు సినిమాల కథాంశం ఒక్కటే. అక్కడ.. అంటే, ‘ప్లే బ్యాక్’ సినిమాలో తల్లి, కొడుకు.. దాంతోపాటుగా ఓ క్రైమ్ ఎలిమెంట్. ఇక్కడ.. అంటే, ‘అద్భుతం’ సినిమాలో జస్ట్ ఓ లవ్ స్టోరీ.
Adbhutam Review.. కథా కమామిషు..
హీరో, హీరోయిన్.. విడివిడిగా వారి వారి సమస్యల కారణంగా బలవన్మరణానికి పాల్పడాలనుకుంటారు. ఎవరికి వారు తమ మొబైల్ ఫోన్లకే చివరాఖరి మెసేజ్ పంపుకుంటారు. చిత్రమేంటంటే ఒకరి మెసేజ్ ఇంకొకరికి వెళుతుంది. ఇంకా చిత్రం.. ఆ రెండు ఫోన్ నెంబర్లూ ఒక్కటే. ఇదెలా సాధ్యం.? అదే అసలు కథ.

హీరోయిన్ ఐదేళ్ళ వెనక వుంటుంది.. హీరో ఐదేళ్ళ ముందుంటాడు. ఇద్దరూ ఒకరితో ఒకరికి ఫోన్ ద్వారా పరిచయమవుతుంది. తొలుత మెసేజ్‌లు, ఆ తర్వాత ఫోన్ కాల్స్. గతంలో వున్న హీరోయిన్‌తో ప్రస్తుతంతో వున్న హీరో మాట్లాడతాడు.. ఆమెను ప్రేమిస్తాడు కూడా.
కట్ చేస్తే, వీరిద్దరి మధ్య గతంలోనే ప్రేమ పుడుతుంది.. అది కాస్త లేటుగా తెలుస్తుంది. హీరోయిన్ గనుక, హీరోకి దగ్గరవ్వాలనే ప్రయత్నం చేస్తే.. హీరోకి ఏదో ఒక ఆపద తలెత్తుతుంటుంది. మరెలా.? అసలు ఈ ఇద్దరూ ఎలా కలుసుకున్నారు.? అది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
అద్భుతంగా చేశారా మరి.?
తేజ మంచి నటుడు. బాల నటుడిగానే తానేంటో నిరూపించుకున్నాడు. హీరో అయ్యాక కూడా, తన నటనా ప్రతిభతో ఆకట్టుకుంటున్నాడు. అయితే, కొన్ని సీన్లలో తేలిపోయాడు. హీరోయిన్ శివానీ రాజశేఖర్ ఆకట్టుకుంటుంది. ఇద్దరూ నటించారనడం కంటే తమ తమ పాత్రల్లో జీవించేందుకు ప్రయత్నించారు.
కాన్సెప్ట్ నిజానికి చాలా ఇంట్రెస్టింగ్‌గానే వుంది. కానీ, ఏం లాభం.? ఇంతకు ముందే ఇలాంటి సినిమా చూసేశాం. అదే ‘ప్లే బ్యాక్’. అందులో ఎమోషన్స్ బాగా పండాయ్. కానీ, ‘అద్భుతం’ సినిమాకొచ్చేసరికి ఎమోషన్స్ పెద్దగా వర్కువట్ కాలేదు. మ్యూజిక్ కూడా సోసోగా వుందంతే.
Also Read: సినీ, రాజకీయ ‘కథానాయకుడు’ పవన్ కళ్యాణ్.!
కొంచెం సాగతీతగా అనిపిస్తుంటుంది. లాజిక్‌కి అందని సన్నివేశాలు.. దానికి తోడు కొన్ని చోట్ల గందరగోళంగా సన్నివేశాలు.. కథాగమనానికి అడ్డం పడతాయి. కమెడియన్ సత్య కనిపించినంతసేపూ నవ్విస్తూనే వున్నాడు. అదొక మేజర్ ప్లస్ పాయింట్ ఈ సినిమాకి.
ఆ విషయంలో అద్భుతమే..
లవ్ స్టోరీ అనగానే, బీభత్సమైన వల్గారిటీ మామూలైపోయింది సినిమాల్లో. ఆ జోలికి వెళ్ళకుండా నీట్‌గా సినిమా తీసినందుకు దర్శకుడ్ని, దర్శకుడికి ఆ స్వేచ్ఛనిచ్చిన నిర్మాతలకీ హేట్సాఫ్ చెప్పాల్సిందే. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్పీగా వుండి వుంటే బావుండేది. నిర్మాణపు విలువలు బాగున్నాయి.
‘ప్లే బ్యాక్’ సినిమా చూసినవారికి, మళ్ళీ ఇంకోసారి అదే సినిమా చూస్తున్నట్లుంటుంది. చూడని వారికి మాత్రం, కాన్సెప్ట్ కొత్తగా అనిపిస్తుంది. ఓటీటీ బొమ్మ (Adbhutam Review) గనుక.. టైమ్ పాస్ కోసం ఓ లుక్కేయొచ్చు.
			        
														